Dr. D. Nageswar Reddy: మనిషిని బట్టే మందు
ABN , Publish Date - Oct 24 , 2025 | 04:27 AM
ఇద్దరికి తీవ్ర విష జ్వరం వచ్చింది. ఓ వైద్యుడి దగ్గరికి వెళితే వారికి ఒకే రకమైన మందులను, ఒకే మోతాదులో సూచించారు.
ఫార్మకో జినోమిక్స్‌పై అధ్యయనం జరిపిన ఏఐజీ వైద్యులు కల్యాణ్, ఉషతో నాగేశ్వర్‌రెడ్డి
జబ్బును బట్టి అందరికీ ఒకే మెడిసిన్ సరికాదు
జన్యుక్రమం, శారీరతత్వానికి అనుగుణంగా వేర్వేరు మందులు
అందుకు వీలు కల్పించేలా ఫార్మకోజినోమిక్స్ టెస్టు
ఏఐజీ ఆస్పత్రిలో రూ.5 వేలకే.. ఏఐ ఆధారంగా కచ్చితమైన విశ్లేషణ
ఒకసారి పరీక్ష చేయించుకుంటే జీవితాంతం ప్రయోజనం
ఆ రిపోర్టుతో ఏ డాక్టర్ వద్ద అయినా కచ్చితమైన వైద్యం
30శాతం మందికి ఒకే మందు సరిపడటం లేదని గుర్తించాం
ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి వెల్లడి
అందుకు వీలు కల్పించేలా ఫార్మకోజినోమిక్స్ టెస్టు
ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డి. నాగేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఇద్దరికి తీవ్ర విష జ్వరం వచ్చింది. ఓ వైద్యుడి దగ్గరికి వెళితే వారికి ఒకే రకమైన మందులను, ఒకే మోతాదులో సూచించారు. అవి వాడితే ఒకరి వేగంగా కోలుకుంటే.. మరొకరిలో ఏమాత్రం ప్రయోజనం కనిపించలేదు. వేర్వేరు వ్యక్తుల శరీరతత్వం వేర్వేరుగా ఉండటం, ఆయా మందులకు వేర్వేరుగా స్పందించడమే దానికి కారణం. అలా కాకుండా రోగి శరీరతత్వానికి అనుగుణంగా ఏ మందు, ఎంత మోతాదులో, ఎన్నిసార్లు ఇవ్వాలని నిర్ణయించడమే ప్రెసిషన్/పర్సనలైజ్డ్ మెడిసిన్. ఇలా కచ్చితత్వంతో మందులు సూచించడానికి తోడ్పడేదే ‘ఫార్మకోజినోమిక్స్’ పరీక్ష. వ్యక్తుల శారీరక పరిస్థితి, జన్యుక్రమాన్ని పరిశీలించి, పూర్తిస్థాయిలో విశ్లేషించే ఈ అత్యాధునిక పరీక్ష ఏఐజీ ఆస్పత్రిలో అందుబాటులోకి వచ్చినట్టు ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఫార్మకోజినోమిక్స్ పరీక్ష, ప్రయోజనాలపై ఆయన గురువారం జూమ్ సమావేశం నిర్వహించారు. ఔషధాలకు ప్రతి వ్యక్తి శరీరం భిన్నంగా స్పందిస్తుందని నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఒకరికి బాగా పనిచేసే మందు మరొకరికి ఫలించకపోవచ్చు, ఒక్కోసారి హానికరం కూడా కావొచ్చని చెప్పారు. ఈ అంశానికి సంబంధించి ఏఐజీ ఆస్పత్రిలో డాక్టర్ కల్యాణ్ ఉప్పలూరి, డాక్టర్ ఉష ఆధ్వర్యంలో 2వేల మందిపై అధ్యయనం చేశామని వెల్లడించారు. సాధారణంగా ఇచ్చే మందులు ప్రతి 100 మందిలో 70-80 మందికి పనిచేస్తే.. మిగతా 20-30 మందిలో అంతగా ప్రభావం చూపడం లేదని గుర్తించామని తెలిపారు. గుండె జబ్బు బాధితులకు రక్తనాళాల్లో అడ్డంకుల నియంత్రణ కోసం మందులు ఇస్తే.. కొందరిలో తగ్గకపోగా, తిరిగి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరుతున్నారని నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ప్రతీ ముగ్గురిలో ఒకరు తమ జన్యునిర్మాణానికి అనువుగాలేని మందులు తీసుకుంటున్నారని.. ఇది రోగి భద్రత, వైద్య ఖర్చులపై ప్రభావం చూపుతుందని తమ అధ్యయనంలో తేలిందని వివరించారు. సాయంతో ఎవరికి ఏ మందులు, ఏ మోతాదులో అవసరమో అంతే వినియోగించవచ్చని వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రెసిషన్ మెడిసిన్ వైపు పరిశోధన చేశామని తెలిపారు.
తక్కువ ధరలో పరీక్ష అందుబాటులోకి..
వైద్య రంగానికి చెందిన ఏఐ సంస్థ ‘జీన్‌పవర్‌ఎక్స్’తో కలిసి.. ప్రతి వ్యక్తి శరీరతత్వం, జన్యుక్రమం ఆధారంగా కచ్చితత్వంతో మందులు సూచించేందుకు వీలుకల్పించే ‘ఫార్మకోజినోమిక్స్’ పరీక్షను ప్రారంభించామని నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. తమ ఆస్పత్రిలో చేసే ఫార్మకోజినోమిక్స్ టెస్టు వ్యక్తి జన్యుక్రమాన్ని కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో విశ్లేషించి.. గుండె వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్, జీర్ణాశయ సంబంధ వ్యాధులు, నాడీ వ్యవస్థ సమస్యలు, మానసిక రుగ్మతలు, నొప్పి నియంత్రణ కోసం ఉపయోగించే మందులకు వారి శరీరం ఎలా స్పందిస్తుందో అంచనా వేస్తుందని చెప్పారు. పరీక్షలో వెల్లడైన అంశాలతో ప్రత్యేకమైన నివేదికను ఇస్తామని తెలిపారు. దీనిని ఒకసారి చేయించుకుంటే జీవితాంతం వినియోగించుకోవచ్చని వెల్లడించారు. ఏ దేశంలోనైనా, ఏ వైద్యుడికైనా ఈ నివేదికను చూపి కచ్చితమైన మందులు పొందవచ్చని తెలిపారు. పశ్చిమ దేశాల్లో ఇలాంటి జెనొమిక్ పరీక్షకోసం రూ.80 వేల వరకు తీసుకుంటారని.. ఏఐజీలో కేవలం రూ.5 వేలకే అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. తమ ఆస్పత్రికి వచ్చే ఔట్‌పేషెంట్, ఇన్‌పేషెంట్లకు ఈ పరీక్ష చేస్తామని తెలిపారు.