Liver Treatment: నిమ్స్‌లో ‘రీజనరేటివ్ మెడిసిన్’: డైరెక్టర్ బీరప్ప
ABN , Publish Date - Sep 09 , 2025 | 05:17 AM
లివర్ పాడైనా, మోకాలి చిప్ప అరిగినా అధైర్యపడొద్దని, శస్త్ర చికిత్సతో పనిలేకుండానే ఇంజెక్షన్ ద్వారా లివర్‌కు పునరుజ్జీవం పోయోచ్చని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్యులు అంటున్నారు.
నిమ్స్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): లివర్ పాడైనా, మోకాలి చిప్ప అరిగినా అధైర్యపడొద్దని, శస్త్ర చికిత్సతో పనిలేకుండానే ఇంజెక్షన్ ద్వారా లివర్‌కు పునరుజ్జీవం పోయోచ్చని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్యులు అంటున్నారు. ఆస్పత్రిలో అక్టోబరు 2 తర్వాత రోగులకు ఈ ఇంజెక్షన్ అందుబాటులోకి రానున్నట్టు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు. ‘‘ఈ విధానాన్ని ‘రీజనరేటివ్ మెడిసన్’ అంటారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై పరిశోధనలు జరుగుతున్నాయి. యూఎ్‌సకు చెందిన ఓ సంస్థతో ఒప్పందం కుదిరింది. ఎంతో ఖరీదైన ఈ ఇంజెక్షన్ సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానం ద్వారా ఇప్పటికే వైద్యం అందుబాటులో ఉంది’’ అని ప్రొఫెసర్ చెప్పారు. నిమ్స్‌లో అక్టోబరు 2 విజయదశమి రోజున వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. దాంతో రూ.80 లక్షల వ్యయంతో రూపొందించిన నెక్సట్ - జనరేషన్ సీక్వెన్సింగ్ మిషన్ (టార్గెట్ థెరపీ) అందుబాటులోకి రానుందని ప్రొఫెసర్ తెలిపారు. ఐసీఎమ్‌ఆర్ ప్రాజెక్టులో భాగంగా ఈ మిషన్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు చెప్పారు. అభివృద్థి చెందిన దేశాలతో సమానంగా నిమ్స్ ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రొఫెసర్ బీరప్ప పేర్కొన్నారు.