ఎండిపోతున్న మొక్కలు
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:59 AM
ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాం లో పట్టణాల్లో ప్రకృతివనాలు ఏర్పాటు చేశారు.

నీళ్లు, నిర్వహణ లేక ఎండిపోతున్న మొక్కలు
అధికారుల నిర్లక్ష్యంతో రూ.లక్షలు వృథా
వేసవిలో ప్రజలకు ఆహ్లాదం అందని ద్రాక్షే
కోట్లు పెట్టారు... నిర్వహణ మరిచారు....
ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాం లో పట్టణాల్లో ప్రకృతివనాలు ఏర్పాటు చేశారు. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో వీటి పరి స్థితి అధ్వానంగా మారింది. సరైన నిర్వహణ, అధికారుల పర్యవేక్షణ లేక మొక్కలు ఎండిపోతున్నాయి. పచ్చదనమేమో గానీ ప్రకృతి వనాలు ఉన్న ప్రాంతాలు పిచ్చిమొక్కలతో పాటు బీడు భూములను తలపిస్తున్నాయి. మొక్కలు దెబ్బతినకుండా కంచెలు, బోర్డులు ఏర్పాటు చేశారే తప్ప ఆ మొక్కల నిర్వహణకు నీళ్లు మాత్రం పోయడం లేదు. కనీసం ఎండిపోయిన వాటి స్థానాల్లో వేరే మొక్కలు నాటకపోవడంతో ప్రకృతి వనాలు కనుమరుగవుతున్నాయి. వేసవి మొదలవడంతో చాలా మంది సాయంత్రం సమయంలో ఆహ్లాదం కోసం ఊరి బయట ఉండే ప్రకృతి వనానికి వెళ్తే అక్కడ మొక్కలే కనిపించడం లేదు. సరిగ్గా నిర్వహించలేనప్పుడు ఎందుకు ఏర్పాటు చేశారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి,నల్లగొండటౌన)
నల్లగొండ పట్టణంలోని 48 వార్డుల పరిధిలో 34 పట్టణ ప్రకృతివనాలను సుమారు రూ. 2.84 కోట్లు వెచ్చించారు. చాలా చోట్ల స్థలం లేకపోవడంతో జనావాసాలకు దూరంగా ఎవ్వరికీ ఉపయోగపడని ప్రాంతంలో ఏర్పాటు చేశారు. లక్షలు పెట్టి ఏర్పాటు చేసినప్పటికీ నిర్వహణ గాలికి వదిలేయడంతో నిధులు వృథా అవుతున్నాయి. కొన్నిచోట్ల ప్రకృతివనాల చుట్టూ కంచె ఏర్పాటు చేయకపోవడంతో పశువులు సంచరించి నాటిన మొక్కలను తినేశాయి. వనాల నిర్వహణకు ప్రత్యేక నిధులు కూడా విడుదల చేయలేదు. ప్రస్తుతం సగం వనాల్లో 80 శాతంపైగా మొక్కలు ఎండిపోయాయి.
అయితే కొంత కాలంగా ఈ ప్రకృతి వనాలపై మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు ఉపయోగపడకుండా పోతున్నాయి. చాలా చోట్ల పిచ్చిమొక్కలతో పాటు నాడు పాతిన మొక్కలకు ఊతంగా ఏర్పాటు చేసిన కర్రలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా పట్టణంలోని 43వ వార్డు పరిధిలో రైల్వేస్టేషనకు వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన ప్రకృతివనం పూర్తిగా నిరుపయోగంగా మారింది. అది కాస్త కేవలం బోర్డుకే పరిమితమైంది. లక్షలు వెచ్చించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మొక్కలు నాటినా నిర్వహణ లోపం కారణంగా నిరుపయోగంగా మారడమే కాకుండా పిచ్చిమొక్కలు పెరగడంతో గేటుకు తాళాలను వేశారు.
ప్రకృతి వనాల నిర్వహణ చేపట్టాలి
పట్టణాల్లో పచ్చదనాన్ని పెంచే లక్ష్యంగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనాల నిర్వహణ అధ్వానంగా తయారైంది. మొక్కలు చెట్లు పెరగాల్సిన చోట పిచ్చిమెక్కలు, గడ్డి పెరిగి నిరుపయోగంగా మారాయి. మునిసిపల్ అఽధికారులు ఇప్పటికైనా మేల్కొని పట్టణ ప్రకృతివనాల నిర్వహణ చేట్టాలి. తద్వారా పట్టణ ప్రజలందరికీ వేసవిలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలి.
- బొల్లం మధు, నల్లగొండ
ప్రకృతి వనాలు మానిటరింగ్ చేస్తున్నాం
పట్టణ ప్రకృతి వనాలను ఎప్పటికప్పుడు పర్య వేక్షిస్తున్నాం.ఎక్కడ కూడా మొక్కలు చనిపోలేదు. ఇప్ప టి వరకు ఎండ తీవ్రత లేనందున నే టి సరఫరా చేయలేదు. అవసరమైతే వేసవిలో ట్యాంకర్లను ఏర్పాటు చేసి మొక్కలను సంరక్షిస్తాం.మొక్కల సంరక్షణ కోసం ప్రణాళికాబద్ధం గా ముందుకు సాగుతున్నాం. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పట్టణ ప్రకృతి వనాలను విస్తరింప జేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- సయ్యద్ ముసాబ్ అహ్మద్, మునిసిపల్ కమిషనర్