పత్రికా రంగం పుంజుకోవడం.. పేపర్ పరిశ్రమకు సానుకూలాంశం
ABN , Publish Date - Jun 07 , 2025 | 05:26 AM
దేశంలోని పేపర్ పరిశ్రమలో 2కోట్ల మంది పని చేస్తున్నారని, దేశీయ పరిశ్రమను దిగుమతులు దెబ్బ తీస్తున్నాయని, ఈ రంగంపై ఆధారపడ్డ ప్రతి ఒక్కరూ సంఘటితం కావాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు.
ఈ-కామర్స్ వృద్ధితో క్రాఫ్ట్ ప్యాకేజింగ్‌లో అవకాశాలు
పాప్ ఎక్స్‌పో-2025 ప్రారంభోత్సవంలో వక్తలు
హైదరాబాద్ సిటీ, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): దేశంలోని పేపర్ పరిశ్రమలో 2కోట్ల మంది పని చేస్తున్నారని, దేశీయ పరిశ్రమను దిగుమతులు దెబ్బ తీస్తున్నాయని, ఈ రంగంపై ఆధారపడ్డ ప్రతి ఒక్కరూ సంఘటితం కావాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్న జాతీయ పేపర్ ఎక్స్‌పో (పాప్ ఎక్స్‌పో)-25 శుక్రవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఎక్స్‌పోను ప్రగతి ఆఫ్‌సెట్ ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పరుచూరి నరేంద్ర ప్రారంభించారు. ఇమామీ పేపర్ మిల్స్ సీఎంవో సౌమ్యజిత్ ముఖర్జీ, సతియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సతియా, త్రీఎం పేపర్ బోర్డ్స్ లిమిటెడ్ ఎండీ రుషబ్ షా, ఐపీపీటీఏ జనరల్ సెక్రటరీ ఎంకే గోయల్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ డిప్యూటీ డైరెక్టర్ నటరాజ్, పాపిరస్ ఎక్స్‌పో ఎల్‌ఎల్‌పీ సీఈవో నిర్మల్ కుహద్, పేపర్ ఫౌండేషన్ అధ్యక్షుడు బీఆర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మల్ కుహద్ మాట్లాడుతూ... భారత్‌లో సగటున ఒక్కొక్కరు 15-16 కిలోల పేపర్ వినియోగిస్తుంటే, ప్రపంచవ్యాప్త సగటు 57కిలోల వరకు ఉందన్నారు. భారతదేశంలో తయారవుతున్న, వినియోగిస్తున్న పేపర్‌లో దాదాపు 80ు రీసైకిల్డ్ వనరుల నుంచే ఉత్పత్తి అవుతోదన్నారు. ఇమామి పేపర్ మిల్స్ సీఈవో సౌమ్యజిత్ ముఖర్జీ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా న్యూస్ ప్రింట్ పేపర్‌కు ఆదరణ తగ్గుతోందన్నారు. రెండు, మూడేళ్లలో పత్రికలు పునర్వైభవం సాధిస్తాయంటున్న అధ్యయనాలు.. భవిష్యత్‌పై ఆశలు రేకెత్తిస్తున్నాయన్నారు. రైటింగ్, ప్రింటింగ్ పేపర్ సంవత్సరానికి 3ు వృద్ధి నమోదు చేస్తుందన్నారు. అయితే, క్రాఫ్ట్ ప్యాకేజింగ్ విభాగం 8.5ు వృద్ధి నమోదు చేస్తుందని, ఈ-కామర్స్ వేగం కారణంగానే ఇది సాధ్యమవుతుందన్నారు. ఐపీపీటీఏ జనరల్ సెక్రటరీ ఎంకే గోయల్ మాట్లాడుతూ పేపర్ పరిశ్రమలో వృద్ధికి అపార అవకాశాలున్నాయని, ఈ దిశగా సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (హైదరాబాద్) డిప్యూటీ డైరెక్టర్ నటరాజ్ మాట్లాడుతూ ఈ తరహా ఎక్స్‌పోల ఆవశ్యకత ఎంతగానో ఉందన్నారు. భారతదేశంలో 80-82ు పేపర్ రీసైకిల్ ఉత్పత్తులతోనే తయారవుతుందని పాపిరస్ ఎల్‌ఎల్‌పీ అధ్యక్షుడు బీఆర్ రావు తెలిపారు.