Share News

డీ-అడిక్షన కేంద్రం ఏర్పాటెన్నడో?

ABN , Publish Date - Apr 12 , 2025 | 11:36 PM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డీ-అడిక్షన కేంద్రం ఏర్పాటు ఆలస్యమవుతోంది. మూడేళ్ల కిందటే అధికారులు ప్రతిపాదనలు పంపించినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఉమ్మడి జిల్లాకు ఎక్కువగా గంజాయి రవాణా అవుతుండటంతో యువత ఆ మత్తుకు బానిసవుతున్నారు.

డీ-అడిక్షన కేంద్రం ఏర్పాటెన్నడో?

అధికారులు ప్రతిపాదించి మూడేళ్లు

డ్రగ్స్‌, గంజాయి, మద్యానికి బానిసలవుతున్న యువత

ప్రైవేట్‌ కేంద్రాల్లో డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి

ఉమ్మడి జిల్లాలో పెద్దసంఖ్యలో మత్తు పదార్థాల బానిసలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డీ-అడిక్షన కేంద్రం ఏర్పాటు ఆలస్యమవుతోంది. మూడేళ్ల కిందటే అధికారులు ప్రతిపాదనలు పంపించినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఉమ్మడి జిల్లాకు ఎక్కువగా గంజాయి రవాణా అవుతుండటంతో యువత ఆ మత్తుకు బానిసవుతున్నారు. దీనికి తోడు ఇతర మత్తు పదార్థాలకు అలవాటుపడుతున్నారు. ఈ క్రమంలో వారిని మత్తు నుంచి బయటపడేసేందుకు కౌన్సెలింగ్‌ ఇచ్చి, ఆరోగ్య పద్ధతిలో బయటకు తీసుకువచ్చేందుకు డీ-అడిక్షన కేంద్రాలు దోహదపడనున్నాయి. అయితే ఉమ్మడి జిల్లాలో డీ-అడిక్షన కేంద్రం లేకపోవడంతో ఇతర ప్రాంతాల్లోని కేంద్రాల్లో చేర్పించి మత్తుకు బానిసలైన వారి కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు.

- (ఆంధ్రజ్యోతి-సూర్యాపేటక్రైం)

ప్రస్తుతం డ్రగ్స్‌, గంజాయికి ఎక్కువగా యువత బానిసవుతోంది. విద్యార్థి దశ నుంచి మొదలు యు వకులు మత్తుకు బానిసవుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి రవాణాతో పాటు విక్రయాలు జరుగుతున్నాయి. గంజాయిని అరికట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో నియంత్రించలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ, చత్తీ్‌సఘడ్‌ రాష్ట్రాల నుంచి వివిధ మార్గాల్లో గంజాయిని ఉమ్మడి జిల్లాలోకి తరలిస్తున్నారు. కొంతమంది యువత గంజాయి రవా ణా, విక్రయాల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, భువనగిరి, దేవరకొండ, నేరేడుచర్ల, నకిరేకల్‌, చౌటుప్పల్‌, చిట్యాల, కోదాడ, హుజూర్‌నగర్‌, ఆలేరు తో పాటు మిగిలిన పట్టణాల్లో పెద్దఎత్తున గంజా యి విక్రయాలు జరుగుతున్నాయి. మత్తుకు బానిసలైన వారు పెద్దసంఖ్యలో ఉన్నారు. పోలీసులు మత్తుకు బానిసలైన వారిని పట్టుకుని కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. మత్తుకు బానిసలైన వారిని డీ-అడిక్షన(వ్యసనాల నుంచి విముక్తి చేసే) కేంద్రానికి పంపించి అక్కడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తే వారిలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఉమ్మడి జిల్లాలో డీ-అడిక్షన కేంద్రం ఏర్పాటు చేస్తామని గతంలో అధికారులు ప్రకటించినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో మత్తుకు బానిసలైన వారిని హైదరాబాద్‌, విజయవాడ నగరాలకు తీసుకెళ్లి అక్కడి కేంద్రాల్లో చేర్పించి వేలల్లో ఖర్చు చేసి వారిలో మార్పు తీసుకవచ్చేందుకు వారి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.

మూడేళ్ల కిందటే ప్రతిపాదనలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డీ-అడిక్షన కేంద్రం ఏర్పాటుకు మూడేళ్ల కిందట అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అయినప్పటికీ నేటికి ఏర్పాటుకాలేదు. మత్తుకు బానిస అయిన వారికి చికిత్సతో పాటు కౌన్సెలింగ్‌ ఇచ్చి వారిలో మార్పు తీసుకవచ్చే శక్తి డీ-అడిక్షన కేంద్రాలకు ఉంది. అయితే కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిక శాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ యాక్షన ఫర్‌ డ్రగ్స్‌ డిమాండ్‌ రిడక్షన పథకం కింద ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రుల్లో డీ-అడిక్షన కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. మత్తుకు బానిసలైన వారికి అక్కడ ఉచితంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. అయితే కేంద్రం ప్రతిపాదనలు మాత్రం అమలుకు నోచుకోలేదు.

మార్పు కోసం డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి

ఉమ్మడి జిల్లాలో పెద్దసంఖ్యలో మత్తు పదార్థాలకు బానిసలైన వారు ఉన్నారు. వారిలో మార్పు తీసుకరావడానికి ఉమ్మడిజిల్లాలో డీ-అడిక్షన కేంద్రం లేదు. దీంతో వారిని హైదరాబాద్‌, విజయవాడ నగరాలకు తీసుకెళ్లి అక్కడ ఉన్న ప్రైవేట్‌ డీ-అడిక్షన కేంద్రాల్లో చేర్పించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకు చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. మత్తుకు బానిసలుగా మారిన వారిలో ఎక్కువగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువత ఉంటున్నారు. ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాలంటే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా డీ-అడిక్షన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే మత్తుకు బానిసలుగా మారిన వారిలో కొందరిలోనైనా మార్పు తీసుకవచ్చే అవకాశం లేకపోలేదు.

గంజాయికి బానిసలు

ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా యువత గంజాయికి బానిసలవుతున్నారు. గంజాయి మత్తులో యువత ఘర్షణలకు పాల్పడుతున్నారు. పలు సందర్భాల్లో కుటుంబ సభ్యులపై కూడా దాడులు చేస్తున్నారు. మత్తులో వారు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పోలీసులు తనిఖీలు చేస్తూ గంజాయి రవాణా కాకుండా చర్యలు తీసుకుంటున్నా ఏదో ఒక మార్గంలో గంజాయి రవాణా అవుతోంది. గంజాయి రవాణా చేసే, విక్రయించే, తాగే వారిని అదుపులోకి తీసుకుని వారితో పాటు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నా ఫలితాలు రావడం లేదు.

డీ-అడిక్షన కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నిసాం

సూర్యాపేట జిల్లా కేంద్రంలో డీ-అడిక్షన కేం ద్రం ఏర్పాటుకు ప్రయత్నిస్తాం. పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి డీ-అడిక్షన కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపడుతాం. గతంలో ప్రతిపాదనలు పంపించారు. మత్తుకు బానిసలైన వారిని మార్చేందుకు డీ-అడిక్షన కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. యువత డ్రగ్స్‌, గంజాయికి దూరంగా ఉండాలి. గంజాయి నిర్మూనలకు కృషి చేస్తున్నాం. గంజాయి నిర్మూలనలో ప్రజలు పోలీసులకు సహకరించాలి.

- కొత్తపల్లి నర్సింహ,ఎస్పీ సూర్యాపేట జిల్లా.

Updated Date - Apr 12 , 2025 | 11:36 PM