Share News

Medigadda Barrage: ఇద్దరు ఇంజనీర్లపై అభియోగాలు!

ABN , Publish Date - Jan 04 , 2025 | 05:42 AM

మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. ఇద్దరు అధికారులపై అభియోగాలు (ఆర్టికల్‌ ఆఫ్‌ చార్జెస్‌) నమోదు చేసింది.

Medigadda Barrage: ఇద్దరు ఇంజనీర్లపై అభియోగాలు!

మేడిగడ్డ నిర్మాణం పూర్తవకున్నా అయినట్లుగా సర్టిఫికెట్‌ ఇచ్చిన ఈఈ తిరుపతిరావు, సీఈ రమణారెడ్డి

ఇద్దరిపై అభియోగాలు నమోదు చేసిన సర్కారు

10 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశం

హైదరాబాద్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. ఇద్దరు అధికారులపై అభియోగాలు (ఆర్టికల్‌ ఆఫ్‌ చార్జెస్‌) నమోదు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో భారీగా సీపేజీలు బయటపడ్డాయి. ఈ మూడు బ్యారేజీల వ్యవహారంపై ఇప్పటికే విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ చేపట్టి, పలువురు అధికారులను ప్రశ్నించింది. జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ కూడా విచారణ జరుపుతోంది. మేడిగడ్డ బ్యారేజీ, దానిచుట్టూ గైడ్‌బండ్‌ వంటి నిర్మాణాలు జరుగుతుండగానే బ్యారేజీ పూర్తయినట్లుగా సర్టిఫికెట్‌ ఇచ్చిన అప్పటి మహదేవ్‌పూర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ)-1 తిరుపతిరావు, అప్పట్లో రామగుండం ఇన్‌చార్జి ఎస్‌ఈగా పనిచేసి, ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ)గా పనిచేస్తున్న బి.రమణారెడ్డిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. మేడిగడ్డ బ్యారేజీ, దాని అనుబంధ పనులు పూర్తికానప్పటికీ అయినట్లుగా తిరుపతిరావు సర్టిఫికెట్‌ ఇవ్వగా.. దానిపై రమణారెడ్డి కౌంటర్‌ సంతకం చేశారు. పనులు పూర్తవకున్నా.. అయినట్లుగా ఎలా సర్టిఫికెట్‌ ఇస్తారని జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ సర్టిఫికెట్లు జారీ చేసిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారని నిలదీసింది. మరోవైపు అధికారుల తీరును విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కూడా తప్పుపట్టింది. దీంతో గత జూన్‌ 3నప్రభుత్వానికి నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ జి.అనిల్‌కుమార్‌ లేఖ రాస్తూ.. నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీకి కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన ఈఈ తిరుపతిరావుతో పాటు దానిపై సంతకం చేసిన రమణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆయన అధికారుల వివరాలతో కూడిన నివేదిక అందజేశారు. దాని ఆధారంగా వీరిద్దరిపై అభియోగాలు నమోదు చేస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా జీవో నంబరు 1, 2లు జారీ చేశారు.


నిర్ధారణ అయితే జీవితాంతం ప్రభావం

అభియోగాలు నిరూపితమైతే అధికారులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పదిరోజుల్లో సంజాయిషీ ఇవ్వకున్నా, వ్యక్తిగతంగా హాజరు కాకపోయినా కఠిన చర్యలు తీసుకుంటారు. వీరిపై అభియోగాల ప్రభావం తదుపరి పదోన్నతులపై కూడా ఉంటుంది. సస్పెన్షన్‌ కన్నా ఆర్టికల్‌ ఆఫ్‌ చార్జెస్‌ తీవ్రతే అధికంగా ఉంటుంది. సస్పెండైతే ఆర్నెల్లపాటు పనిచేయకున్నా సగం జీతం పొందుతారు. అదే అభియోగాలు నిరూపణ అయితే ఇంక్రిమెంట్లలో కోత పడుతుంది. అంటే విధుల్లో ఉన్నంత కాలం వేతనంలో కోత పడుతుంది.

నిర్మాణం పూర్తికాకుండానే మేడిగడ్డ ప్రారంభం

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని ఎల్‌అండ్‌టీ సంస్థ 2016 నవంబరులో ప్రారంభించగా.. 2019లో పూర్తయింది. బ్యారేజీ ప్రారంభించిన తర్వాత తొలి వరదలకే సీసీ బ్లాకులు చెల్లాచెదురు కావడంతో పాటు బ్యారేజీ ఎగువ, దిగువభాగంలోని అఫ్రాన్లు దెబ్బతిన్నాయి. ఏటా వరదల అనంతరం నష్టం జరుగుతున్నా తాత్కాలిక చర్యలు తప్ప.. శాశ్వత చర్యలకు ఎల్‌అండ్‌టీ ఉపక్రమించలేదు. అయితే నిర్మాణ సంస్థకు, స్థానిక అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచినా పనులు కార్యరూపం దాల్చలేదు. నిర్వహణ పనుల్లో వైఫల్యంతో 2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. మరమ్మతులకు ఎల్‌అండ్‌టీ తొలుత నిరాకరించింది. అధికారులు జారీ చేసిన సర్టిఫికెట్‌ ప్రకారం 2021తోనే డిఫెక్ట్‌ లయబిలిటీ కాలం పూర్తయినందున బ్యారేజీ మరమ్మతుల బాధ్యత తమది కాదని తేల్చిచెప్పింది. ఆ తర్వాత కఠిన చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుందని సర్కారు హెచ్చరించడంతో తాత్కాలిక మరమ్మతులు చేసింది. కాగా, ప్రాజెక్టు పూర్తయినట్లు ఇచ్చిన సర్టిఫికెట్‌ను ప్రభుత్వం ఇటీవలే రద్దు చేసింది.

Updated Date - Jan 04 , 2025 | 05:42 AM