Share News

పాఠాలతో పాటు పరోపకారం

ABN , Publish Date - Jan 07 , 2025 | 01:19 AM

విద్యార్థులకు పాఠాలతో పాటు పరోపకారిగా ఉంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు గురుజ మహేష్‌.

పాఠాలతో పాటు పరోపకారం
విద్యార్థినికి ఆర్థికసాయం అందజేస్తున్న మహేష్‌

పాఠాలతో పాటు పరోపకారం

ఆదర్శంగా నిలుస్తున్న గురుజ మహేష్‌

సాయం చేస్తూ, అందిస్తున్న ఉపాధ్యాయుడు

దివ్యాంగులకు, విద్యార్థులకు చేయూత

నాంపల్లి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు పాఠాలతో పాటు పరోపకారిగా ఉంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు గురుజ మహేష్‌. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్న చదువు ప్రాముఖ్యత తెలియజేస్తున్నారు. మరోపక్క సమాజానికి సేవ చేయాలనే తపనతో తన సంపాదనలో ఎదుటివారికి కొంత ఖర్చు చేస్తు దాతలు, ఎనఆర్‌ఐల సహకారంతో దివ్యాంగులకు, చదువుకునే విద్యార్థులకు సహాయం చేస్తు ఆదర్శంగా నిలుస్తున్నాడు. చండూరు మునిసిపల్‌ కేంద్రానికి చెందిన గురుజ మహేష్‌ ప్రస్తుతం నాంపల్లి మండలంలోని యూపీఎస్‌ దామెర పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. మహేష్‌ 14 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ సామాజిక కార్యకర్తగా కొనసాగుతున్నాడు. ఉద్యోగ రీత్యా పలు పాఠశాలల్లో పనిచేసిన ఆయన ఆ పాఠశాల విద్యార్థులకు చదువు యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ స్కూల్‌ మానివేసిన, స్కూల్‌కు రాకపోయిన విద్యార్థుల ఇంటి వద్దకు వెళ్లి వారి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. స్కూల్‌కు వచ్చే విధంగా వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఒకవేళ వారి ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే విద్యార్థులకు నోట్‌బుక్స్‌, పెన్నులు, స్కూల్‌ బ్యాగులు, వాటర్‌ బాటిల్స్‌తో పాటు ఇతర వస్తువులను అందజేసి ఆర్థిక సహాయం అందిస్తూ తన సేవాతత్వాన్ని చాటుకుంటున్నాడు. పాఠశాల ఏదైన సమాజసేవలో మార్పులేదు. విద్యార్థులు గురుకుల, మోడల్‌స్కూల్‌, నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచితంగా వాటికి సంబంధించిన మెటీరియల్‌ను అందించాడు.

పలువురికి ఉపాధి

అనకాపల్లి జిల్లాకు చెందిన పాము ప్రసాద్‌ అనే వ్యక్తి చర్మవ్యాధితో బాధపడుతుండగా అతనికి జీవనోపాధి కోసం రేకులడబ్బాను ఏర్పాటు చేసి కిరాణ సామగ్రి అందించాడు. దివ్యాంగ దంపతులైన కోనసీమ జిల్లాకు చెందిన రాజు రమణిలకు రూ. 1.20 లక్షల రూపాయలతో ఎలక్ర్టానిక్‌ స్కూటీని అందించి, కరీంనగర్‌ జిల్లాకు చెందిన రాజుకు లక్ష రూపాయలతో కిరాణషాపు, ఆముదాల వలసకు చెందిన దివ్యాంగురాలు స్వప్నకు లక్ష రూపాయలతో గాజుల దుకాణాన్ని ఏర్పాటు చేసి అందించాడు.

విద్యార్థులకు అండగా...

నెవిళ్లగూడెం నుంచి నాంపల్లికి వెళ్లే విద్యార్థులు నడుచుకుంటూ వెళ్తున్నారని తెలిసి 11 మంది విద్యార్థులకు సైకిళ్లు ఇప్పించాడు. నేరేళ్లపల్లి పాఠశాలలో రూ.30వేలతో పాఠశాలలో ఉన్న ప్రతి విద్యార్థికి స్టీల్‌ వాటర్‌ బాటిళ్లు, యూపీఎస్‌ దామెర పాఠశాలలో రూ.70వేలు విలువ జేసే డెస్క్‌ బెంచీలు, ప్రతి సంవత్సరం మండలంలో కొన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు రూ.2లక్షల మేరకు నోట్‌బుక్స్‌, పెన్నులు అందజేస్తాడు. ఎంబీబీఎస్‌, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌, హాస్టల్‌ ఫీజులు చెల్లిస్తూ వారికి అండగా నిలుస్తున్నాడు. కేతేపల్లి గ్రామానికి చెందిన పల్లేటి యాదమ్మ మల్లే్‌షలు అనారోగ్యంతో మృతి చెందాడు. వారి పిల్లల చదువుకోసం 7 నెలల పాటు ప్రతీ నెలా రూ.10వేలు అందజేస్తున్నాడు.

విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు అహర్నిషలు కృషి చేస్తున్నాను. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరేందుకు నా వంతు కృషి చేస్తున్నాను. స్ఫూర్తి పౌండేషన, ఎక్స్‌ట్రా మొబైల్‌ ఫౌండేషన, సత్యం చారిట్రబుల్‌ ట్రస్ట్‌, బిగ్‌హెల్ప్‌ ఫౌండేషన, నల్లగొండ ఓఆర్‌జీ సంస్థ, స్నేహ హస్తాల ఫౌండేషన, బిగ్‌ ద స్మైల్‌ ఫౌండేషన్ల సహకారంతో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి చేయూతనివ్వడం ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని పాఠశాలల్లో విద్యార్థుల అవసరాల కోసం కృషి చేస్తాం.

- గురుజ మహేష్‌, ఉపాధ్యాయుడు, యూపీఎస్‌ దామెర పాఠశాల

Updated Date - Jan 07 , 2025 | 01:19 AM