Share News

YV Subba Reddy: వైవీ సుబ్బారెడ్డి మా భూములు ఆక్రమిస్తున్నారు

ABN , Publish Date - Jan 23 , 2025 | 04:42 AM

వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణలతా రెడ్డి తమ భూములను ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని, ఈ అంశంలో పోలీసులు వారికి సహకరిస్తున్నారని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది.

YV Subba Reddy: వైవీ సుబ్బారెడ్డి మా భూములు ఆక్రమిస్తున్నారు

పోలీసులు వారికి సహకరిస్తున్నారు.. టీ హైకోర్టులో పిటిషన్‌

భూములు తమవేనన్న వైవీ.. పోలీసుల జోక్యం వద్దన్న కోర్టు

హైదరాబాద్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణలతా రెడ్డి తమ భూములను ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని, ఈ అంశంలో పోలీసులు వారికి సహకరిస్తున్నారని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. కొప్పుల మల్లారెడ్డి, జీ నర్సింహారెడ్డి, షేక్‌ ఇస్లాముద్దీన్‌ అనే వ్యక్తులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదిస్తూ.. వైవీ సుబ్బారెడ్డి పోలీసులు, వారి ఉన్నతాధికారులను ప్రభావితం చేసి పిటిషనర్లను ఖాళీ చేయించాలని చూస్తున్నారని తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి దంపతుల తరఫున సీనియర్‌ న్యాయవాది కే వివేక్‌రెడ్డి వాదిస్తూ.. సదరు భూమిపై తమకే టైటిల్‌ ఉందని, రిజిస్టర్డ్‌ సేల్‌ డీడ్‌ ద్వారా భూమి కొనుగోలు చేశారని తెలిపారు. హోంశాఖ తరఫున న్యాయవాది మహేశ్‌రాజే వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు, ప్రతివాదులు గచ్చిబౌలి పోలీ్‌సస్టేషన్‌లో పరస్పరం కేసులు పెట్టుకున్నారని, పోలీసులు సదరు కేసులపై దర్యాప్తు చేయడం తప్ప సివిల్‌ వివాదంలో జోక్యం చేసుకోవడం లేదని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ కేసుకు సంబంధించిన సివిల్‌ వివాదంలో గచ్చిబౌలి పోలీసులు జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. అయితే శాంతిభద్రతలకు భంగం కలిగినా.. అనుకోని ఘటనలు జరిగినా చర్యలు తీసుకోవచ్చంటూ తదుపరి విచారణ ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది.

Updated Date - Jan 23 , 2025 | 04:42 AM