Share News

పేరు మారిస్తే చర్యలు మాఫీ?

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:38 AM

నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడిన ల్యాబ్‌లు, ఆసుపత్రులు పేరు మార్చుకుంటే చర్యలు మాఫీ అన్నట్లుగా మారింది.

 పేరు మారిస్తే చర్యలు మాఫీ?

ప్రైవేట్‌ ఆస్పత్రులపై నిఘా..పర్యవేక్షణ లోపం

అమ్మ కడుపులోనే కన్నుమూస్తున్న ఆడ శిశువులు

భువనగిరి టౌన, జూలై 7 (ఆంధ్రజ్యోతి): నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడిన ల్యాబ్‌లు, ఆసుపత్రులు పేరు మార్చుకుంటే చర్యలు మాఫీ అన్నట్లుగా మారింది. అవే భవనాలు, ఆరోపణలు ఎదుర్కొన్న ఆ వైద్యులే, ఆ సిబ్బందే కొత్త పేర్లతో ఆసుపత్రులను, ల్యాబ్‌లను లాభాషేక్ష ధోరణితో నిర్వహిస్తూ దారుణాలు సాగిస్తున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌లపై వైద్య, పోలీస్‌ శాఖల పర్యవేక్షణ, నిఘా లోపంతో అమ్మ కడుపులోనే ఆడ శిశువులు బ్రూణహత్యకు గురవుతున్నారు. ఆడ పిల్లంటే ఆర్థిక భారం అనే భావనకు తోడు.. ఈ కాన్పులోనైనా కొడుకు కావాలనే తల్లిదండ్రుల ఆశల కారణంగా బాహ్య ప్రపంచాన్ని చూడక ముందే ఆడ శిశువును శాశ్వతంగా కన్నుమూస్తున్నారు. ఈ తరహా వెలుగు చూస్తున్న అమానుషాలు కొన్నైతే చీకటిలో మగ్గిపోతున్నవే అధికమని పలువురు వాపోతున్నారు. ఈ క్రమంలో భువనగిరిలో ఒకే ఆస్పత్రిలో ఒకే రోజున ఏకకాలంలో అర్హత లేని వైద్య దంపతులు రెండు అబార్షన్లు చేయడంతో ఇద్దరు ఆడ శిశువలు కన్నుమూసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ల్యాబ్‌ యజమాని ఒక్కో లింగ నిర్దారణ పరీక్షకు రూ.16వేలు, ఒక్కో అబార్షనకు ఆసుపత్రి నిర్వాహకులు రూ.30వేలు ముందస్తు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇంకా అధిక మొత్తంలోనే ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. అయితే ఈ తరహా లింగ నిర్ధారణ పరీక్షలు అబార్షన్లు జిల్లా కేంద్రం భువనగిరితో పాటు ఇతర ప్రాంతాల్లోని పలు ఆసుపత్రులు, ల్యాబ్‌లలో నిరంతరాయంగా సాగుతున్నాయని ఐఎంఏ ప్రతినిధులే అంతర్గంతంగా మాట్లాడుకుంటుండడం, ఆడపిల్లపై వివక్ష బ్రూణ హత్యల తీవ్రతను తెలియజేస్తోంది. ఇలాంటి సంఘనలు వెలుగు చూసిన ప్రతీ సందర్భంలో నోటీసులు, తనిఖీల పేరిట అధికారులు హడాహుడి చేసి అనంతరం గుర్తుతెలియని కారణాలతో గుప్తంగా ఉండిపోతుండడం పరిపాటిగా మారుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇటీవలే జిల్లాలోని 41స్కానింగ్‌ సెంటర్లు, పలు ఆసుపత్రుల్లో తనిఖీలు చేసిన అధికారులు 35 స్కానింగ్‌ సెంటర్లను నోటీసులు ఇచ్చి తదుపరి చర్యలను విస్మరించినట్లు ఆరోపణలున్నాయి.

పేరు ఎలా మారిందంటే..?

భువనగిరిలో అక్రమ పర్వం వెలుగు చూసిన గాయత్రి ఆప్పత్రి అసలు పేరు స్వాతి హాస్పటల్‌. కానీ అర్హత లేని ఆసుపత్రి నిర్వాహకులు వైద్య చికిత్సలతో ఇద్దరు మహిళలు మృతి చెందటం, అబార్షన్ల ఘటనలు వెలుగు చూడటంతో అప్పటి అధికారులు ఆ ఆసుపత్రి అనుమతులను రద్దు చేశారు. కానీ ఆ వెంటనే గాయత్రి ఆసుపత్రి పేరిట అధికారులు తిరిగి అనుమతులు ఇవ్వడంతో అదే అక్రమ తంతును యథావిధిగా కొనసాగిస్తున్నారు. తుర్కపల్లి, చౌటుప్పల్‌, తదితర మండలాల్లోని పలు ల్యాబ్‌లు, ఆసుపత్రులు కూడా రూపాంతరం చెందిన యథావిధిగా లింగనిర్ధారణ పరీక్షలు, బ్రూణ హత్యలను సాగిస్తున్నట్లు ప్రచారం. అయితే మెజార్టీ ఆసుపత్రులు, ల్యాబ్‌లు కూడా రహస్యంగా ఈ తంతును కొనసాగిస్తున్నాయని, ఇందుకు పలువురు గ్రామీణ వైద్యులు మధ్యవర్తులుగా ఉంటూ తప్పుడు మార్గం ఎంచుకుంటున్న దంపతుల ఆర్థిక స్తోమత, సామాజిక హోదా ఆధారంగా చార్జీలను నిర్ణయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. ఇందుకు కొద్ది మంది వైద్య ఆరోగ్య శాఖ అధికారులులోపాయకారిగా సహకరిస్తూ కాపాడుతున్నారని, ప్రతిఫతంగా భారీ ముడుపులు పొందుతున్నారని సహచర ఉద్యోగులే ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ మేరకు ఆ శాఖ ఉద్యోగుల మధ్య ఇటీవల జరిగిన కుమ్ములాటలే నిదర్శనమని పలువురు అంటున్నారు. అయితే నిబంధనలకు లోబడి లింగ నిర్ధారణ పరీక్షలకు, అబార్షన్లకు చట్టాలు అనుమతిస్తున్నాయి. కానీ ఆ చట్టాలు, నిబంధనలు పాటించిన సందర్భాలు, అమలు చేసే ఆలోచనలు, పర్యవేక్షించే ఓపిక నిర్వాహకులకు, అధికారులకు లేనే లేవని పలు సందర్భాలు నిరూపిస్తున్నాయి.

లింగనిర్ధారణ అబార్షన్లపై చట్టాలు, శిక్షలు ఇలా..

లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేసిన వారితో పాటు చేయించుకున్న మహిళలు, ప్రోత్సహించిన కు టుంబాలు కూడా శిక్షార్హులే. గర్భధారణ పూర్వ, గర్భస్త పిండ ప్రక్రియ (లింగ ఎంపిక నిషేధ) చట్టం 1994 ప్రకారం పుట్టబోయేది ఆడ బిడ్డా, మగ బిడ్డా అని అడుగుట, నిర్ధారించుట, చట్టరీత్యా నేరం, లింగనిర్ధారణ పరీక్షలు చేసిన వారికి, చేయించుకున్నవారికి, ప్రోత్సహించిన వారికి చట్టం ప్రకారం 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.50వేల జరిమానా ఉంటుంది.

ఎంటీపీ యాక్ట్‌ ప్రకారం..

మెడికల్‌ టర్మినేషన ఆఫ్‌ ప్రెగ్నెన్సీ చట్టం (ఎంటీపీ యాక్ట్‌) స్కానింగ్‌కు, అబార్షన్లకు అనుమతి ఉంటుంది. అయితే ఇందుకు పలు నిబంధనలు పాటించాల్సి ఉం టుంది. అర్హులైన వైద్యులే నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణ, సామాజిక ఆరోగ్య కారణాలు, గర్భనిరోధక జాగ్రత్తలు విఫలమైన పక్ష్యంలో, తల్లి గర్భంలో శిశువు ఎదుగుదల, గర్భిణీ మానసిక, శారీరక ఆరోగ్యం ఆధారంగా ఎంటీపీ యాక్ట్‌ను అమలు చేయవచ్చేను ఇందు కు 20 వారాల లోపు గర్భిణికి రిజిస్ట్రర్డ్‌ వైద్యుడు 20 నుంచి 24 వారాల గర్భిణికి ఇద్దరు అర్హులైన వైద్యులు, 24 వారాల పైబడి గర్భిణికి వైద్య బోర్డు సలహా మే రకు స్కానింగ్‌ నిర్వహించి అబార్షన చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఎంబీబీఎస్‌ వైద్యులు కనీసం 6 నెలల పాటు గైనకాలజీ విభాగంలో ఇంటెన్షిప్‌ లేదా కనీసం ఒక సంవత్సరం ప్రాక్టిస్‌, లేదా 25 ఎంటీపి యాక్ట్‌ కేసుల బృందంలో సభ్యునిగా ఉండాల్సి ఉం టుంది. ప్రతి స్కానింగ్‌, అబార్షనను రికార్డు చేసి ప్రతి నెలకు డీఎంహెచవోకు సమర్పించాల్సి ఉంటుంది. ఇందు కోసం ఆయా ఆసుపత్రులు ముందుగానే ప్రత్యేక అనుమతులు పొందా ల్సి ఉంటుంది. వైద్యాధికారులు నిరంతరం ఆ ఆసుపత్రులను తనిఖీ చేయాల్సి ఉంటుంది. కఠినతరమైన ఈ నిబంధనలను పాటించడం కష్టసాధ్యం కావడంతో ఆసుపత్రులు, ల్యాబ్‌ నిర్వాహకులు ఎంటీపీ యాక్ట్‌ బదులు రహస్య చర్యలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

Updated Date - Jul 08 , 2025 | 12:39 AM