Rajiv Swagruha: రాజీవ్ స్వగృహ టవర్ల విక్రయానికి నోటిఫికేషన్
ABN , Publish Date - Jul 06 , 2025 | 03:51 AM
రాజీవ్ స్వగృహ పరిధిలోని టవర్లు, ఓపెన్ ప్లాట్లు, హౌసింగ్ బోర్డు పరిధిలోని భూములు, ఓపెన్ ప్లాట్ల విక్రయానికి శనివారం నోటిఫికేషన్లు వెలువడ్డాయి.
హౌసింగ్ బోర్డు పరిధిలోని భూములకు కూడా..
హైదరాబాద్, జూలై 5(ఆంధ్రజ్యోతి): రాజీవ్ స్వగృహ పరిధిలోని టవర్లు, ఓపెన్ ప్లాట్లు, హౌసింగ్ బోర్డు పరిధిలోని భూములు, ఓపెన్ ప్లాట్ల విక్రయానికి శనివారం నోటిఫికేషన్లు వెలువడ్డాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం, గాజులరామారం ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ టవర్ల విక్రయానికి ఆగస్టు 20న ఉదయం 11.30 గంటలకు లాటరీ నిర్వహించనున్నారు. ఆగస్టు 19 సాయంత్రం 5 గంటల్లోపు ధరావతు చెల్లించాలి. వీటివిక్రయంతో దాదాపు రూ.96.44 కోట్ల ఆదాయం రావొచ్చని అంచనా. బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లో నిర్మించిన టవర్లలోని ఫ్లాట్లను కూడా విక్రయించనున్నారు. బండ్లగూడలోని సహభావన టౌన్‌షి్‌పలో జూలై 30న, పోచారంలోని సద్భావన టౌన్‌షి్‌పలోని 2-బీహెచ్‌కే ఫ్లాట్ల కోసం ఆగస్టు 1న, ఇతర క్యాటగిరీలకు ఆగస్టు 2న లాటరీ నిర్వహించనున్నారు.
సహభావన ఫ్లాట్లకు ఈ నెల 29, సద్భావన ఫ్లాట్లకు ఈ నెల 31వ తేదీసాయంత్రం 5 గంటల్లోపు ధరావతు చెల్లించాలి. వీటి విక్రయంతో దాదాపు రూ.127.73 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. వనరుల సమీకరణల కోసం ఏర్పాటైన క్యాబినెట్ సబ్‌కమిటీ ఇటీవల నిర్వహించిన సమావేశంలో హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ పరిధిలోని ఆస్తులను విక్రయించేందుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. హౌసింగ్ బోర్డు పరిధి లో హైదరాబాద్ కేపీహెచ్‌బీ ఫేజ్-4లోని 7.33 ఎకరాల స్థలాన్ని, ఇదే ప్రాంతంలో మరోచోట 4,598 చదరపు గజాలు, 2,420 చదరపు గజాలు, నాంపల్లి ఎంజే రోడ్‌లో 1,148 చదరపు గజాల ప్లాట్లకు ఈ నేల 30న వేలం నిర్వహించారు.