Share News

Nizamabad: సామాజిక బహిష్కరణ కేసులో 13 మందికి ఐదేళ్ల జైలు

ABN , Publish Date - Jun 18 , 2025 | 06:23 AM

సామాజిక బహిష్కరణ కేసులో నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు 13 మందికి ఐదేళ్ల కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్‌ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయాధికారి టీ శ్రీనివాస్‌ మంగళవారం తీర్పు వెలువరించారు.

Nizamabad: సామాజిక బహిష్కరణ కేసులో 13 మందికి ఐదేళ్ల జైలు

  • నిజామాబాద్‌ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు

నిజామాబాద్‌ లీగల్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): సామాజిక బహిష్కరణ కేసులో నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు 13 మందికి ఐదేళ్ల కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్‌ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయాధికారి టీ శ్రీనివాస్‌ మంగళవారం తీర్పు వెలువరించారు. 2021 నవంబరు 23న మునిపల్లి సర్పంచ్‌ సాయిరెడ్డి, ఎంపీటీసీ తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి అదే గ్రామానికి చెందిన నాయకపోడు కులస్థుడైన తుమ్మ రవీందర్‌ తన కులస్థులతో కలిసి వెళ్లాడు. శివాలయానికి వెళ్లే దారి కబ్జాకు గురైందని, దాంతో తమకు దారి చూపించాలని వీడీసీ సభ్యులను వేడుకున్నారు.


కానీ వీడీసీ సభ్యులు సమస్య వినకుండా నాయకపోడు కులస్థులకు రూ.15 వేల జరిమానా విధించారు. నాయకపోడు కులస్థులను సామాజిక బహిష్కరణ చేశారు. దీనిపై నాయకపోడు కులస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో నేరారోపణలు రుజువు కావడంతో వీడీసీ సభ్యులు టంకశాల నరేష్‌, గాజుల లింగన్న, కొలిప్యాక సాయిరెడ్డి, ముస్కు గంగారెడ్డి, మర్రిపల్లి పొట్టెన్న, బంపల్లి రాజేందర్‌, గుడ్ల మోహన్‌, గొల్ల చవుల బాజన్న, చింతలపల్లి గంగారెడ్డి, చింతలపల్లి పెద్ద సాయిరెడ్డి, గుండేటి లింగన్న, కొలిప్యాకల సాయరెడ్డి, గొర్రకంటి గంగ సాయిలుకు ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ న్యాయాధికారి తీర్పు చెప్పారు. గ్రామానికే చెందిన గుమెర్ల మల్లయ్య, అరే గంగారామ్‌కు రూ.200 చొప్పున జరిమానా విధించారు.

Updated Date - Jun 18 , 2025 | 06:23 AM