NHAI: ఎన్‌హెచ్‌ఏఐ అధికారిపై దాడి హేయం
ABN , Publish Date - Jul 02 , 2025 | 04:38 AM
హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) మేనేజర్ అచల్ జిందాల్‌పై జరిగిన దాడిని ఎన్‌హెచ్‌ఏఐ ఇంజనీర్లు తీవ్రంగా ఖండించారు.
దేశవ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఏఐ ఇంజినీర్ల నిరసన
బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోండి
హిమాచల్ సీఎంకు కేంద్ర మంత్రి గడ్కరీ సూచన
హైదరాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) మేనేజర్ అచల్ జిందాల్‌పై జరిగిన దాడిని ఎన్‌హెచ్‌ఏఐ ఇంజనీర్లు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ఎన్‌హెచ్‌ఏఐ ఇంజినీర్ల అసోసియేషన్ మంగళవారం నిరసన తెలిపింది. విధుల్లో ఉన్న అధికారిపై దాడి చేయడం హేయమైన చర్య అని ఎన్‌హెచ్‌ఏఐ తెలంగాణ రీజినల్ ఆఫీసర్ శివ శంకర్ ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. సిమ్లా జిల్లాలో విధుల్లో ఉన్న ఎన్‌హెచ్‌ఏఐ మేనేజర్ అచల్ జిందాల్‌పై ఆ రాష్ట్ర మంత్రి అనిరుధ్ సింగ్, అతని అనుచరులు దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా వైరల్ అయింది.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ (పీఐయూ, సిమ్లా) మేనేజర్‌పై హిమాచల్ పంచాయతీరాజ్ మంత్రి, అతని సహచరులు దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ముమ్మాటికీ చట్టాన్ని అవమానపరచడమే. ఇటువంటి సంఘటనలను సంస్థాగత సమగ్రతను దెబ్బతీసే చర్యగా పరిగణించాలి. నేరస్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని హిమాచల్ సీఎం సుఖు సుఖ్విందర్‌ను కోరాను. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని చెప్పాను’’ అని పేర్కొన్నారు. ఈ విషయమై ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్ సంతోష్ కుమార్‌యాదవ్ హిమాచల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.