Share News

Phone Tapping: తిరుపతన్నకు అంత స్థోమత ఎక్కడిది?

ABN , Publish Date - Jan 04 , 2025 | 05:32 AM

పోలీసు శాఖలో ఆయన ఓ అదనపు డీసీపీ స్థాయి అధికారి. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టయి.. 9 నెలలుగా జైల్లో ఉన్నారు.

Phone Tapping: తిరుపతన్నకు అంత స్థోమత ఎక్కడిది?

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బెయిల్‌ కోసం సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాదితో వాదనలు

ఫీజు చెల్లింపుపై పోలీసుల ఆరా?

హైదరాబాద్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలో ఆయన ఓ అదనపు డీసీపీ స్థాయి అధికారి. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టయి.. 9 నెలలుగా జైల్లో ఉన్నారు. బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో తన తరఫున వాదనలు వినిపించేందుకు ఓ సీనియర్‌ న్యాయవాదిని నియమించుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబీలో సీక్రెట్‌ సెల్‌ ఏర్పాటు చేసి.. ప్రతిపక్ష నేతల, హైకోర్టు జడ్జిల, వ్యాపారవేత్తల ఫోన్‌ కాల్స్‌ను ట్యాపింగ్‌ చేశారనే ఆరోపణలపై కేసు నమోదై విచారణ సాగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన వారిలో సస్పెన్షన్‌కు గురైన అదనపు డీసీపీ తిరుపతన్న ఒకరు. బెయిల్‌ కోసం ఆయన హైకోర్టులో చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదీ.. ప్రముఖ సీనియర్‌ న్యాయవాది ఆయన తరఫున వాదిస్తున్నారు. అంత పెద్ద న్యాయవాదిని నియమించుకోవాలంటే ఫీజుగా పెద్దమొత్తమే చెల్లించుకోవాల్సి ఉంటుందన్న అభిప్రాయాలున్నాయి. తిరుపతన్నకు అంత ఆర్థిక స్థోమత ఎక్కడిదన్న చర్చ మొదలైంది. ఆయనకు ఎవరైనా సహాయం చేస్తున్నారా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇప్పటివరకు తిరుపతన్నతోపాటు పోలీసు అధికారులు ప్రణీత్‌రావు, భుజంగరావు మాజీ పోలీసు అధికారి రాధాకిషన్‌రావు అరెస్టయ్యారు. ఇతర నిందితులైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, ఒక టీవీ చానల్‌ యజమాని శ్రవణ్‌కుమార్‌రావు ఇంకా విదేశాల్లోనే తలదాచుకున్నారు. వీరిని ఇక్కడికి రప్పించడం కోసం తెలంగాణ పోలీసులు రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయించినా.. అది ఇప్పటివరకు అమలు కాలేదు. దీనిపై సంప్రదింపులు జరుపుతున్నామని డీజీపీ జితేందర్‌ ఇటీవలే ప్రకటించారు.

Updated Date - Jan 04 , 2025 | 05:32 AM