Share News

Prabhakar Rao SIT Inquiry: రాతపూర్వక ఆదేశాలిచ్చానా

ABN , Publish Date - Jun 10 , 2025 | 05:44 AM

తడబాటు లేదు.. భయం, ఆందోళన అసలే లేవు. ప్రశ్నలకు.. ఎదురు ప్రశ్నలే సమాధానాలు. విచారణ తీరునంతా ముందే ఊహించినట్లు ఎదురుదాడి ధోరణి. మరీ లోతుగా ప్రశ్నిస్తే.. సమాధానాల దాటవేత. ఇదీ.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు సిట్‌ అధికారుల ఎదుట వ్యవహరించిన తీరు.

Prabhakar Rao SIT Inquiry: రాతపూర్వక ఆదేశాలిచ్చానా

  • ఫోన్‌ ట్యాపింగ్‌కు ఆదేశాలిచ్చినట్లు ఉంటే చూపించాలి

  • నా కింద పనిచేసిన సిబ్బంది.. అరెస్టు సమయంలో ఇచ్చిన వాంగ్మూలాలు చెల్లుబాటు కావు

  • ఎవరి ఫోన్లనూ అక్రమంగా ట్యాపింగ్‌ చేయించలేదు

  • ప్రణీత్‌రావు చేసిన పనితో నాకేం సంబంధం?

  • అక్కడేం జరిగిందో ఉన్నతాధికారులందరికీ తెలుసు

  • సిట్‌తో ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు వ్యాఖ్యలు

  • పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలు

  • ఎదురుదాడి ధోరణిలో సమాధానాలు.. దాటవేత

  • రివ్యూ కమిటీని ముగ్గులోకి లాగే ప్రయత్నం

  • 8 గంటల పాటు విచారణ.. 11న మళ్లీ రావాలన్న సిట్‌

హైదరాబాద్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): తడబాటు లేదు.. భయం, ఆందోళన అసలే లేవు. ప్రశ్నలకు.. ఎదురు ప్రశ్నలే సమాధానాలు. విచారణ తీరునంతా ముందే ఊహించినట్లు ఎదురుదాడి ధోరణి. మరీ లోతుగా ప్రశ్నిస్తే.. సమాధానాల దాటవేత. ఇదీ.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు సిట్‌ అధికారుల ఎదుట వ్యవహరించిన తీరు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పలు మలుపుల తర్వాత ఎట్టకేలకు సోమవారం సిట్‌ అధికారుల ముందు విచారణకు ప్రభాకర్‌రావు హాజరయ్యారు. తాను ఎవరి ఫోన్లనూ అక్రమంగా ట్యాపింగ్‌ చేయించలేదని తెలిపారు. ఇందుకు సంబంధించి తాను రాతపూర్వకంగా ఇచ్చిన ఆదేశాలేవైనా ఉంటే చూపించాలన్నారు. తన కింద పనిచేసిన సిబ్బంది.. అరెస్టు సమయంలో ఇచ్చిన వాంగ్మూలాలు చెల్లుబాటు కావన్నారు. తనపై ఇంకా ఉన్నతాధికారులు ఉన్నారని, ఆనాడు ఏం జరిగిందో వారందరికీ తెలుసనని పేర్కొన్నారు. మొత్తంగా సిట్‌ విచారణ జరిగే తీరుపై పూర్తి అవగాహనతో వచ్చిన ప్రభాకర్‌రావు.. పోలీసుల ప్రశ్నలను తిప్పికొట్టినట్లు తెలిసింది. సోమవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీ్‌సస్టేషన్‌కు వచ్చిన ప్రభాకర్‌రావును పీఎ్‌సలోని రెండో అంతస్తులో ఉన్న సిట్‌ కార్యాలయంలో డీసీపీ విజయకుమార్‌, ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలోని బృందం ప్రశ్నించింది. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డు చేశారు. సుదీర్ఘకాలం పోలీసుశాఖలో పనిచేసి ఐజీ స్థాయిలో పదవీ విరమణ పొందిన ప్రభాకర్‌రావు.. ఆపై ఓఎ్‌సడీ హోదాలో ఎస్‌ఐబీలో కొనసాగిన విషయం తెలిసిందే. దీంతో ఆ స్థాయి నేపథ్యం ఉన్న మాజీ పోలీసు అధికారిని విచారించాలంటే అందుకు తగ్గట్లే ప్రశ్నలు ఉండాలని ఉన్నతాధికారులు భావించారు. ఈ మేరకు కేసుపై ఇటీవలే సమీక్ష నిర్వహించి పలు కీలక అంశాల ఆధారంగా ప్రభాకర్‌రావును ప్రశ్నించాలని సిట్‌ బృందానికి సూచించారు. మరోవైపు ప్రభాకర్‌రావు సైతం పరారీలో ఉన్న పదిహేను నెలల కాలంలో.. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన వారు ఇచ్చిన వాంగ్మూలాలను తెప్పించుకుని అధ్యయనం చేసినట్లు సమాచారం. తద్వారా సిట్‌ ప్రశ్నావళి ఏ విధంగా ఉంటుందన్నదానిపై స్పష్టమైన అవగాహనతో విచారణకు హాజరవుతారని, ఆయన నుంచి వాస్తవాలు బయట పెట్టించాలంటే అత్యంత నేర్పు, ఓర్పు అవసరమని ఉన్నతాధికారులు భావించారు. ఈమేరకు ఒక్కో అం శంపై లోతుగా ప్రశ్నించేలా వ్యూహం సిద్ధం చేశారు.


ట్యాపింగ్‌ ఎందుకు చేయించారు?

‘‘ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి డిజిగ్నేటెడ్‌ అధికారిగా మీకున్న పరిధి ఏంటి? ట్యాపింగ్‌ చేయమని ఫోన్‌ నంబర్లను మీకు ఎవరిచ్చారు? ఎవరి ఆదేశాలతో చేయించారు? ప్రైవేటు వ్యక్తి అయిన శ్రవణ్‌రావు ఈ ఫోన్‌ ట్యాపింగ్‌లోకి ఎలా ప్రవేశించాడు?’’ అంటూ సిట్‌ అధికారులు ప్రభాకర్‌రావును అడిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రభాకర్‌రావు ఏమాత్రం తడబడకుండా..ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి తాను ఇచ్చిన రాతపూర్వక ఆదేశాలుంటే చూపించాలని అన్నట్లు సమాచారం. తన డ్యూటీ తాను చేశానని సమర్థించుకోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కాగా, ప్రభాకర్‌రావు తన పదవికి రాజీనామా చేసిన రోజు రాత్రి మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు ఎస్‌ఐబీ ఆఫీసులోకి అక్రమంగా ప్రవేశించడం, ఫోన్‌ ట్యాపింగ్‌ ఆధారాలున్న హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేయడంపై ప్రశ్నించగా.. ఆ ఘటనతో తనకేం సంబంధమని ప్రభాకర్‌రావు ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. ‘‘ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నమోదు కాగానే అమెరికా ఎందుకు వెళ్లారు? అది ముందస్తు షెడ్యూల్‌ కాదు కదా?’’అని సిట్‌ అధికారులు ప్రశ్నించగా.. అనారోగ్య కారణాలతో మెరుగైన వైద్యం కోసం వెళ్లానని ప్రభాకర్‌రావు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల తన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా తన తరఫు న్యాయవాది వాదించిన అంశాన్ని ఈ సందర్భంగా దర్యాప్తు అధికారుల ముందు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.


రివ్యూ కమిటీలో సభ్యుడిని కాదు..

చీఫ్‌ సెక్రటరీ, హోంశాఖ సెక్రటరీ ఆధ్వర్యంలోని రివ్యూ కమిటీకి ఫోన్‌ట్యాపింగ్‌ గురించి ప్రభాకర్‌రావు ఏనాడూ సమాచారం ఇవ్వలేదంటూ నాటి హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా గతంలో హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఇదే విషయాన్ని సిట్‌ అధికారులు ప్రభాకర్‌రావుకు వివరిస్తూ, ‘‘మీ సొంత నిర్ణయాల ప్రకారమే ట్యాపింగ్‌ చేయించారా? ఆదేశాలు ఇచ్చిందెవరు? ట్యాపింగ్‌ తర్వాత ఆ ఆడియోలను మీరు ప్రభుత్వంలోని వారికి ఎవరికైనా పంపారా?’’ అని సిట్‌ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే.. పోలీసు వ్యవస్థలో తనపై ఇంకా అధికారులున్నారని, అక్కడేమి జరిగిందో ఉన్నతాధికారులందరికీ తెలుసునని ప్రభాకర్‌రావు జవాబిచ్చినట్లు సమాచారం. ఆయనను ఎనిమిది గంటలపాటు విచారించిన అధికారులు.. తిరిగి ఈ నెల 11న తదుపరి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు.

సహకరించే అవకాశాలు తక్కువే..

పోలీసుశాఖలో సుదీర్ఘకాలం కొనసాగిన ప్రభాకర్‌రావు విచారణకు సహకరించే అవకాశాలు తక్కువేనని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో సాంకేతిక ఆధారాల ద్వారా ఆయన నేరాన్ని నిర్ధారించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాకర్‌రావు బెయిల్‌ పిటిషన్‌పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 5కి వాయిదా వేయడంతో.. ఆయనను అప్పటివరకు ఈ కేసులో అరెస్టు చేసే అవకాశాలు పోలీసులకు ఏమాత్రం లేవు. ఇదే ధీమాతో ప్రభాకర్‌రావు తొలిరోజు వ్యవహరించారని ఉన్నతాధికారులు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు. ఇక ఈ నెల 11న తదుపరి విచారణకు హాజరయ్యే సమయంలో ప్రభాకర్‌రావు తాను ఉపయోగిస్తున్న రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేయాలని సిట్‌ అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఎన్నికల సమయంలో వాడిన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, మ్యాక్‌ బుక్‌ను కూడా సిట్‌కు అప్పగించాలని ప్రభాకర్‌రావును ఆదేశించినట్లు సమాచారం.

Updated Date - Jun 10 , 2025 | 05:46 AM