Handloom Awards: చేనేత పురస్కారాలు రాష్ట్రానికి గర్వకారణం
ABN , Publish Date - Jul 09 , 2025 | 06:26 AM
కేంద్ర చేనేత, జౌళి మంత్రిత్వశాఖ ప్రకటించిన చేనేత పురస్కారాలు 2024కు రాష్ట్రం నుంచి ఇద్దరు కార్మికులు,,
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): కేంద్ర చేనేత, జౌళి మంత్రిత్వశాఖ ప్రకటించిన చేనేత పురస్కారాలు- 2024కు రాష్ట్రం నుంచి ఇద్దరు కార్మికులు ఎంపికకావటం రాష్ట్రానికి గర్వకారణమని వ్యవసాయ, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశవ్యాప్తంగా 19 మంది చేనేత కార్మికులు ఈ పురస్కారానికి ఎంపికైతే రాష్ట్రం నుంచి ఇద్దరికి అవార్డులు దక్కటం అభినందనీయమని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన గజం నర్మదకు చేనేత వస్త్రాల మార్కెటింగ్ విభాగంలో రూ.8 కోట్ల టర్నోవర్ చేసినందుకుగాను అవార్డు లభించింది. సహజ సిద్ధమైన రంగులను ఉపయోగించి జీఐ ట్యాగ్ పొందిన తేలియా రుమాల్‌తో పట్టుచీరను నేసిన గూడ పవన్‌కు కూడా జాతీయ పురస్కారం లభించటంపై తుమ్మల హర్షం వ్యక్తం చేశారు.