గోపాలమిత్ర గోడు వినేదెవరు?
ABN , Publish Date - Jul 01 , 2025 | 11:58 PM
గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు సకాలంలో పశు వైద్య సేవలు అందిస్తున్న గోపాలమిత్రల పరిస్థితి దయనీయంగా మారింది.
10 నెలలుగా అందని వేతనం
గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు సకాలంలో పశు వైద్య సేవలు అందిస్తున్న గోపాలమిత్రల పరిస్థితి దయనీయంగా మారింది. పశువైద్యశాలలు అందుబాటులో లేని ప్రాంతాల్లో రైతుల ముంగిట్లో అత్యవసర సేవలు అందిస్తున్నారు. వారికి 10 నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. నిత్యం గ్రామాల్లో తిరుగుతూ క్షేత్రస్థాయిలో పాడి రైతులకు సేవలు అందించడంతో పాటు ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో సైతం గోపాలమిత్రలు భాగస్వాములవుతున్నారు. కానీ వీరి గోడును ఎవరూ వినడం లేదు.
(ఆంధ్రజ్యోతి-కొండమల్లేపల్లి)
అధికపాల దిగుబడిని ఇచ్చే ముర్రా జాతి గేదెలు, జెర్సీ, పుంగనూరు, ఒంగోలు గిత్తల సంతతి పెంపుకోసం కృత్రిమ గర్భాధారణ చికిత్సలు అందించడంలో గోపాలమిత్రలు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఏ గ్రామంలోనైనా గేదెలు, పశువులు కానీ ఎదకు వచ్చినప్పుడు ఆ రైతులు గోపాలమిత్రలకు ఫోనచేస్తే ఇంటికి వెళ్లి కృత్రిమ గర్భధారణ ద్వారా మేలు రకమైన జాతి సంతానం కలిగేలా చేయడం గోపాలమిత్ర నియామక ఉద్దేశం. గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ రైతులను చైతన్యవంతులను చేసి పశువుల సంతతిని పెంచడానికి సహకారం అందిస్తారు. వ్యాక్సినేషన, డీవార్మింగ్ వంటి కార్యక్రమాల్లో గోపాలమిత్రల సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రతి నెలా దాదాపు 100 నుంచి 120 పశువులకు కృత్రిమ గర్భాధారణకు చికిత్స చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మేకలు, గొర్రెలకు కూడా ప్రాథమిక వైద్యం అందిస్తుంటారు. అలాగే పశువులకు టీకాలు, నట్టలు, గాలి కుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయడంలో గోపాలమిత్రులు కీలకంగా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం ఒక్కొక్కరికీ గౌరవ వేతనంగా రూ.11,000 చెల్లిస్తున్నారు.
లక్ష్యాన్ని చేరుకోకుంటే..
పశువుల సంఖ్య మేరకు గోపాలమిత్రలకు కృత్రిమ గర్భధారణ చికిత్సను నెలకు 100 నుంచి 120 వరకు చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలు కావడంతో పాడి రైతులు సహజ గర్భధారణకు ప్రాధాన్యమిస్తుంటారు. దీంతో కొంతమంది గోపాల మిత్రలు లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. ఇవే కారణంగా చూపుతూ అధికారులు అంతంతమాత్రంగా ఉన్న గోపాలమిత్రుల వేతనాల్లో కోతలు విధిస్తున్నారు. వచ్చే కొద్దిపాటి వేతనంతో ఎలా బతకాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 10 నెలల వేతనాలు చెల్లించకపోవడంతో అప్పులు చేసి కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.
అప్పు చేసి కుటుంబ పోషణ
మాకు 10 నెలలుగా జీతం రాలేదు. దీంతో కుటుంబపోషణ భారంగా మారింది. అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా బకాయి వేతనాలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలి.
పంది వెంకటయ్య, గోపాలమిత్ర చింతకుంట్ల