Share News

No Regular HODs in Medical Department: హెచ్‌వోడీలు కావలెను

ABN , Publish Date - Aug 12 , 2025 | 04:35 AM

వైద్య ఆరోగ్య శాఖలో కీలక విభాగాలకు అధిపతులు లేరు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇన్‌చార్జ్‌లే దిక్కుగా ఉన్నారు

No Regular HODs in Medical Department: హెచ్‌వోడీలు కావలెను

  • వైద్య శాఖ విభాగాల్లో ఇన్‌చార్జ్‌ల పాలన

  • రాష్ట్రం వచ్చినప్పటి నుంచీ ఇదే దుస్థితి

హైదరాబాద్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలో కీలక విభాగాలకు అధిపతులు లేరు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇన్‌చార్జ్‌లే దిక్కుగా ఉన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య శాఖలో హెచ్‌వోడీ పోస్టులను మంజూరు చేసింది. గత ఆగస్టు 9న జీవో 92 జారీ చేసింది. ప్రజారోగ్య సంచాలకులు, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌, ఔషధ నియంత్రణ సంచాలకుల పోస్టులను మంజూరు చేస్తూ ఆ జీవో ఇచ్చింది. అయితే, ఏడాది గడుస్తున్నా ఇంత వరకు అతీగతీ లేదు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నంత కాలం వైద్య ఆరోగ్య శాఖలో కీలక విభాగాలకు హెచ్‌వోడీ పోస్టులను మంజూరు చేయలేదు. ఆ సర్కారు నచ్చిన, మెచ్చిన అఽధికారులనే కీలక పోస్టుల్లో కూర్చోబెట్టిందన్న విమర్శలున్నాయి. వైద్య శాఖలో ఎంతో కీలకమైన వైద్య విద్య సంచాలకులు, ఆరోగ్య వర్సిటీ వీసీ, ప్రజారోగ్య సంచాలకులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ పోస్టులు విభజన సమయంలో ఏపీకి వెళ్లాయి. నిబంధనల మేరకు ఆ పోస్టులను నిర్ణీత సమయంలోగా మంజూరు చేసుకోవచ్చు. కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లు కీలకమైన ఈ పోస్టులను ఇన్‌చార్జ్‌లతోనే నడిపించింది. తమకు జరుగుతున్న అన్యాయంపై సీనియర్లు కోర్టులను ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో 16 మార్చి 2023న ఒక్క డీఎంఈ పోస్టును సర్కారు మంజూరు చేసింది. అయితే తర్వాత కాలంలో ఆ నియామకం కూడా చేపట్టలేదు. అదే ఏడాది డిసెంబరులో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రెగ్యులర్‌ డీఎంఈని నియమించింది. నిబంధనల మేరకు సీనియారిటీ జాబితాలో ముందున్న డాక్టర్‌ నరేంద్ర కుమార్‌ రాష్ట్ర తొలి వైద్య విద్య సంచాలకులుగా నియమితులయ్యారు. ఆ తర్వాత మిగిలిన విభాగాల పోస్టులను సర్కారు మంజూరు చేసింది. హెల్త్‌ యూనివర్సిటీ వీసీగా డాక్టర్‌ నందకుమార్‌ను ఈ ఏడాది మార్చిలో నియమించింది. మరి కొన్ని కీలక విభాగాలైన డీహెచ్‌, టీవీవీపీ పోస్టులను మాత్రం భర్తీ చేయలేదు.


డీహెచ్‌ కోసం వెతుకులాట..

ప్రజారోగ్య సంచాలకుల ఇన్‌చార్జ్‌ బాధ్యతలను డాక్టర్‌ రవీంద్రనాయక్‌కు డిసెంబరు 2023లో ప్రభుత్వం అప్పగించింది. డీహెచ్‌ పోస్టు కోసం సీనియారిటీ జాబితాను వైద్య శాఖ సిద్ధం చేసింది. అందులో డాక్టర్‌ అమర్‌సింగ్‌ నాయక్‌, డాక్టర్‌ మోతీరాం నాయక్‌, డాక్టర్‌ పద్మజ, డాక్టర్‌ పుష్ప ఉన్నారు. ఇందులో మోతీరాం ఇటీవల పదవీ విరమణ చేశారు. మిగిలిన వారిలో ఇన్‌చార్జ్‌ డీహెచ్‌ రవీంద్రనాయక్‌, అమర్‌ సింగ్‌ నాయక్‌, పద్మజపై అవినీతి ఆరోపణల కారణంగా చార్జ్‌ మోమోలు జారీ అయ్యాయి. అవి ఇంత వరకు డ్రాప్‌ కాలేదు. డీహెచ్‌ విభాగంలో పనిచేసే ఓ వైద్యుడు ఏకంగా 23ఏళ్ల పాటు ఆచూకీ లేకుండా పోయారు. ఆ డాక్టర్‌ గతేడాది ప్రజారోగ్య సంచాలకులను కలసి తనకు పోస్టు ఇవ్వాలని అర్జీ పెట్టుకోగా.. వెంటనే పోస్టింగ్‌ ఇచ్చారు. ఈ వ్యవహారం వెనక పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపించాయి. దీనిని సర్కారు సీరియ్‌సగా తీసుకుంది. అలాగే గతేడాది జరిగిన సాధారణ బదిలీల్లో డీహెచ్‌ కార్యాలయ అధికారులలు పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపించాయి. ఈ రెండు ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఇన్‌చార్జ్‌ డీహెచ్‌తో పాటు ఆ కార్యాలయంలో మరో ఏడుగురికి చార్జ్‌ మోమో జారీ చేసింది. అది ఇంకా కొలిక్కి రాలేదు. అలాగే డాక్టర్‌ పద్మజపై కూడా గతంలో అవినీతి ఆరోపణలు రావడంతో చార్జ్‌ మెమో జారీ అయింది. దీంతో సీనియారిటీ జాబితాలో ఉన్న ముగ్గురిపై చార్జ్‌ మెమోలు ఉండటంతో వారు హెచ్‌వోడీ పోస్టుకు అనర్హులని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత సీనియారిటీలో డాక్టర్‌ పుష్ప ఉన్నా.. ఆమె ఆ పోస్టుకు సరిపోరని సర్కారు భావిస్తోంది. దాంతో ఎవర్నీ నియమించకుండానే వైద్యశాఖ కాలం వెల్లదీస్తోంది. గత సర్కారు మాదిరిగానే కీలక విభాగాల బాధ్యతలను ఇన్‌చార్జ్‌ల చేతుల్లో పెట్టింది.

Updated Date - Aug 12 , 2025 | 04:35 AM