ఇసుక నిల్వలు తరలేది ఎక్కడికి?
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:37 AM
మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుకకు అనుమతులు తీసుకుని ఇసుక రావాణ చేసే ట్రాక్టర్ల యజమానులు ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
పాటిమట్లలో ఇసుక అక్రమ దందా
మోత్కూరు, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుకకు అనుమతులు తీసుకుని ఇసుక రావాణ చేసే ట్రాక్టర్ల యజమానులు ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అవసరమని తహసీల్దార్ నుంచి అనుమతి తీసుకుని ట్రాక్టర్ల యజమానులు సదర్శాపురం బిక్కేరు వాగు నుంచి ఇసుక తీసుకువచ్చి రహస్య ప్రదేశాల్లో కుప్పలు పోసి రాత్రి వేళ లారీలకు ఎత్తి విక్రయిస్తున్నారని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు ఇసుక తరలించాల్సి ఉండగా తహసీల్దార్ అనుమతి ఇచ్చిన ట్రిప్పులకు మించి ఇసుక ట్రిప్పులు ఇతర సమయాల్లోనూ బిక్కేరు వాగు నుంచి తరలిస్తున్నారని అంటున్నారు. పాటిమట్ల కొత్తకాలనీ సమీపంలో అక్రమంగా పోసిన ఇసుక రాశులను గుర్తించి, తహసీల్దార్ దృష్టికి తీసుకు వెళ్లామని కొందరు గ్రామస్థులు తెలిపారు. ఆ ఇసుకను రాత్రికి లారీలకు ఎత్తి తరలిస్తాని గ్రామస్థులు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని పాటిమట్ల సదర్శాపురం గ్రామాల ప్రజలు కోరుతున్నారు.