టీపీసీసీలోకి మనవారెందరో?
ABN , Publish Date - May 20 , 2025 | 02:21 AM
కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై అధిష్ఠానం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా రు.
త్వరలో నూతన కమిటీ ఏర్పాటుకు అధిష్ఠానం కసరత్తు
వారంలో పార్టీ పదవులపై కీలక నిర్ణయం
జిల్లాల వారీగా నేతల జాబితా సిద్ధం
పాత కమిటీలో ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యం
నూతన కార్యవర్గంలో ఎంతమందికి ఛాన్స్ దక్కేనో?
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై అధిష్ఠానం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా రు. ఎన్నికల అనంతరం సీఎంగా ప్రభుత్వ బాధ్యతల్లో ఆయన బిజీగా ఉండటంతో ఏఐసీసీ అధిష్ఠానం టీపీసీసీ అధ్యక్షుడిగా మహే్‌షకుమార్‌గౌడ్‌ను నియమించింది. అయితే ఏడాది కాలంగా పార్టీ కార్యవర్గం, అనుబంధ కమిటీలను మాత్రం నియమించలేదు. దీంతో టీపీసీసీ పదవుల కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కమిటీలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికి స్థానం దక్కుతుందోననే చర్చ జోరుగా సాగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నా, ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలన్నా పార్టీ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యం లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (టీపీసీసీ) నూతన కార్యవర్గం ఏర్పాటుపై అధిష్ఠానం దృష్టిసారించింది. నూతన కమిటీ నియామకంపై ఏఐసీసీ కసరత్తు ప్రారంభించింది. గతంలో ఎన్నికల సమయం కావడంతో టీపీసీసీకి జంబో కార్యవర్గా న్ని నియమించింది. అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌తోపాటు టీపీసీసీ ఉపాధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శులుగా, కార్యదర్శులుగా, సభ్యులుగా పలువురు సీనియర్ నేతలకు అధిష్ఠానం అవకాశం కల్పించింది. ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయి నూతన కమిటీని ఎన్నుకునేందుకు అధిష్ఠానం ప్రక్రియను ప్రారంభించింది. జిల్లాల వారీగా ఎవరెవరికి పార్టీ పదవులు కట్టబెట్టాలనే అంశంపై టీపీసీసీలో తీవ్ర చర్చ సాగుతోంది. ఏఐసీసీ నేతలతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి జయంతి నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్, ఇతర సీనియర్ నేతలు నూతన కమిటీపై కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే ఏర్పడనున్న కమిటీలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పదవులు ఎవరికి దక్కుతాయోనని సీనియర్ నేతలంతా ఎదురుచూస్తున్నారు.
పాతవారికి పదవులు దక్కేనా?
టీపీసీసీ అధ్యక్షుడిగా ఎ.రేవంత్‌రెడ్డి ఉన్న సమయంలో జంబో కార్యవర్గం ఏర్పడింది. అయితే ఈ సారి నూతన కమిటీని ఎన్నుకునే విషయంలో అధిష్ఠానం అన్ని సమీకరణలను పరిగణనలోనికి తీసుకుంటోంది. ప్రధానంగా పార్టీలోని సీనియర్ నేతలకు పదవులు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. శాసనసభ ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లాలోని పార్టీలోని సీనియర్ నేతలైన భువనగిరి మాజీ ఎంపీ, ప్రస్తుత మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించింది. అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ప్రస్తుత ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బండ్రు శోభారాణి, కొండేటి మల్లయ్య, పటేల్ రమే్‌షరెడ్డిని నియమించింది. ప్రధాన కార్యదర్శులుగా ప్రస్తుత ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, పోత్నక్ ప్రమోద్‌కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధిగా, మీడియా ఇన్‌చార్జీగా బోరెడ్డి అయోధ్యరెడ్డి, కార్యదర్శిగా ఉపేందర్‌రెడ్డి, సభ్యులుగా తంగెళ్లపల్లి రవికుమార్, తదితరులను నియమించింది. ఎస్సీ విభాగం బాధ్యతలు ప్రీతంకు అప్పగించింది. గత టీపీసీసీ కార్యవర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్ నేతలకు కీలక పదవులు దక్కాయి. అందులో కొత్తగా ఏర్పడే కమిటీలో ఎంతమందికి స్థానం దక్కుతుందోనని పార్టీలో చర్చ సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఎన్నికలలోపు పార్టీ పదవుల అప్పగింత పూర్తిచేసి, నూతన కార్యవర్గానికి సర్పంచ్‌లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, చైర్మన్లు ఇతర పదవులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించనుంది. మరోవైపు పార్టీ పదవుల కోసం స్థానిక నేతలు అధిష్ఠానం పెద్దలతో సంప్రదింపులు చేస్తున్నారు. ఎలాగైనా ఈ సారి కీలక బాధ్యతలు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ప్రజాప్రతినిధులకు పార్టీ పదవులు కష్టమే?
టీపీసీసీ కార్యవర్గంలో ఉన్న చాలా మంది ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్నారు. అయితే పదవులు ఉన్న వారికి నూతన కమిటీలో అవకాశం ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై పార్టీలో చర్చ సాగుతోంది. ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారికి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పదవులు ఇవ్వకూడదనే నిబంధనను తీసుకురావాలని పార్టీ యోచిస్తోంది. ఒకవేళ పార్టీ పదవి ఇవ్వాల్సి వస్తే నామినేటెడ్ పదవులకు రాజీనామా చేయాలని కోరే అవకాశం కూడా ఉందని పార్టీలోని సీనియర్ నేతలు చెబుతున్నారు. అయితే గత టీపీసీసీలో కీలక బాధ్యతలు నిర్వహించిన బండ్రు శోభారాణి, పటేల్ రమే్‌షరెడ్డి, బోరెడ్డి అయోధ్యరెడ్డి, ప్రీతం, తదితరులు నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతుండగా, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన వారు ఎమ్మెల్యేలు, ఎంపీగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఈ సారి టీపీసీసీ కార్యవర్గంలో వారిని మినహాయించి సీనియర్ నేతలకు మాత్రమే అవకాశం కల్పించేందుకు అధిష్ఠానం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. మరి ఈ పందేరంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికి పదవులు దక్కుతాయో చూడాల్సిందే.