Panchayat Elections: అసెంబ్లీ ఎన్నికలను తలదన్నేలా!
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:14 AM
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నది సామెత! పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి చూడు అన్నదీ ఇకపై సామెతల్లో చేర్చవచ్చు ....
పంచాయతీ పోరులో కనీవినీ ఎరుగనంత ఖర్చు
గ్రామీణ ఓటర్లను డబ్బుతో ముంచెత్తిన అభ్యర్థులు
ఓటుకు రూ.వెయ్యి నుంచి 5వేల వరకు చెల్లింపు
అదనంగా మద్యం, చీరలు, కానుకలు సైతం..
వెండి ఉంగరాలు పంచిన ఉంగరం గుర్తు అభ్యర్థి
నిర్ణయాత్మక ఓటుకు రూ.30 వేల దాకా పంపిణీ
హైదరాబాద్ శివారులోని శంకరపల్లి మండలంలో ఓటుకు రూ.55 వేల చొప్పున ఇచ్చిన ఓ అభ్యర్థి
పటాన్‌చెరులో ఓ అభ్యర్థి ఖర్చు రూ.17 కోట్లు!
ఎన్నికల కోసం భూములను అమ్ముకున్న వైనం
గ్రామాలపై పట్టు కోసం తమ వంతు చేయి వేసిన ప్రజాప్రతినిధులు.. చేతులు మారిన రూ.వేల కోట్లు
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నది సామెత! పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి చూడు అన్నదీ ఇకపై సామెతల్లో చేర్చవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో ఓట్ల కోసం అభ్యర్థులు చేస్తున్న ఖర్చు.. పడుతున్న పాట్లు ఇదే అభిప్రాయాన్ని కలిగిస్తాయి. సర్పంచ్, వార్డు మెంబర్‌గా ఎన్నికయ్యేందుకు పోటీ పడుతున్న అభ్యర్థులు గ్రామాల్లో పెట్టిన ఖర్చు అసెంబ్లీ ఎన్నికలనూ మించి పోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో పంచాయతీలో సర్పంచ్, వార్డు మెంబర్ పదవులకు పోటీ పడుతున్న అభ్యర్థులందరూ కలిపి సరాసరి రూ.60 లక్షల దాకా ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. రిజర్వేషన్‌లో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన గ్రామాల్లోనూ.. జనరల్ అయిన గ్రామాలకు తీసిపోకుండా ఖర్చు జరిగిందని అంటున్నారు. ఇలా.. రాష్ట్రంలోని 12,728 పంచాయతీలకుగాను 1200 ఏకగ్రీవ పంచాయతీలు, మైనర్ గ్రామ పంచాయతీలను మినహాయించినా.. సుమారు 10 వేల పంచాయతీల్లో అన్ని పార్టీల అభ్యర్థులు కలిసి రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఆయా గ్రామాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పారిన డబ్బు, మద్యం ప్రవాహం కంటే.. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పారినదే ఎక్కువ అని అంటున్నారు. పట్టణాలు, మునిసిపాలిటీల శివారు గ్రామాల్లోనైతే పంచాయతీ పాలకవర్గాలకు ఎంతో కొంత ఆదాయం ఉంటుంది. కానీ, పట్టణాలకు దూరంగా ఉండి, ఏ మాత్రం ఆదాయ వనరులూ లేని గ్రామాల్లోనూ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా రూ.లక్షలు ఖర్చు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
డిమాండ్, సప్లయ్ సూత్రమే..!
పంచాయతీ ఎన్నికల్లో డిమాండ్‌ను బట్టి ఓటుకు రూ.1000 నుంచి రూ.5 వేల దాకా అభ్యర్థులు ఖర్చు చేశారు. దీనికి అదనంగా మద్యం, చీరలు, కానుకల పంపిణీ కూడా జరిగింది. గ్రామంలో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల బలాబలాలు, పెట్టుకున్న పొత్తులు, గెలుపు అవకాశాలు, పరపతి.. ఓట్ల ధరను నిర్ణయించాయి. పార్టీ రహితమే అయినా ఈ ఎన్నికలను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలు, కొన్ని చోట్ల బీజేపీ సైతం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో హోరాహోరీగా జరిగాయి. దీంతో ఓటుకు డిమాండ్ ఏర్పడి అభ్యర్థులకు ఖర్చూ పెరిగిపోయింది. పట్టణాలు, నగరాల శివారు గ్రామాల్లో కొన్నిచోట్ల ఓటుకు రూ.10 వేలకు పైగా వెచ్చించిన సంఘటనలూ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా చందానగర్‌లో గెలుపు, ఓటములను నిర్ణయిస్తున్న కొన్ని కుటుంబాలకు చెందిన ఓట్లను ఓటుకు రూ.30 వేల చొప్పున వెచ్చించి అభ్యర్థులు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ శివారు గ్రామ పంచాయతీలు కొన్నింట్లో వెయ్యి ఓట్లు లేకున్నా అభ్యర్థులు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
ఇంత ఖర్చు ఎందుకు..?
పంచాయతీల ద్వారా వచ్చే ఆదాయం పెద్దగా లేకున్నా.. గతంలో సర్పంచ్‌లుగా చేసినవాళ్లు అప్పుల బారిన పడినా.. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేయడం ఆసక్తి రేపుతోంది. ప్రధాన పార్టీలకు చెందిన కొందరు అభ్యర్థులైతే ఎన్నికల ఖర్చుల కోసం తమ ఆస్తులను తనఖా పెట్టిన ఘటనలూ చోటుచేసుకున్నాయి. వాస్తవానికి గతంలో సాధారణ పంచాయతీ ఎన్నిక సరాసరి ఖర్చు రూ.5 లక్షలు మించేది కాదు. అలాంటిది.. ఈసారి సరాసరి ఖర్చు పది రెట్లకు పైగా పెరిగి రూ.60 లక్షల దాకా చేరుకుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నందునే ఖర్చు పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో పైచేయి సాధించడం అధికార కాంగ్రెస్ పార్టీకి అవసరంగా మారడంతో సీఎం రేవంత్‌రెడ్డి సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వేడి నీళ్లకు చన్నీళ్ల లాగా.. పార్టీ మద్దతు ఇస్తున్న అభ్యర్థులకు తమ వంతు సాయం అందించినట్లు చెబుతున్నారు. అక్కడక్కడా బీఆర్‌ఎస్ మద్దతుతో పోటీలో ఉన్న అభ్యర్థులకు ఆ పార్టీ మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు కూడా తమ వంతు సాయం చేసినట్లు తెలుస్తోంది.
వేడి నీళ్లకు చన్నీళ్లలా..
అభ్యర్థులు సమీకరించుకున్న వనరులకు తోడు ప్రధాన పార్టీల ప్రజా ప్రతినిధుల సాయమూ అందడంతో సహజంగానే ఎన్నికల్లో ఖర్చు పెరిగి పోయిందని అంటున్నారు. అలాగే పట్టణ శివార్లలోని గ్రామ పంచాయతీ పాలక వర్గాలకు రియల్ ఎస్టేట్ మొదలుకొని అనేక రంగాల నుంచి ఆదాయ వనరులు ఉండటంతో ఆయా పంచాయతీల ఎన్నికల్లో అభ్యర్థులు భారీగానే ఖర్చు పెట్టారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యులు అన్నది దశాబ్దాలుగా ఒక పరపతిగా ఉంది. వివిధ వృత్తుల్లో పైకి ఎదిగినవారు సొంత గ్రామంలో పరపతి, గుర్తింపు సాధించడం కోసం ఈ ఎన్నికల్లో పోటీ పడి పెద్ద ఎత్తున ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. పట్టణాలు, విదేశాలకు వలస వెళ్లి సంపాదించిన వారు.. గ్రామంలో గుర్తింపు, పరపతి కోసం తమ తల్లిదండ్రులను ఎన్నికల బరిలో నింపి ఖర్చు చేసిన ఘటనలూ ఉన్నట్లు పేర్కొంటున్నారు. గ్రామీణ వ్యవస్థలో సహజంగా ఉండే వర్గ ఆధిపత్య పోరులో భాగంగానూ పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు పెరిగిందని విశ్లేషిస్తున్నారు.
ఒకే అభ్యర్థి రూ.17 కోట్ల ఖర్చు
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని గ్రామంలో సర్పంచ్‌గా గెలవడానికి ఓ అభ్యర్థి రూ.17 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఒక్కో ఓటుకు సాయంత్రం రూ.25వేలు, రాత్రికి మరో 5వేలు, ఓటు వేయడానికి వెళ్లే ముందు రూ.10వేల చొప్పున ఒక్కో ఓటుకు రూ.40వేలు ఖర్చు చేశారు. మహిళలకు వెండి గ్లాసులు, బంగారంతో కూడిన నగలు పంపిణీ చేశారు.
2ఎకరాలు అమ్మి.. ఓటమిపాలు
హైదరాబాద్ శివారులోని శంకరపల్లి మండలంలోని ఓ పంచాయతీకి సర్పంచ్‌గా పోటీ చేసిన అభ్యర్థి రెండెకరాల భూమి అమ్మేశాడు. అలా వచ్చిన రూ.6 కోట్లను ఎన్నికలు ఖర్చు పెట్టాడు. ఇంత చేసినా ఆయన గెలవలేదు.
చేతులు మారిన వేల కోట్లు!
గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా అభ్యర్థులు సరాసరి గ్రామానికి రూ.60 లక్షల దాకా ఖర్చు చేయడంతో క్షేత్రస్థాయిలో రూ.వేల కోట్లు చేతులు మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా రూ.6 వేల కోట్లకుపైగా డబ్బు చెలామణీలోకి వచ్చిందన్నది అంచనాగా చెబుతున్నారు. ఇన్ని వేల కోట్లు వివిధ వ్యాపారాల్లోకి రావడంతో.. అమ్మకాలు, కొనుగోళ్లు పెరిగి, క్షేత్రస్థాయిలో పడకేసిన ఎకానమీ పుంజుకుంటుందంటున్నారు. అయితే డబ్బు ప్రమేయం పంచాయతీ ఎన్నికల దాకా రావడం.. ప్రజాస్వామ్య విలువలకు ప్రమాదమేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఓటుకు రూ.55 వేలు!
హైదరాబాద్ శివార్లలోని పంచాయతీల్లో అసెంబ్లీ ఎన్నికలను మించి ఖర్చు జరుగుతోంది. శంకరపల్లి మండలంలో వెయ్యి ఓట్లు కూడా లేని ఓ పంచాయతీలో ముగ్గురు సర్పంచ్ అభ్యర్ధులు రూ.15 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. రెండో విడత ఇక్కడ జరిగిన ఎన్నికలో ఒక అభ్యర్థి ఓటుకు రూ.40 వేలు ఇస్తే.. మరో అభ్యర్ధి రూ.50 వేలు ఇచ్చాడు. వీరిద్దరిని చూసి మరో అభ్యర్థి ఏకంగా ఓటుకు రూ.55 వేల చొప్పున పంచాడు. ఇలా ముగ్గురు కలిసి గ్రామంలో మద్యం, డబ్బులు పంపిణీకి కలిపి రూ.15 కోట్లకుపైగానే ఖర్చుచేశారు.
శంషాబాద్ మండలంలోని ఓ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులందరూ కలిసి రూ.25 కోట్లు ఖర్చు పెట్టారు. పోటీ పడిన ఇద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావడంతో ఒక్కో ఓటును గరిష్ఠంగా రూ.30 వేలకు కొనుగోలు చేశారు. ఇందులో గెలిచిన అభ్యర్థి ఒక్క రాత్రే ఓట్లు కొనుగోలుకు రూ.7 కోట్లు ఖర్చు పెట్డడం గమనార్హం. ఇక్కడ వార్డు సభ్యులు కూడా భారీగానే ఖర్చుపెట్టారు. ఇక్కడే కాకుండా.. అనేక చోట్ల వార్డు సభ్యులుగా పోటీ చేసినవారు ఒకొక్కరు రూ.25 నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు.
మెయినాబాద్ మండలంలోని ఓ గ్రామంలో అభ్యర్థులు ఇద్దరు కలిసి రూ.10 కోట్లకుపైగానే ఖర్చు చేశారు. ఈ మండలంలో మూడు గ్రామ పంచాయతీల్లో పోటీ చేసిన అభ్యర్థులు రూ.కోటి చొప్పున రూ.3 వడ్డీకి అప్పులు చేశారు. ఇందుకోసం వీరు భూములు తనఖా పెట్టారు.
జిల్లాల వారీగా..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాల్లో ఒక్కో అభ్యర్థి రూ.30-60 లక్షల దాకా ఖర్చు చేశారు. కొన్ని గ్రామాల్లోనైతే ఖర్చు కోటి దాటి పోయింది. 1000 ఓట్లు ఉన్న గ్రామాల్లోనూ ఓటుకు రూ.1000 నుంచి రూ.2 వేల దాకా పంచారు. డిమాండ్ ఉన్న చోట్ల ఓటు ధర రూ.5 వేల వరకూ పోయింది. మద్యం పంపిణీ అనేది సాధారణం అయిపోయింది. చీరెలు, ఇతర కానుకలనూ అభ్యర్థులు పంచారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అభ్యర్థులు రూ. 10-50 లక్షల దాకా ఖర్చు చేశారు. కొన్ని గ్రామాల్లో ఉంగరం గుర్తు ఉన్న అభ్యర్థులు వెండి ఉంగరాలు పంపిణీ చేసిన ఘటనలూ ఉన్నాయి. పట్టణాలు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని రవాణా ఖర్చులతో పాటు ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు ఇచ్చి పోలింగ్‌కు రప్పించుకున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దేవరకొండ డివిజన్‌లోని ఓ గిరిజన తండా పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేశాడు. గుడి నిర్మాణానికి అని, ఓటుకు అని వెనక్కి తిరగకుండా ఖర్చు చేస్తుండడంతో ప్రత్యర్థి వర్గం దానిని అడ్డుకునేందుకు గస్తీ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనేక గ్రామాల్లో ఓటుకు రూ.2 నుంచి రూ. 3 వేల వరకు ఖర్చు చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలోని నందిపేట పంచాయతీలో అభ్యర్థులు రూ.కోటికి పైగానే ఖర్చు చేస్తున్నారు. మద్యం, కానుకల పంపిణీ యథావిధిగా జరుగుతోంది. ప్రతిరోజూ నాటుకోడి, మద్యం ఫుల్ బాటిల్ ఇస్తున్నారు. మేకలు కోసి భోజనం కూడా పెట్టారు.
జనగామ జిల్లాలోని ఓ గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేసిన అభ్యర్థి ఎన్నికల్లో ఖర్చు కోసం రూ.70 లక్షల ధర పలికే ఎకరం భూమిని రూ.35 లక్షలకు అమ్ముకున్నట్లు తెలిసింది.