Share News

Trafficking Network: వ్యభిచార ముఠా చెరలోని బంగ్లా బాలికకు విముక్తి

ABN , Publish Date - Aug 10 , 2025 | 04:43 AM

పాఠశాలకు వెళ్లి వచ్చే దారిలో పరిచయమైన మహిళ మాయమాటలు నమ్మి దేశం కానీ

Trafficking Network: వ్యభిచార ముఠా చెరలోని బంగ్లా బాలికకు విముక్తి

  • మాయమాటలు చెప్పి 15 ఏళ్ల అమ్మాయిని భారత్‌కు తెచ్చిన బంగ్లా మహిళ

  • హైదరాబాద్‌లో వ్యభిచార ముఠాకు అప్పగింత

  • 6 నెలలుగా బలవంతంగా వ్యభిచారం

  • విటుల వద్దకు తీసుకెళుతుండగా ఆటో నుంచి దూకి పోలీసుస్టేషన్‌లోకి బాలిక పరుగు

  • సాయం చేయమని పోలీసులకు వేడుకోలు

మదీన, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): పాఠశాలకు వెళ్లి వచ్చే దారిలో పరిచయమైన మహిళ మాయమాటలు నమ్మి దేశం కానీ దేశమొచ్చి వ్యభిచార కూపంలో ఇరుక్కొని ఆరు నెలలుగా నరకయాతన అనుభవిస్తోన్న ఓ బంగ్లాదేశీ బాలికను హైదరాబాద్‌ పోలీసులు రక్షించారు. ఆ బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయించిన బండ్లగూడ ఇస్మాయీల్‌నగర్‌కు చెందిన హాజిరా బేగం(41), మెహదీపట్నం మురాద్‌నగర్‌కు చెందిన షహనాజ్‌ ఫాతిమా (32), హాఫిజ్‌ బాబానగర్‌ సీ బ్లాక్‌కు చెందిన మహ్మద్‌ సమీర్‌(23)ను అరెస్టు చేశారు. చాంద్రాయణగుట్ట ఏసీపీ ఏ.సుధాకర్‌ కేసు వివరాలను వెల్లడించారు. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాకు చెందిన బాధిత బాలిక(15) తొమ్మిదో తరగతి విద్యార్థిని. రోజూ పాఠశాలకు వెళ్లొచ్చే క్రమంలో రూప అనే మహిళతో ఆమెకు పరిచయమైంది. కొద్దిరోజుల్లోనే బాలికకు దగ్గరైన రూప.. తనతో వస్తే భారత్‌లోని పర్యాటక ప్రదేశాలను చూపిస్తానని నమ్మబలికింది. తల్లిదండ్రులు, స్నేహితులకు విషయం చెప్పవద్దని చెప్పింది. రూప మాటలు నమ్మిన బాధిత బాలిక ఆమె వెంట వచ్చేందుకు సిద్ధమైంది. దీంతో ఓ రోజు తల్లీకూతుళ్లమంటూ రూప, బాధిత బాలిక అర్ధరాత్రి వేళ ఓ పడవలో నదిని దాటి కోల్‌కతా చేరుకున్నారు. అక్కడి నుంచి రైలు మార్గంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌ వచ్చారు. అనంతరం వ్యభిచారం నిర్వహించే మెహదీపట్నానికి చెందిన షహనాజ్‌ ఫాతిమాకు ఆ బాలికను అప్పగించి రూప వెళ్లిపోయింది. ఆ మరుసటి రోజు షహనాజ్‌ ఆ బాలికను హాజిరా బేగంకు అప్పగించింది. కొద్దిరోజులు బాలికను ఇంట్లో బంధించిన హజీరా.. నువ్వు అనుమతులు లేకుండా భారత్‌లోకి వచ్చావు, ఎవరికైనా తెలిస్తే జైలుకి వెళతావు.. అంటూ భయపెట్టి బలవంతంగా వ్యభిచారంలోకి దింపింది. అనంతరం మహ్మద్‌ సమీర్‌ ఆటోలో నిత్యం విటుల వద్దకు పంపించేంది. ఇలా, ఆరు నెలలుగా నరకయాతన అనుభవిస్తున్న బాలిక.. రోజు ఆటోలో వెళ్లేటప్పుడు ఓ పోలీసుస్టేషన్‌ను చూసేది. ఈ క్రమంలో శుక్రవారం ఆటోలో నుంచి దూకి పోలీసుస్టేషన్‌లోకి పరుగుతీసి తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు చెప్పి సాయం కోరింది. బాలిక ఇచ్చిన సమాచారం మేరకు మురాద్‌నగర్‌లోని షహనాజ్‌ ఫాతిమా స్థావరంపై దాడి చేసిన పోలీసులు అక్కడ పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురు మహిళలను గుర్తించారు. వారితోనూ బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్టు గుర్తించారు. ఇక, హాజిరా, ఫాతిమా, సమీర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రూప, హైదరాబాద్‌కు చెందిన సర్వర్‌ కోసం గాలిస్తున్నారు. బాధిత బాలికను సంరక్షణ కేంద్రానికి తరలించారు. బాలిక తల్లిదండ్రులను సంప్రదించేందుకు బంగ్లాదేశ్‌ రాయబార కార్యాలయం ద్వారా ప్రయత్నిస్తున్నారు. కాగా, హైదరాబాద్‌, పాతబస్తీ ప్రాంతంలో వ్యభిచారం చేస్తున్న వారిలో వందలాది మంది బంగ్లాదేశీ మహిళలతోపాటు బెంగాల్‌ మహిళలు ఉన్నట్టు సమాచారం ఉందని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - Aug 10 , 2025 | 04:43 AM