NIMS: నిమ్స్‌కు గణనీయంగా పెరిగిన రోగుల రాక
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:16 AM
నిమ్స్‌లో జరిగిన ఫ్యాకల్టీ సమావేశం అంశాలను అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ భూషణ్ రాజు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. నిమ్స్‌లో 2022లో 6.6 లక్షల మంది రోగులు చికిత్స పొందగా 2024 నాటికి ఆ సంఖ్య 9.2 లక్షలకు చేరిందని వివరించారు.

2024లో 9.2 లక్షల మందికి చికిత్స
నిమ్స్ ఫ్యాకల్టీ అసోసియేషన్ వెల్లడి
హైదరాబాద్ సిటీ, మార్చి 4(ఆంధ్రజ్యోతి): నిమ్స్‌కు రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, అందుకు అనుగుణంగా మెరుగైన వైద్య సేవలు, చికిత్సలు అందించడానికి నిమ్స్ ఎప్పటికప్పుడు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని నిమ్స్ ఫ్యాకల్టీ అసోసియేషన్ తెలిపింది. నిమ్స్‌లో జరిగిన ఫ్యాకల్టీ సమావేశం అంశాలను అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ భూషణ్ రాజు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. నిమ్స్‌లో 2022లో 6.6 లక్షల మంది రోగులు చికిత్స పొందగా 2024 నాటికి ఆ సంఖ్య 9.2 లక్షలకు చేరిందని వివరించారు. టీఎంవీఆర్ సర్జరీ, అధునాతన డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ వంటి అరుదైన శస్త్రచికిత్సలు చేసినట్లు చెప్పారు. అవయవ మార్పిడి శస్త్రచికిత్సలలో నిమ్స్ ముందంజలో ఉందని, జన్యు వ్యాధుల నిర్ధారణ, చికిత్సలో పురోగతి సాధించిందని వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద డయాలసిస్ యూనిట్లలో ఒకటిగా నిమ్స్ ఉందని చెప్పారు. సంచాలకులు బీరప్ప నగరి నాయకత్వంలో నిమ్స్ కొత్త శిఖరాలకు చేరుకుంటుందన్నారు. ఆస్పత్రికి అవసరమైన సహకారం అందిస్తున్న ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.