NHRC: ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చేది ప్రతిపక్షంలోనే
ABN , Publish Date - Jul 30 , 2025 | 04:03 AM
అధికారంలో ఉన్నప్పుడు ఆధిపత్యం ప్రదర్శించి, ప్రతిపక్షంలోకి రాగానే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం పరిపాటిగా, సార్వత్రిక సంప్రదాయంగా మారిందని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) చైర్మన్ జస్టిస్ రామ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యానించారు.
రాజకీయ నేతలకు ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్ జస్టిస్ రామ సుబ్రహ్మణ్యన్ చురకలు
మానవ హక్కుల పరిక్షణలో మీడియాది ఎనలేని పాత్ర అని వ్యాఖ్య
హైదరాబాద్ సిటీ, జూలై 29 (ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్నప్పుడు ఆధిపత్యం ప్రదర్శించి, ప్రతిపక్షంలోకి రాగానే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం పరిపాటిగా, సార్వత్రిక సంప్రదాయంగా మారిందని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) చైర్మన్ జస్టిస్ రామ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యానించారు. మీడియాలో వస్తున్న మానవ హక్కుల హననం ఘటనలు, ఉదంతాలను సుమోటోగా స్వీకరించి, బాధితులకు న్యాయమందించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. తమ విధి నిర్వహణలో మీడియా సహకారం ఎనలేనిదని కొనియాడారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం వేదికగా 2 రోజుల్లో 109కేసుల విచారణలో 29 కేసులకు శాశ్వత పరిష్కారం లభించిందని మంగళవారం మీడియా సమావేశంలో జస్టిస్ రామ సుబ్రహ్మణ్యన్ చెప్పారు. చట్టాన్ని వ్యతిరేకించిన బాలుడ్ని.. జువైనల్ జస్టిస్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా 40రోజులు సాధారణ జైలులో ఉంచిచిన పోలీసులను మందలించి, బాధితుడికి లక్ష పరిహారం ఇప్పించినట్లు తెలిపారు. బిహార్‌లో ఒక బాలిక కిడ్నాప్ కేసును తమ జోక్యంతో పోలీసులు 3రోజుల్లో పరిష్కరించారని పేర్కొన్నారు.
సూచీలే ప్రామాణికం కాదు
మానవ హక్కుల సూచీలో ర్యాంకులే ప్రామాణికం కాదని, భారత్ కంటే మెరుగైన పరిస్థితులున్నాయన్న దేశంలో మీడియా స్వేచ్ఛే లేదని రామసుబ్రహ్మణ్యన్ చెప్పారు. రాష్ట్రంలో గిరిజన మహిళ అక్రమ రవాణా కేసులో దోషిగా తేలిన ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు సుబ్రహ్మణ్యన్ వెల్లడించారు. డీఆర్‌డీవో రాకెట్ ప్రొపల్లెంట్ యూనిట్‌లో పేలుడు ఘటనలో మరణించిన 4 కుటుంబాలకు నష్ట పరిహారం అందేలా ఎన్‌హెచ్సార్సీ చేసింది. తెలంగాణ గురు కులాల్లో 48 మంది విద్యార్థుల మృతి 886 మంది విద్యార్థుల అనారోగ్య కారణాలపై 4 వారాల్లో నివేదిక సమర్పించాలని సంబంధిత కార్యదర్శులను ఆదేశించారు. రాష్ట్రంలో మానవ హక్కుల పరిరక్షణ, వివిధ అంశాలపై మంగళవారం సీఎస్ కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ తదితరులతో ఎన్‌హెచ్‌ఆర్సీ సమీక్షించింది.
సఖీ ఉద్యోగులకు 6 నెలలుగా వేతనాల్లేవ్
బాధిత మహిళల ‘సఖీ’ కేంద్రాల ఉద్యోగులకు 6 నెలలుగా వేతనాల్లేవని వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో కొండవీటి సత్యవతి చెప్పారు. 37 హత్య, అత్యాచారానికి గురైన ఆదివాసీ, గిరిజన, దళిత మహిళల కేసుల్లో 15 ఏళ్లు దాటినా బాధితులకు నష్ట పరిహారం అందలేదని దళిత స్ర్తీ శక్తి జాతీయ కన్వీనర్ గడ్డం ఝాన్సీ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపిస్తూ ఎన్‌హెచ్చార్సీకి బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది.