ఏసీబీకి చిక్కిన ముషీరాబాద్ స్పెషల్ ఆర్‌ఐ
ABN , Publish Date - May 29 , 2025 | 04:13 AM
ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఓ అధికారి రూ.1.10లక్షల లంచం డిమాండ్ చేసి, అడ్వాన్స్‌గా రూ.25వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం రూ.1.10 లక్షల డిమాండ్
కవాడిగూడ, మే 28 (ఆంధ్రజ్యోతి): ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఓ అధికారి రూ.1.10లక్షల లంచం డిమాండ్ చేసి, అడ్వాన్స్‌గా రూ.25వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సీతాఫల్‌మండిలో నివాసం ఉండే రామకృష్ణ ఓ క్యాంటిన్‌లో పనిచేస్తున్నాడు. తన కుటుంబసబ్యుల్లో మహిళ చనిపోవడంతో ఆమె పేరిట బ్యాంకులో తాకట్టు ఉన్న బంగారాన్ని విడిపించుకునేందుకు ఫ్యామిలీ సర్టిఫికెట్ కావాలని బ్యాంకు అధికారులు రామకృష్ణకు సూచించారు.
ఇందుకు అతడు, ముషీరాబాద్ తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లి స్పెషల్ ఆర్‌ఐ భూపాల మహేశ్‌ను కలిసి విషయం చెప్పాడు. దీనికి ఆయన.. రూ.1.10 లక్షలు ఇస్తే వెంటనే పనిచేసి పెడతానని చెప్పాడు. దీంతో రామకృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని ముషీరాబాద్ తహసీల్దార్ ఆఫీసులో మహేశ్‌కు రామకృష్ణ రూ.25వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కొంపెల్లిలోని మహేశ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. మహేశ్ జారీ చేసిన సర్టిఫికెట్లపైనా విచారణ చేపట్టారు.