చీరలతోనే నేతన్నకు ఉపాధి
ABN , Publish Date - Jan 09 , 2025 | 02:04 AM
నిత్యం ఆకలిచావులు, ఆత్మహత్యలు చవిచూసిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రంగురంగుల చీరలకు బ్రాండ్ ఇమేజ్‌ను తెచ్చింది. మొదట తమిళనాడులో పొంగల్‌కు అందించే చీరల ఉత్పత్తి సిరిసిల్ల నేతన్నలకు సంక్షోభంలో ఉపాధిని ఇచ్చింది. ఆ క్రమంలోనే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2017 నుంచి 2023 వరకు బతుకమ్మ చీరల ఉత్పత్తితో సిరిసిల్ల నేతన్నలకు ఉపాధిని ఇచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రభుత్వం బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదనే కారణంగా నిలిపివేసింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
నిత్యం ఆకలిచావులు, ఆత్మహత్యలు చవిచూసిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రంగురంగుల చీరలకు బ్రాండ్ ఇమేజ్‌ను తెచ్చింది. మొదట తమిళనాడులో పొంగల్‌కు అందించే చీరల ఉత్పత్తి సిరిసిల్ల నేతన్నలకు సంక్షోభంలో ఉపాధిని ఇచ్చింది. ఆ క్రమంలోనే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2017 నుంచి 2023 వరకు బతుకమ్మ చీరల ఉత్పత్తితో సిరిసిల్ల నేతన్నలకు ఉపాధిని ఇచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రభుత్వం బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదనే కారణంగా నిలిపివేసింది. మళ్లీ పాత పరిస్థితులు పునరావృతం అవుతున్న నేపఽథ్యంలో ప్రభుత్వ ఆర్డర్లతో చేయూతను ఇవ్వడం ప్రారంభించినా చేతినిండా పనిలేని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల స్థానంలో స్వశక్తి సంఘాల మహిళలకు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించి డిజైన్లను ఖరారు చేసింది. దీంతో చీరల ఉత్పత్తితోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఊపిరిని ఇస్తుందనే పరిస్థితి ఏర్పడింది.
- భరోసా ఇచ్చిన పొంగల్ చీరలు...
సిరిసిల్ల వస్త్ర సంక్షోభంలో నేతన్నలకు తమిళనాడు పొంగల్ చీరలు ఉపాధి భరోసా కల్పిస్తున్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేశారు. ఈ పరిస్థితుల్లో ఉపాధిని కోల్పోయిన నేత కార్మికులు ఇబ్బందులు పడుతున్న క్రమంలో ప్రత్యామ్నాయ ఉత్పత్తులపై దృష్టి సారిస్తున్న వస్త్ర పరిశ్రమకు తమిళనాడులో పొంగల్ (సంక్రాంతి)సందర్భంగా అక్కడి ప్రభుత్వం అందించే చీరలను సిరిసిల్లలోని ఉత్పత్తికి అవకాశం కల్పించారు. దీంతో సిరిసిల్లలోని నేత కార్మికులకు కొంత మేరకు ఉపాధి లభిస్తుంది. మూడు నెలలపాటు కార్మికులకు పని అందుతుంది. తమిళనాడు ప్రభుత్వం ఈసారి 480 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తూ మూడు కోట్ల చీరలు, పంచెలను అందించనుంది. ఇందులో భాగంగా సిరిసిల్లలో ప్రస్తుతం లక్ష చీరల వరకు ఆర్డర్లు వచ్చాయి. ఈసారి తమిళనాడు ప్రభుత్వం పాలిస్టర్, కాటన్ ఉపయోగించి చీరలను ఉత్పత్తి చేస్తుంది. మూడురంగుల్లో చీరల ఉత్పత్తులు జరుగుతున్నాయి. తమిళనాడు చీరల ఉత్పత్తిలో మరమగ్గాల యజమానులకు ఒక మీటరుకు ఆరు రూపాయల వరకు చెల్లిస్తే కార్మికులకు రూ. 2.75 వరకు ఇస్తున్నారు. దీంతో కార్మికుడికి నెలకు 12 వేల రూపాయల వరకు ఉపాధి లభిస్తుంది.
- 2014 నుంచి తమిళనాడు చీరల ఉత్పత్తి..
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో మరమగ్గాలపై తమిళనాడుకు సంబంధించిన చీరల ఉత్పత్తి 2014 నుంచి మొదలైంది. తమిళనాడు నుంచి ఎస్ రామారావు చీరల ఆర్డర్లు తీసుకవచ్చి ఉత్పత్తిని ప్రారంభించారు. సెప్టెంబరు, అక్టోబరు వరకు తెలంగాణ బతుకమ్మ చీరల ఉత్పత్తి జరిగితే సంక్రాంతి వరకు తమిళనాడు చీరల ఉత్పత్తితో కార్మికులకు ఉపాధి లభించేది. తమిళనాడు చీరలను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టడం గమనార్హం.
- 1.30 కోట్ల స్వశక్తి చీరల ఆర్డర్లు...
సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా బతుకమ్మ చీరల స్థానంలో స్వశక్తి సంఘాల మహిళలకు అందించే చీరల డిజైన్ల ఖరారు ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. సిరిస్లిల వస్త్రపరిశ్రమలో కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా స్వశక్తి సంఘాల మహిళలకు ప్రభుత్వం కొత్త డిజైన్లతో రెండేసి చీరలు ఇవ్వాలని నిర్ణయించింది. స్వశక్తి చీరల పథకం ద్వారా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు 1.30 కోట్ల చీరల ఆర్డర్లు త్వరలో రానున్నాయి. ఇందుకు సంబంధించిన డిజైన్లను టెస్కొ ఆధ్వర్యంలో రూపొందించారు. డిజైన్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ఎక్కువగా నిధులు కేటాయించి నాణ్యమైన చీరలను అందించే దిశగా చర్యలు చేపడుతున్నారు. చీరల డిజైన్లు ఎప్పుడు ఖరారు చేసి ఆర్డర్లు అందిస్తారనే దానిపై సందిగ్ధం మాత్రం కొనసాగుతోంది.
- వస్త్ర పరిశ్రమలో ఉపాధి చర్యలు
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించే దిశగా ప్రభుత్వ ఆర్డర్లతో నేత కార్మికులకు ఉపాధి చర్యలు వేగవంతం చేసింది. జిల్లాలో జియో ట్యాగింగ్ చేసిన 30,352 మరమగ్గాలు ఉండగా 270 వార్ఫిన్‌లు, ప్రత్యక్ష కార్మికులు 5,720 మంది ఉండగా పరోక్షంగా ఉపాధి పొందే కార్మికులు మరో మూడు వేల మంది వరకు ఉన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో 150 మంది మాస్టర్ వీవర్స్ ఉండగా 1,872 మరమగ్గాల యూనిట్లు ఉన్నాయి. 126 మ్యాక్స్ సొసైటీలు, 65 ఎస్‌ఎస్‌ఐ యూనిట్ల ద్వారా వస్త్ర పరిశ్రమలో బట్ట ఉత్పత్తి కొనసాగుతోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2017 నుంచి 2023 వరకు బతుకమ్మ చీరల ఆర్డర్లను అందించింది. వీటితో పాటు ఇతర ఆర్డర్ల ద్వారా ఊరటగానే పరిశ్రమ కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమలో మార్పులు తీసుకువచ్చింది. నేతన్నలకు భరోసా కల్పిస్తూ సమగ్ర శిక్ష ద్వారా విద్యార్థులకు రెండు యూనిఫాంల చొప్పున రూ 28.84 కోట్ల క్లాత్ ఉత్పత్తి ఆర్డర్లను ఇచ్చింది. గతంలో ఉన్న బతుకమ్మ చీరలు, ఇతర ఆర్డర్ల బకాయిలు 379 కోట్ల రూపాయలను విడుదల చేసింది. తాజాగా 50 కోట్ల రూపాయలతో యారన్ డిపో వేములవాడలో ప్రారంభించారు. త్రిప్ట్ పథకం కింద 36 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కరెంట్ రాయితీ 50 శాతానికి సంబంధించి పది హెచ్‌పీల వరకు వినియోగించుకునే దిశగా చర్యలు చేపట్టారు.
తమిళనాడు చీరలతో ఉపాధి..
- పోలు గోపికృష్ణ, పవర్‌లూం ఆసామి
బతుకమ్మ చీరల ఉత్పత్తి నిలిచిపోయిన తరువాత తమిళనాడు చీరలతో ఉపాధి లభిస్తుంది. మార్చి 31 వరకు ఆర్డర్లు వచ్చాయి. ఉత్పత్తి చేసిన చీరలు మూడు రోజులకు ఒకసారి పంపిస్తున్నాం. ఒక మీటరుకు ఆరు రూపాయల వరకు చెల్లిస్తున్నారు.
రూ. 10 వేల వరకు కూలీ...
- కనకయ్య, కార్మికుడు
తమిళనాడు పొంగల్ చీరలతో ప్రతి నెలా 10 వేల రూపాయల వరకు కూలి లభిస్తుంది. 11 మరమగ్గాలు నడుపుతున్నారు. కూలీ గిట్టుబాటుగానే ఉంది.