Share News

నేటి నుంచే నామినేషన్లు

ABN , Publish Date - Oct 13 , 2025 | 07:28 AM

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ సోమవారం విడుదల కానుంది......

నేటి నుంచే నామినేషన్లు

  • జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ నేడే.. 21 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ సోమవారం విడుదల కానుంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం నోటిఫికేషన్‌ జారీ తర్వాత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు(సెలవులు మినహా ఇతర రోజుల్లో) నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్‌ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. షేక్‌పేట తహసీల్దార్‌ ఆఫీసులో ఏర్పాటు చేసిన రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేయవచ్చని తెలిపారు. 15, 16, 17 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్న నేపథ్యంలో ఈ మూడు రోజుల్లోనే ఎక్కువ నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత 15వ తేదీన, కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ 17వ తేదీన నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అలాగే, కొందరు స్వతంత్రులు, ఇతర పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాగా, ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనందుకు నిరసనగా.. నామినేషన్లు వేస్తామని నిరుద్యోగులు ప్రకటించినా, వారు బరిలో ఉంటారా..? లేదా.? అన్నది తేలాల్సి ఉంది. అభ్యర్థులు డిజిటల్‌ పద్ధతిలోనూ నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. జ్ట్టిఞ://్ఛుఽఛిౌట్ఛ. ్ఛఛిజీ.జౌఠి.జీుఽ ద్వారా నామినేషన్‌ పత్రం ఆన్‌లైన్‌లో నింపి, క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ప్రింటెడ్‌ హార్డ్‌ కాపీని రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాలి. ఆర్‌వో కార్యాలయం చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు అమలు దృష్ట్యా.. 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్‌ దాఖలు సమయంలో అభ్యర్థితోపాటు ఐదుగురికి మాత్రమే అవకాశం ఉంటుందని రిటర్నింగ్‌ అధికారి సాయిరాం తెలిపారు.

Updated Date - Oct 13 , 2025 | 07:28 AM