Oil Palm Factory: మే నెలాఖరుకల్లా.. నర్మెట్ట ఆయిల్‌పాం ఫ్యాక్టరీ మొదలవ్వాలి
ABN , Publish Date - Feb 12 , 2025 | 06:00 AM
మంగళవారం సచివాలయంలో సహకార, ఉద్యాన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు గద్వాల జిల్లా బీచుపల్లి ఆయిల్ పాం ఫ్యాక్టరీ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

అధికారులతో సమీక్షలో మంత్రి తుమ్మల
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ పనులను త్వరితగతిన పూర్తిచేసి, మే నెలాఖరు నాటికి ఆయిల్ పాం గెలల ప్రాసెసింగ్ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో సహకార, ఉద్యాన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు గద్వాల జిల్లా బీచుపల్లి ఆయిల్ పాం ఫ్యాక్టరీ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న విచారణలను త్వరగా పూర్తి చేసి, తేలిన మొత్తాలను వెంటనే రికవరీ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్లు మంత్రి తుమ్మలను కలిశారు. సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలం ఈ నెలలో ముగియనున్న నేపథ్యంలో, పదవీకాలాన్ని పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.
సీతారామకు సాంకేతిక అనుమతి సాధించాలి
సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్‌కు సాంకేతిక అనుమతి సాధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు. సాంకేతిక అనుమతిపై చర్చించడానికిగాను మంగళవారం కేంద్ర జలశక్తి శాఖకు చెందిన సాంకేతిక సలహా కమిటీ సమావేశమవుతున్న నేపథ్యంలో తుమ్మల ఈ సూచన చేశారు.