Share News

మా గోడు వినేదెవరు?

ABN , Publish Date - Aug 13 , 2025 | 12:39 AM

దేశంలోనే అత్యుత్తమ వైద్య విద్య సంస్థగానే కాకుండా ఢిల్లీలోని ఎయిమ్స్‌ తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న బీబీనగర్‌లోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)కు భూములు ఇచ్చిన రైతులు మాత్రం జీవనాఽధారం కోల్పోయి నిర్వాసితులయ్యారు.

మా గోడు వినేదెవరు?

20 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎయిమ్స్‌ భూ నిర్వాసితులు

2005లో నిమ్స్‌ ఏర్పాటుకోసం బీబీనగర్‌ రంగాపూర్‌లో భూములు సేకరించిన నాటి ప్రభుత్వం

పరిహారం చెల్లించకుండానే నిమ్స్‌కు భూముల అప్పగింత

టైటిల్‌ వివాదంతో పరిహారం సొమ్ము కోర్టులో జమ

2018లో నిమ్స్‌ భూములు కేంద్రానికి అప్పగించడంతో ఎయిమ్స్‌గా మార్పు

(ఆంధ్రజ్యోతి-బీబీనగర్‌): దేశంలోనే అత్యుత్తమ వైద్య విద్య సంస్థగానే కాకుండా ఢిల్లీలోని ఎయిమ్స్‌ తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న బీబీనగర్‌లోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)కు భూములు ఇచ్చిన రైతులు మాత్రం జీవనాఽధారం కోల్పోయి నిర్వాసితులయ్యారు.రెండు దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ భూపరిహారం చేతికందక ఆదరువు పోగొట్టుకుని రోడ్డునపడ్డారు. తమ భూ ముల్లో వెలసిన ఎయిమ్స్‌లాంటి ప్రతిష్టాత్మక సంస్థ రాకతో ఓ పక్కన బీబీనగర్‌ పట్టణ రూపు రేఖలు మారిపోతుండగా.., అందులో భూ ములు పోగొట్టుకున్న రైతు కుటుంబాలు దినసరి కూలీగా బతుకులు వెళ్లదీస్తున్నారు. తమ బాధలు ఎవరికి చెప్పుకున్నా పట్టించుకున్న నాఽథుడు లేక ఎవరికీ పట్టని అనాథల్లా మిగిలిపోయారు.

బీబీనగర్‌ మండల కేంద్రంలో ని రంగాపూర్‌ పరిధిలో నెలకొల్పి వైద్య విద్యతోపాటు వైద్య సేవలు అందిస్తున్న అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) 2018 కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్‌)గా ఓపీ సేవలు కొనసాగే వి. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాని కి ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్‌ను మంజూరు చేసింది. ఎక్కడ నెలకొల్పాలో ప్రతిపాదనలు పంపమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. దీంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే బీబీనగర్‌ రంగాపూర్‌ లో ఓపీ సేవలు కొనసాగుతున్న నిమ్స్‌ భవనాలను సేకరించిన 161 ఎకరాల భూములను ఎయిమ్స్‌కు ఏర్పాటు అనుకూలంగా ఉందని, అక్కడే నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అంతేకాకుండా కేంద్రం నిపుణుల కమిటీ నిమ్స్‌ సముదాయాలను ఇక్క డి భూములను పరిశీలించి ఎయిమ్స్‌కు అన్నివిధాల అనుకూలంగా ఉందని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అం దించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలుపుతూ నిమ్స్‌ కోసం సేకరించిన 161 ఎకరాలకు తోడు అదనంగా మరో 50 ఎకరాలు సేకరించి ఇవ్వాలని కోరింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సమీపంలోని కొండమడుగు రెవెన్యూ పరిధిలో 50 ఎకరాల పట్టా భూములు సేకరిం చి మొత్తం 201 ఎకరాల భూములతోపాటు నిమ్స్‌ భవ న సముదాయాలకు రాష్ట్ర ప్రభుత్వం 2018లో కేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది. దాంతో కేంద్ర ఆరోగ్య సంస్థ ఆధీనంలోకి వెళ్లిన నిమ్స్‌ సముదాయం ఎయిమ్స్‌గా పేరు మార్చుకుంది. 2020 జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య విద్యా తరగతులను ప్రారంభించింది.

నిమ్స్‌ పేరిట భూములు సేకరణ

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) విస్తరణలో 2005 ఏప్రిల్‌లో అప్పటి కేంద్ర ప్రభుత్వం రూ.100కోట్లు మంజూరు చేసింది. అయితే విస్తరణకు నిమ్స్‌ సముదాయం అనుకూలంగా లేకపోవడంతో మరోచోట నిమ్స్‌ను విస్తరించాలని నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. హైదరాబాద్‌ చేరువలో అప్పటి ఉమ్మడి బీబీనగర్‌లో నిమ్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం బీబీనగర్‌ మండలకేంద్రంలోని రంగాపూర్‌ రెవెన్యూ పరిధిలో జాతీయ రహదారి పక్కన భూదాన భూములు నిమ్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపింది. దాంతో భూసేకరణకు ఆదేశాలిస్తూ ఉత్తర్వుల నెం.560 హెచ్‌. ఎంఎ్‌సపై ఈ టూ మెమో 22354/ఈ టూ/2003-13, 25 అక్టోబరు 2005న ఉత్తర్వులు వెలువరించింది. నాటి కలెక్టర్‌ ముక్తేశ్వర్‌రావు పర్యవేక్షణలో అప్పటికే సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న రంగాపూర్‌ గ్రామానికి చెందిన రైతుల నుంచి భూసేకరణ చేపట్టింది. సర్వే నెం.8, 68, 69, 72, 73, 74, 76, 77, 78, 79, 80, 85లో మొత్తం 161 ఎకరాలు సేకరించింది. ఇందులో 145 ఎకరాలు భూదాన పట్టా భూములతో పాటు ఖరీజ్‌ ఖాతా (రైతులు ఆక్రమించి సాగు చేసుకుంటున్న భూదాన భూములు) 15.11 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఇందులో 2010లో హైవే హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారి విస్తరణలో 6.25 ఎకరాలు పోయింది.

పరిహారం ఇవ్వకుండానే నిమ్స్‌కు భూములు అప్పగింత

నిమ్స్‌ కోసం రంగాపూర్‌ రైతుల నుంచి సేకరించిన భూదాన పట్టా భూములను పరిహారం అందించకుండానే నిమ్స్‌కు అప్పగించారు. 2005, డిసెంబరు 15న అప్పటి భువనగిరి ఆర్డీవో కిష్టప్ప, తహసీల్దార్‌ భూపాల్‌రెడ్డి నాటి నిమ్స్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌ రావు, డిప్యూటీ డైరెక్టర్‌ కేటీరెడ్డిలకు లాంఛనంగా భూములు అప్పగించారు.

పరిహారం కోసం 20 ఏళ్లుగా...

బీబీనగర్‌లోని రంగాపూర్‌ గ్రామ రెవెన్యూ పరిధిలో 2005లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్‌ ఏర్పాటుకు 161 ఎకరాలు సేకరించింది. 20 ఏళ్లు గడుస్తున్నా, నేటికీ నిర్వాసితులకు పరిహారం అందలేదు. ఇవ్వాలో రేపో చేతికి అందకపోతుందా.. బతుకులు మారకపోతాయా? అని రెండు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. ఏడాదికి రెండు పంటలు పండించుకుని వచ్చే ఆదాయంతో కుటుంబాలు పోషించుకునే వారు. పైగా 10 మందికి పని కల్పించి ఉపాధి ఇచ్చే వారు. భూములు ఇచ్చిన పాపానికి జీవనోపాధి కోల్పోయి దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు.

టైటిల్‌ వివాదంతో కోర్టులో పరిహారం సొమ్ము జమ

నిమ్స్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన భూములపై రైతులు.. నార్నే ఎస్టేట్‌ (ఈస్ట్‌సిటీ) రియల్‌ ఎస్టేట్‌ సంస్థ మధ్య టైటిల్‌ వివాదం కోర్టుకు చేరింది. దీంతో అప్పటి ప్రభుత్వం ఎకరాకు రూ.1.60లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు అంగీకరించి పరిహారం సొమ్ము రూ.3,56,36,398 భూ పరిహారం డబ్బులను సివిల్‌ కోర్టులో జమ చేసింది. భూములు సేకరించడానికి ముందు ఇక్కడి రైతులు తమ సంస్థకు భూములు విక్రయిస్తూ ఒప్పందాలు కుదుర్చుకున్నారని నార్నే సంస్థ వాదిస్తూ పరిహారం తమకే చెందాలని కోర్టును ఆశ్రయించింది. కాగా రైతుల వాదన మరోలా ఉంది. నిమ్స్‌ కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తున్న భూముల్లో తమతోపాటు నార్నే సంస్థ అప్పటికే వెంచర్లు కొట్టి విక్రయించిన ప్లాట్లు కూడా అందులో ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ఇది తెలిసి నార్నే ఎస్టేట్‌ అధినేత స్థానికంగా ఉన్న మధ్యవర్తుల ద్వారా కొంత మంది రైతులను తమ కార్యాలయానికి పిలిపించుకుని ప్రభుత్వానికి భూములు ఇస్తే పరిహారం ఇవ్వదని అదే తమ సంస్థకు భూములు అప్పగిస్తే ఎక్కువ పరిహారం వచ్చేలా ప్రభుత్వంతో కొట్లాడుతామని నమ్మబలికి అడ్వాన్స్‌గా కొంత డబ్బు ముట్టచెప్పి తమ నుంచి పాస్‌ పుస్తకాలు తీసుకుని కొన్ని పేపర్లపై సంతకాలు తీసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. భూములు లేని నిరుపేదలైన తమకు భూదాన ఎక్నా బోర్డు భూములు పంపిణీ చేసిందని, వాటి క్రయ, విక్రయాలకు ప్రభుత్వ నిబంధనలు ఒప్పుకోవు. అలాంటప్పుడు నార్నే సంస్థ భూములు ఎలా కొంటుందని భూదాన ఎక్నా బోర్డు సంస్థ ప్రశ్నిస్తుంది. పరిహారం రైతు కుటుంబాలకే చెందాలని వాదిస్తుంది.

కోర్టులో కొట్లాడే స్తోమత లేదు : కావలి మైసమ్మ, భూనిర్వాసితులు, రంగాపూర్‌

అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన భూములపై నార్నే ఎస్టేట్‌ అధినేత, మా మధ్య టైటిల్‌ వివాదం కోర్టుకు చేరింది. ఆ సంస్థతో పోటీపడి కోర్టులో వాదించే ఆర్థిక స్థోమత మాకు లేదు. ప్రభుత్వమే మాపై ప్రత్యేక దృష్టి సారించి, పరిహారం అందేవిధంగా చొరవ తీసుకోవాలి. ఇప్పటికే జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డాం.

ఎయిమ్స్‌ భవనాలు మాభూముల్లోనే కట్టారు: దాసరి వెంకటేశ్‌, భూనిర్వాసితుడు, రంగాపూర్‌

ఎయిమ్స్‌ భవనాలు కట్టిన భూములు మావే. రోజు చూస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏడాదికి రెండు పంటలు పండించుకుని ఆనందంగా బతికేవాళ్లం. భూములు పోయి చేసుకోవడానికి పనులు లేక ఇబ్బందులు పడుతున్నాం. నార్నే సంస్థ కోర్టులో కేసులు వేయడంతో 20ఏళ్లనుంచి పరిహారం అందకుండా పోయింది. వస్తుందన్న ఆశ కూడా పోతుంది.

కిరాణం కొట్టే మాకు ఆధారం: దాసరి లక్ష్మయ్య, భూనిర్వాసితుడు, రంగాపూర్‌

కోర్టుల విలువ చేసే భూములు ఎయిమ్స్‌లో పోయి ఏమి లేని వాళ్లమయ్యాం. గుంట భూమి కూడా మిగలలేదు. అదరువు పోవడంతో చిన్న కిరాణం కొట్టు పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. కోర్టులో బలమైన వాదనాలు వినిపించే స్థోమత మాకు లేకుండా పోయింది. పరిహారం వస్తేనైనా మాకు ఆదరువుగా ఉంటుంది. ప్రభుత్వం మా బాధలు పట్టించుకోవాలి.

ఎంపీ, ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలి : :పిట్టల అశోక్‌, బీఆర్‌ఎస్‌ నేత, బీబీనగర్‌

రంగాపూర్‌ భూ నిర్వాసితులకు ఎంపీ, ఎమ్మెల్యే అండగా నిలవాలి. నార్నే ఎస్టేట్‌లాంటి సంస్థతో కోర్టులో కొట్లాడే స్తోమత ఇక్కడి రైతులకు లేదు. రైతులపక్షాన ప్రభుత్వమే కోర్టులో వాదనలు వినిపించి రైతులకు నష్టపరిహారం అందేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలి.

Updated Date - Aug 13 , 2025 | 12:39 AM