నేటినుంచి పాతగుట్ట బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:23 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసిం హస్వామి దేవస్థానానికి అనుబంధ పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది.

9న ఎదుర్కోళ్లు
10న కల్యాణోత్సవం
11న దివ్యవిమాన రథోత్సవం
విద్యుత్ దీపాలతో ఆలయం ముస్తాబు
ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ సిబ్బంది
భువనగిరి అర్బన్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసిం హస్వామి దేవస్థానానికి అనుబంధ పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేటి(శుక్రవారం) నుంచి 13వ తేదీ వరకు పాతగుట్ట ఆలయంలో స్వామివారి తిరుకల్యాణ వార్షిక బ్రహ్మోత్సవాలు పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో సంప్రదాయబద్దంగా నిర్వ హించనున్నారు. ఆలయ గోపురాలకు రంగులు, సున్నాలు వేసి మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయాన్ని వివిధ రకాల పూలు, ఆలయ ముఖద్వారం మామిడి, అరటి తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. ఈ నెల 3న ఆలయ ప్రాశస్త్యం కోసం నాలుగు రోజుల పాటు చేపట్టిన అధ్యయనోత్సవాలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా ముగిశాయి. నేటినుంచి స్వామివారి వార్షిక తిరుకల్యాణ బ్రహ్మో త్సవాలు స్వస్తివాచనంతో వేద పండితులు, రుత్వి కులు, పారాయణీకులు శ్రీకారం చుట్టనున్నారు. ప్రధానాలయం పుననిర్మాణం పనులతో స్వామి వారు బాలాలయంలో భక్తులకు దర్శనాలు ఇస్తున్నందున పాతగుట్టలో స్వయంభూ లక్ష్మీనరసింహుల తిరుకల్యా ణోత్సవాలకు ప్రాముఖ్యం ఏర్పడింది. పాతగుట్టలో ఏడు రోజుల పాటు నిర్విరామంగా జరిగే బ్రహ్మోత్సవాలకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారు.
బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టాలు
ఈ నెల 9న స్వామివారి సింహవాహనసేవ, రాత్రి అశ్వవాహన సేవలో ఎదుర్కోళ్లోత్సవం, 10వ తేదీ ఉదయం హనుమంత సేవ, రాత్రి గజవాహన సేవలో తిరుకల్యాణోత్సవం, 11న ఉదయం గరుఢ వాహనసేవ, రాత్రి రథాంగ హోమం, దివ్య విమాన రథత్సవం, లక్ష్మీదేవీ సమేతంగా స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. 12న చక్రతీర్థం, మహా పూర్ణాహుతి, 13న అష్టోత్తర శతఘటాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయి.
పాతగుట్టలో అధ్యయనోత్సవాలు పరిసమాప్తి
పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు కొనసాగిన అఽధ్యయనోత్సవాలు గురువారం భగవత్ రామానుజాచార్యుల అవతరణఘట్టాలతో పరిసమాప్తమయ్యాయి. తొలత లక్ష్మీనారసింహుడిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వజ్రవైఢూర్యాలతో దివ్య మనోహ రంగా అలంకరించి తిరువీధుల్లో మంగళవాయిధ్యాలు.. వేద మంత్ర పఠనాల నడుమ ఊరేగింపు నిర్వహించగా అలంకార విశిష్టతను ఆచా ర్యులు భక్తులకు వివరించారు. ఆళ్వారాచార్యులు, ఉత్సవమూర్తులకు పంచ సూక్త పారాయణాలతో స్నపన తిరుమంజనాలు జరిపారు. అనంతరం భగవద్రామానుజుల ఆవిర్భావ ఘట్టాలు.. పురప్పాట్టు సేవ, రామా నుజ చార్యుల తిరుమంజనం, ఇరామానుజ నూత్తందాది శాత్తుమురై ప్రబంధ పఠనంతో నాలుగు రోజులుగా వైభవంగా శ్రీవైష్ణవ పాంచ రాత్రాగమ శాస్త్రరీతిలో కొనసాగిన అధ్యయనోత్సవాలు పరిసమాప్తి అయి నట్లు దేవస్థాన ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటాచార్యులు తెలిపారు. వేడుకల్లో ఈవో ఏ. భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నరసింహమూర్తి, డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఏఈవో దూశెట్టి క్రిష్ణ, ఉప ప్రదానార్చకులు కొడకండ్ల మాధవచార్యులు, భట్టర్ సురేంద్రచార్యులు, పర్యవేక్షకుడు శంకర్‌నాయక్ పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా నిత్య పూజలు
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో గురువారం నిత్య కైంకర్యాలు పాంచారాత్రగమశాస్త్ర రీతిలో వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయ నైరుతి దిశలో అష్టభుజి ప్రాకార మండపంలో ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలు, ముత్యాలు, బంగారు, వజ్రవైఢూర్యాలతో దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకులు గజవాహన సేవలో తీర్చిదిద్ది వేద మంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల నడుమ సేవోత్సవం చేపట్టారు. ఉత్సవమూర్తులను కల్యాణ మండపంలో అధిష్టింపజేసీ, విశ్వక్సేనుడి తొలిపూజలతో కల్యాణతంతు కొనసాగింది. కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి శేషవస్త్రాలు, ఆశీర్వచనం అందజేశారు. ముందుగా సుదర్శన శతక పఠనంతో హోమం పూజలు నిర్వహించారు. ప్రభాతవేళ గర్భాలయంలో స్వామిఅమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి అర్చక స్వాములు నిజాభిషేకం, నిత్యార్చనలు నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో నిత్య పూజలు సాంప్రదాయ రీతిలో జరిగాయి. కొండపైన శివాలయంలో శ్రీపర్వతవర్థిని రామలింగేశ్వరస్వామికి నిత్య పూజలు, యాగశాలలో నిత్య రుద్రహవనం శైవాగమ పద్ధతిలో నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.30,04,754ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఏ. భాస్కర్‌రావు తెలిపారు.