Nizamabad constable murder case: నిజామాబాద్ కానిస్టేబుల్ హత్యకేసు నిందితుడు మృతి
ABN , Publish Date - Oct 20 , 2025 | 12:47 PM
నిజామాబాద్ కానిస్టేబుల్ హత్యకేసు నిందితుడు మృతి చెందాడు. నిన్న రియాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి గాయాలు కావడంతో జీజీహెచ్ కి తరలించారు. అక్కడ ఇవాళ చికిత్స పొందుతూ నిందితుడు రియాజ్ మరణించాడు.
నిజామాబాద్, అక్టోబర్ 20: కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడైన రియాజ్ మృతి చెందాడు. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో రియాజ్ ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం నాడు రియాజ్‌ను చూసిన పోలీస్ కానిస్టేబుల్ ఆసిఫ్.. అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. రియాజ్‌ను పట్టుకునే క్రమంలో ఆసిఫ్ దాడి చేయాల్సి వచ్చింది. దీంతో రియాజ్‌కు గాయాలయ్యాయి. అతన్ని నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. రియాజ్‌కు సెక్యూరిటీగా ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించారు. అయితే, బందోబస్తులో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర నుంచి వెపన్‌ను లాక్కొని పారిపోయే ప్రయత్నం చేశాడు రియాజ్. ఈ ప్రయత్నంలో ఏఆర్ కానిస్టేబుల్‌కి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన మరో కానిస్టేబుల్.. రియాజ్‌పై కాల్పులు జరిపాడు. దీంతో రియాజ్ ప్రాణాలు కోల్పోయాడు.
ఎన్‌కౌంటర్‌పై డీజీపీ శివధర్ రెడ్డి వివరణ..
రియాజ్ ఎన్‌కౌంటర్‌పై డీజీపీ శివధర్ రెడ్డి వివరణ ఇచ్చారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన డీజీపీ.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ‘రియాజ్ తప్పించుకుని పారిపోతూ పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. పోలీసుల దగ్గరున్న వెపన్ తీసుకొని కాల్పులకు ప్రయత్నించాడు. రియాజ్‌ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు. మరోసారి కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో రియాజ్ చనిపోయాడు. నిన్న రియాజ్‌ను పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ ఆసిఫ్‌పై దాడి చేశాడు. ఇవాళ మరొక కానిస్టేబుల్‌ని గాయపరిచి పారిపోయేందుకు యత్నించాడు. బాత్రూమ్ కోసం వెళ్లి తిరిగి వస్తూ దాడికి తెగబడ్డాడు రియాజ్. పోలీసుల దగ్గరున్న వెపన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే చాలా ప్రాణాలు పోయేవి. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో కాల్పులు జరిగాయి.’ డీజీపీ శివధర్ రెడ్డి వివరించారు.