కొత్త మెడికల్ కాలేజీలకు శాశ్వత సెలవు
ABN , Publish Date - Jan 01 , 2025 | 04:23 AM
భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఒక్క వైద్య కళాశాల కూడా రాదు. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం శాశ్వతంగా పుల్‌స్టాఫ్ పెట్టింది.
తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటులోనూ నో చాన్స్
రాష్ట్రంలో 34 ప్రభుత్వ, 28 ప్రైవేటు కళాశాలలు
జనాభా ప్రాతిపదికన 35 కాలేజీలకే పరిమితం
ఇప్పటికే అదనంగా 29 కళాశాలలు
హైదరాబాద్, డిసెంబరు31(ఆంధ్రజ్యోతి) భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఒక్క వైద్య కళాశాల కూడా రాదు. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం శాశ్వతంగా పుల్‌స్టాఫ్ పెట్టింది. ప్రతి పది లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్లతో మాత్రమే నూతన వైద్య కళాశాల మంజూరు చేస్తామని జాతీయ వైద్య కమిషన్ గత ఏడాది ఆగస్టు 16న కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులో 2024-25 విద్యా సంవత్సరం నుంచి ప్రతి 10 లక్షల జనాభాకు మాత్రమే కొత్తగా మెడికల్ కాలేజీ కోసం దరఖాస్తు చేసుకోవాలని, అలాగే 150 మించి ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను పెంచుకోవడానికి వీలు లేదని స్పష్టం చేసింది. అయితే ఆ నిబంధనను ఈ ఒక్క ఏడాదికి మినహాయింపునిస్తున్నట్లు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎమ్‌సీ) తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. అంటే 2025-26 విద్యా సంవత్సరానికి మాత్రమే కొత్త కాలేజీ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత అటు ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలోనూ కొత్తగా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఇక ఉండదు. రాబోయే విద్యా సంవత్సరానికి నూతన వైద్య కళాశాలల ఏర్పాటుకు ఇప్పటికే ఎన్‌ఎమ్‌సీ దరఖాస్తులు ఆహ్వానించింది. అందుకు తుది గడువు జనవరి 4వ తేదీగా తొలుత ప్రకటించింది. ఆ తర్వాత దాన్ని జనవరి 19 నాటికి పొడగించింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కొడంగల్‌లో ఏర్పాటుకాబోయే కొత్త మెడికల్ కాలేజీ జనవరి రెండోవారంలోగా దరఖాస్తు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే ఎక్కువగా మెడికల్ కాలేజీలు
రాష్ట్రంలో ఇప్పటికే 33 జిల్లాల్లో 34 మెడికల్ కాలేజీలు వచ్చాయి. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ హయంలో దరఖాస్తు చేసిన 8 కళాశాలలకు కేంద్రం నుంచి అనుమతులు సాధించింది. నిజానికి తెలంగాణలో జనాభా కంటే ఎక్కువగానే మెడికల్ కాలేజీలున్నాయి. ఊదాహరణకు తెలంగాణలో 3.5 కోట్ల జనాభా ఉంటే 62 ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. మొత్తం 8515 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఎన్‌ఎంసీ తాజా నిబంధన మేరకు కేవలం 3500ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండాలి. అంతకు మించి ఉంటే కొత్త కాలేజీలకు అనుమతి ఇవ్వబోమని ఎన్‌ఎమ్‌సీ నిబంధన చెబుతోంది. తెలంగాణలో ఇబ్బడిముబ్బడిగా వైద్య కళాశాలలు రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మెడికల్ కాలేజీల సంఖ్య పెరగడం వల్ల రాష్ట్ర విద్యార్ధులు ఎంబీబీఎస్ చేసే అవకాశం పెరిగిందని వారంటున్నారు. అయితే తగిన మౌలిక సదుపాయాలు కల్పించకుండా పుట్టగొడుగుల్లా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్ల నష్టమే ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జనాభాకు మించి ఎక్కువగానే మనదగ్గర కాలేజీలున్నాయి
ఇప్పటికే మనదగ్గర జనాభాకు మించి మెడికల్ కాలేజీలున్నాయి. వాస్తవానికి కళాశాల భవనాలు, అనుబంధ ఆస్పత్రులు నిర్మించిన తర్వాతనే నూతన మెడికల్ కాలేజీల కోసం దరఖాస్తు చేయాలి. కానీ గత ప్రభుత్వం ఏమీ లేకుండానే మెడికల్ కాలేజీల జీవోలు ఇచ్చింది. తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన 25 మెడికల్ కాలేజీల అనుబంధ ఆస్పత్రులకు ఇంతవరకు శంకుస్థాపన చేయలేదు. మెజార్టీ ఏరియా ఆస్పత్రులు, జిల్లా వైద్యశాలల్లో బోధనాస్పత్రులు నడుస్తున్నాయి.
- డాక్టర్ నరహరి, తెలంగాణ
ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు.