Bhatti Vikramarka: శివశంకర్ జీవితం నేటి రాజకీయ నాయకులందరికీ స్ఫూర్తి
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:04 AM
జీవితంలో అనుకున్నది సాధించడానికి పేదరికం, వెనకబాటుతనం అడ్డుకాబోదనడానికి కేంద్ర మాజీ మంత్రి
ఆయన విగ్రహ ఏర్పాటుకు కృషి
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
రవీంద్ర భారతిలో కేంద్ర మాజీ మంత్రి జయంతి వేడుక
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): జీవితంలో అనుకున్నది సాధించడానికి పేదరికం, వెనకబాటుతనం అడ్డుకాబోదనడానికి కేంద్ర మాజీ మంత్రి పుంజాల శివశంకర్ జీవితమే నిదర్శనమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. విద్య ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆ మహనీయుడు నిరూపించారని కొనియాడారు. శక్తిమంతమైన ప్రధానమంత్రుల ఏలికలో కూడా దేశ రాజకీయాలను ప్రభావితం చేశారని, ఆయన విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పుంజాల శివశంకర్ 96వ జయంతి సభ ఆదివారం రవీంద్రభారతిలో జరిగింది. డాక్టర్ పుంజాల వినయ్‌కుమార్ అధ్యక్షతన సాగిన ఈ సభ కు పలువురు మంత్రులు, సామాజిక, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. కేంద్ర మాజీ మంత్రిగా, న్యాయకోవిదుడుగా శివశంకర్ జీవితం నేటి రాజకీయ నాయకులకు స్ఫూర్తి అని అన్నారు. సామాజిక న్యాయం సాధన దిశగా కృషి చే సిన శివశంకర్ లాంటి నాయకుల స్ఫూర్తితోనే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. బీసీల గురించి గళమెత్తడానికి భయపడిన సమయంలో.. వారి గురించి నోరు విప్పిన ధీశాలి శివశంకర్ అన్నారు. న్యాయవ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికిన అరుదైన నాయకుడని వక్తలు అన్నారు. పెట్రోలియం మంత్రిగా ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ వ్యవస్థను గ్రామాల వరకూ తీసుకెళ్లిన ఘనత శివశంకర్ సొంతమని చెప్పారు. రాజ్యసభలో మండల్ కమిషన్‌ను సమర్థించిన మొదటి కాంగ్రెస్ నేత కూడా ఆయనేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు,పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కే.కేశవరావు, మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, మాజీ హోం సెక్రెటరీ కే. పధ్మనాభయ్య తదితరులు పాల్గొన్నారు