సర్వే పైసలు ఎప్పుడిస్తారు?
ABN , Publish Date - May 07 , 2025 | 12:20 AM
జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు రెమ్యునరేషన్ చెల్లించక పోవడంతో ఆందోళనబాట పడుతున్నారు. రాష్ట్ర ప్రభు త్వం గత ఏడాది నవంబరు 6 నుంచి 18వ తేదీ వరకు సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించింది.
జిల్లాలో 9వేల మందికి పైగా ఎదురుచూపు
దశల వారీగా ఆందోళనకు సిద్ధమవుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు
(ఆంధ్రజ్యోతి, నల్లగొండ): జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు రెమ్యునరేషన్ చెల్లించక పోవడంతో ఆందోళనబాట పడుతున్నారు. రాష్ట్ర ప్రభు త్వం గత ఏడాది నవంబరు 6 నుంచి 18వ తేదీ వరకు సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో సుమారు 9వేల మం ది సర్వేలో పాల్గొనగా, నేటికీ రెమ్యునరేషన్ విడుదలచేయలేదు.
సమగ్ర కుటుంబ సర్వే ను నిర్వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయులు రెమ్యునరేషన్ కోసం ఎదురుచూసి ఈ ఏడాది మార్చి 18న నిరసన తెలిపారు. తిరిగి ఈ నెల 5న కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన సర్వేను కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా కులగణనకు ఆమోదం తెలిపింది. అయితే దేశానికే ఆదర్శంగా నిలిచిన కుటుంబ సర్వేను నిర్వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు, సిబ్బందికి ఇప్పటి వరకు రెమ్యునరేషన్ చెల్లించకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. సుమారు ఆరు నెలలు దాటినా చెల్లింపుల విషయంలో ప్రభుత్వం తాత్సరం చేస్తుండటంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సర్వే నిర్వహించిన సూర్యాపేట, యాదాద్రి జిల్లాల సిబ్బందికి రెమ్యునరేషన్‌ను చెల్లింపులు పూర్తయ్యాయి. చిన్న జిల్లాల్లో చెల్లింపులను పూర్తి చేసిన ప్రభుత్వం రాష్ట్రంలోనే అధిక మండలాలు ఉన్న నల్లగొండ జిల్లాలో మాత్రం నేటికీ వాటిని చెల్లించలేదు. పెద్ద జిల్లా కావడంతో రెమ్యునరేషన్ అధికంగా ఉండటంతోనే ఆలస్యం చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది.
శ్రమకోర్చి విధులు నిర్వహించినా
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులతో పాటు ఉద్యోగుల కు సర్వే బాధ్యతలు అప్పగించింది. వారు ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించారు. తొలుత ప్రతీ ఇంటికి స్టిక్కరింగ్ చేసి ఆ తరువాత ప్రభుత్వం ఇచ్చిన నిర్దేశిత ఫాంలో వివరాలను నింపారు. సర్వేలో పలు ప్రశ్నలతో కూడి ఉండటంతో ఒక్కో కుటుంబ సర్వేకు గంటన్నర కు పైగా సమయం పట్టిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఆయా కుటుంబ సభ్యులు లేకపోతే తిరిగి ఆ ఇంటికి వెళ్లి మరోసారి వివరాలు నమోదు చేశారు. సా మాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులానికి సం బంధించిన వివరాలను ఎన్యూమరేటర్లు నమోదు చేశా రు. సర్వే కోసం శ్రమకోర్చి విధులు నిర్వహించామని, అయినా ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడమేంటని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఇతర జిల్లాలలో సర్వే నిర్వహించిన సిబ్బందికి చెల్లింపులు చేసి జిల్లాలో మాత్రం నిలిపివేయడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మహిళా ఉపాధ్యాయినులు ఈ సర్వేలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్ర మకోర్చి సర్వే నిర్వహించినా చెల్లింపులు చేయకపోడం తో ఉపాధాయినులు అసంతృప్తిగా ఉన్నారు. అయితే బిల్లులు చేసి ప్రభుత్వానికి జిల్లా ఉన్నతాధికారులకు పలుమార్లు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. అయినా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో రెమ్యూనరేషన్ ఎప్పుడువస్తుందో,అసలు వస్తుం దో రాదోననే సందేహాన్ని ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు.
ఎన్యూమరేటర్‌కు రూ.10వేలు, సూపర్‌వైజర్‌కు రూ.12వేలు...
సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్ల కు రూ.10వేలు, సూపర్‌వైజర్లకు రూ.12వేల చొప్పున చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించి అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో సుమారు 9వేలకు మందికి పైగా ఈ రెమ్యూనరేషన్‌ను చెల్లించాల్సి ఉంది. సర్వే పూర్తి చేసిన అనంతరం కొద్ది రోజుల్లోనే ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉన్నా, ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు తీసుకోలేదు. దీంతో ఉపాధ్యాయు లు, ఉద్యోగులు ఇప్పటికే రెండు దఫాలుగా ఆందోళనలు నిర్వహించారు. వారం రోజుల్లో రెమ్యూనరేషన్ చెల్లించకపోతే ప్రత్యేక కార్యాచరణకు దిగుతామని ఇప్పటికే టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ హెచ్చరించింది. వారం రోజుల తరువాత దశల వారీగా ఆందోళన కార్యక్రమాలతో పాటు ప్రత్యక్ష కార్యచరణ కూడా చేపడతామని ఉద్యోగులు, ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. కావాలనే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. చేసిన..
(5వపేజీ తరువాయి)
కష్టానికి ప్రతిఫలం ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వేను ప్రభుత్వం చెప్పిన సమయంలోనే జిల్లాలో సకాలంలో పూర్తిచేశామని, అలాంటప్పుడు రెమ్యూనరేషన్‌ను ఎందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల తర్వాత సర్వే రెమ్యూనరేషన్ కోసం ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆందోళనను తీవ్రతరం చేసే అవకాశం ఉంది.
వారం తరువాత ప్రత్యక్ష కార్యాచరణ
సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి ప్రభుత్వం వెంటనే రెమ్యూనరేషన్‌ను చెల్లించాలి. లేదంటే వారం తరువాత ప్రత్యక్ష కార్యచరణకు దిగుతాం. కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాలను చేపడుతాం. రెమ్యూనరేషన్ కోసం గత మార్చి 18న, ఈనెల 5వ తేదీన ఉన్నతాధికారులకు వినతిపత్రాలను అందజేశాం. విషయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వానికి నివేదిక పంపించి త్వరితగతిన రెమ్యూనరేషన్ చెల్లించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ వారం రోజుల్లో ప్రభుత్వం రెమ్యూనరేషన్ ఇవ్వకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతాం.
- పెరుమాళ్ల వెంకటేశం, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి