Vote Buying in Jubilee Hills: ఓటుకు రూ.3 వేలు!
ABN , Publish Date - Nov 08 , 2025 | 02:45 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్ల కొనుగోలు మొదలైంది. ప్రచార పర్వం ముగియక ముందే పార్టీలు బూత్‌ల వారీగా ఓటర్లకు డబ్బు పంపిణీ ప్రారంభించాయి....
రూ. 2 వేల చొప్పున ఇస్తామని ఓ పార్టీ హామీ
రూ.వెయ్యి పెంచి ఇస్తున్న మరో పార్టీ.. ప్రచారం ముగియక ముందే పంపిణీ
బూత్‌ల వారీగా ఓట్ల కొనుగోలు షురూ.. జూబ్లీహిల్స్‌లో హీటెక్కిన ప్రచారం
హైదరాబాద్ సిటీ, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్ల కొనుగోలు మొదలైంది. ప్రచార పర్వం ముగియక ముందే పార్టీలు బూత్‌ల వారీగా ఓటర్లకు డబ్బు పంపిణీ ప్రారంభించాయి. ఓ ప్రధాన పార్టీ ఏకంగా ఓటుకు రూ.3 వేల చొప్పున పంపిణీ చేస్తుండడం గమనార్హం. మొన్నటి వరకు ఓటుకు రూ.2 వేల చొప్పున ఇస్తామంటూ ఓ ప్రధాన పార్టీకి చెందిన బూత్ ఇన్‌చార్జి హామీ ఇచ్చారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మరో ప్రధాన పార్టీ బూత్ ఇన్‌చార్జి దానికి రూ.వెయ్యి పెంచి రూ.3 వేల చొప్పున పంచుతున్నారు. సాధారణంగా ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత.. రాజకీయ పార్టీలు గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లను కలిసి డబ్బు, మందు పంపిణీ చేస్తుంటాయి. కానీ, ఈసారి మాత్రం ముందుగానే మొదలుపెట్టేశాయి.
ప్రచారం ముగిశాక డబ్బు పంపిణీకి అడ్డంకులు వస్తాయనే ఉద్దేశంతో ముందుగానే అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఓవైపు పోలీసుల తనిఖీలు, మరోవైపు ఎన్నికల స్వ్కాడ్‌లు ఆయా పార్టీల ముఖ్యనేతల ఇళ్లలో సైతం సోదాలు చేస్తున్నాయి. దీంతో ప్రచా రం సాగుతుండగానే.. డబ్బు పంపిణీ కూడా కానిచ్చేస్తున్నారు. ఇందుకోసం బూత్‌ల వారీగా ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో స్థానిక కార్యకర్తలతోపాటు జిల్లాల నుంచి వచ్చినవారు సమన్వయం చేసేలా ఇన్‌చార్జులను నియమించారు. వీరి ద్వారా బూత్‌ల వారీగా ఆయా ప్రాంతా ల్లో, అపార్ట్‌మెంట్లలో, ఇళ్లలో ఓటర్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. బూత్ కమిటీలతో కలిసి ఆయా ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో ప్రచారం మరింత హీటెక్కింది.
ఇవీ చదవండి:
మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ
Nifty Stock Market: 25500 దిగువకు నిఫ్టీ
ఆన్‌లైన్ పేమెంట్లు కూడా!
యూసు్‌ఫగూడలోని ఓ బస్తీలో నాలుగంతస్తుల భవనంలో నాలుగు కుటుంబాలు ఉండగా, అందులో రెండు కుటుంబాలకు మాత్రమే ఓ బూత్‌లో ఓట్లున్నాయి. రెండు రోజుల క్రితం ఓ ప్రధాన పార్టీకి చెందిన బూత్ ఇన్‌చార్జి ఆ కుటుంబాలను కలిశారు. ఓటు కు రూ.2 వేల చొప్పున పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఇస్తామని మాట ఇచ్చారు. ఆన్‌లైన్‌లో యూపీఐ పేమెంట్‌కు అవకాశం కలిగిన ఫోన్ నంబర్లు సైతం తీసుకున్నారు. ఈలోపు శుక్రవారం మధ్యాహ్నం మరో ప్రధాన పార్టీకి చెందిన బూత్ ఇన్‌చార్జి ఆ కుటుంబాలను కలిశారు. ఒక్కో ఓటరుకు రూ.3 వేల చొప్పున పంపిణీ కూడా చేశారు. ఒక కుటుంబంలో నాలుగు ఓట్లు ఉండగా రూ.12 వేలు ఇచ్చారు. మరో కుటుంబంలో రెండు ఓట్లు ఉంటే రూ.6 వేలు చెల్లించారు. తమ పార్టీకే ఓటు వేయాలని వారి నుంచి హామీ పొందారు. కాగా, అదే పార్టీకి చెందిన మరో బూత్ కమిటీ.. రహమత్‌నగర్ డివిజన్‌లోని ఓ బస్తీలో ఓటుకు రూ.2500 చొప్పున చెల్లించినట్లు తెలిసింది. దీంతో పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఇస్తామన్న మరో పార్టీ నేతలు.. ముందు చెప్పినట్లుగా ఓటుకు రూ.2 వేలే ఇస్తారా? వారు కూడా ‘రేటు’ పెంచుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. కానీ, తొలుత రూ.2 వేలు ఇస్తామన్న పార్టీవైపు మొగ్గుచూపిన ఓటర్లు.. మరో పార్టీ రూ.3 వేలు ఇస్తుండడంతో పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.