High Court: చట్టవిరుద్ధంగా రేడియల్ రోడ్డు భూసేకరణ
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:40 AM
ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్‌ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు ఆర్‌ఆర్‌ఆర్ రావిర్యాల్ ఇంటర్ ఛేంజ్
హైకోర్టులో యజమానుల పిటిషన్
అంతా నిబంధనల ప్రకారమేనని ప్రభుత్వం సమాధానం.. రేపు విచారణ
హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) నుంచి రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) రావిర్యాల్ ఇంటర్ ఛేంజ్ వరకు నిర్మించతలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు కోసం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ చట్టవిరుద్ధమని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్, కందుకూరు మండలం తిమ్మాపూర్, లేమూర్ తదితర గ్రామాలకు చెందిన దాదాపు 45 మంది రైతులు, భూయజమానులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. భూసేకరణ కోసం ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చినట్లు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, పత్రికల్లో చూసి తెలుసుకున్నామని పిటిషనర్లు పేర్కొన్నారు. ఎవరి భూమి ఎంత సేకరిస్తున్నారనే వివరాలు లేకుండా తమ పేర్లు, సర్వే నెంబర్లతో నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. అభ్యంతరాలు దాఖలు చేయడానికి, వ్యక్తిగతంగా వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం సమాధానం ఇస్తూ గతేడాది అక్టోబర్ 28న నోటిఫికేషన్ ఇచ్చామని, గ్రామసభ కూడా నిర్వహించామని తెలిపింది. పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరిస్తూ ప్రొసీడింగ్స్ సైతం ఇచ్చామని పేర్కొంది. చట్టంలో పేర్కొన్న ప్రక్రియను అనుసరిస్తున్నట్లు తెలిపింది. అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని పేర్కొంది. ఈ పిటిషన్‌పై సోమవారం జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ జరపనుంది.