Share News

Minister Duddilla Sridhar Babu: ఫోన్‌ట్యాపింగ్‌ చేసిన వారికి శిక్ష తప్పదు

ABN , Publish Date - Aug 12 , 2025 | 06:16 AM

గత ప్రభుత్వం ఫోన్‌ట్యాపింగ్‌తో చాలా పెద్ద తప్పు చేసిందని, దీనిపై తమ ప్రభుత్వం విచారణ జరిపిస్తున్నదని, తప్పు..

Minister Duddilla Sridhar Babu: ఫోన్‌ట్యాపింగ్‌ చేసిన వారికి శిక్ష తప్పదు

  • విచారణలో రాజకీయ జోక్యం ఉండదు

  • మీడియాతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

కరీంనగర్‌ అర్బన్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం ఫోన్‌ట్యాపింగ్‌తో చాలా పెద్ద తప్పు చేసిందని, దీనిపై తమ ప్రభుత్వం విచారణ జరిపిస్తున్నదని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. విచారణల్లో అన్ని విషయాలు పూర్తి స్థాయిలో వెల్లడవుతాయని, ఇందులో రాజకీయ జోక్యం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణ జరుపుతున్న అధికారుల బృందం ఎవరిని విచారించాలనేది నిర్ణయిస్తుందని చెప్పారు. సోమవారం ఆయన కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ముందుకుసాగుతుందని అన్నారు. రైతులకు న్యాయం చేసే విషయంలో తాము వెనుకడుగువేయబోమన్నారు. బీసీల రిజర్వేషన్ల బిల్లుపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు ఢిల్లీ ధర్నాలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం బిల్లు పార్లమెంట్‌లో 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై అతి త్వరలో కార్యాచరణ ఉంటుందన్నారు. పారిశ్రామిక కారిడార్‌కు కేంద్రం ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు ప్రకటించిందని, దానికి అనుకూలంగా హైదరాబాద్‌, కరీంనగర్‌లో రాజీవరహదారి నుంచి రెండు గంటల్లో హైదరాబాద్‌ విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Updated Date - Aug 12 , 2025 | 06:16 AM