మాస్టర్ ప్లాన అమలెప్పుడు?
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:10 AM
నల్లగొండ జిల్లా కనగల్ మండలం దర్వేశిపురం స్టేజీ వద్ద ఉన్న శ్రీరేణుకా ఎల్లమ్మదేవి ఆలయం మాస్టర్ ప్లాన కాగితాలకే పరిమితమైంది.
(ఆంధ్రజ్యోతి-కనగల్)
నల్లగొండ జిల్లా కనగల్ మండలం దర్వేశిపురం స్టేజీ వద్ద ఉన్న శ్రీరేణుకా ఎల్లమ్మదేవి ఆలయం మాస్టర్ ప్లాన కాగితాలకే పరిమితమైంది. మూడున్నర దశాబ్దాల కిందట స్వయంభువుగా పుట్టలో వెలిసిన ఎల్లమ్మదేవత భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. జిల్లాలోని గ్రామ దేవతా ఆలయాల్లో ప్రథమస్థానంలో, ప్రధానఆలయాల్లో నాల్గో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం దేవాదాయశాఖ పరిధిలో 6(ఏ) జాబితాలో నమోదై ఉంది. వివిధప్రాంతాల నుంచి నిత్యం పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. పండుగలు జరిపి అమ్మవారికి ముడుపులు కడుతారు. బోనాలు సమర్పించి మొక్కు చెల్లిస్తారు. భక్తులు అందించే కానుకలతో పాటు ఆల యం వద్ద నిర్వహించే టెండర్ల ద్వారా ప్రతిఏటా రూ.3కోట్ల వరకు వార్షిక ఆదాయం సమకూరుతోంది.
వసతుల లేమి
దర్వేశిపురంలోని ఎల్లమ్మ ఆలయానికి ఆదాయం ఉన్నా అందుకు అనుగుణంగా భక్తులకు వసతులు లేవు. రెండున్నర దశాబ్దాల క్రితం నిర్మించిన ఆల యం పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా విస్తరించలేదు. ఆలయంలోపల స్థలం ఇరుకుగా ఉండి భక్తుల పూజలకు సరిపోవటం లేదు. అమ్మవారి ఆలయాన్ని విస్తరించాలని కొన్నాళ్లుగా భక్తులు డిమాండ్ చేస్తున్నారు. నల్లగొండ-దేవరకొండ ప్రధాన రహదారిని ఈ ఆలయం ఆనుకుని ఉండగా ముఖ్యమైన రోజులు, జాతర, పండగల సందర్భాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తటం పరిపాటిగా మారింది. అధికారుల పర్యవేక్షణ కొరవడి ఆలయం వద్ద వ్యాపారులు తమ దుకాణాలు రోడ్డుపైనా ఏర్పాటు చేసుకోవటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తులకు సౌకర్యార్దం విశ్రాంతి గదులు, సత్రాలు, మెరుగైన తాగునీటి సరఫరా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకున్న సందర్భంలో గుడి విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అధికారులు రూ.4.5 కోట్లతో మాస్టర్‌ప్లాన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి ఏడాదికాలం దాటింది. అయితే ఇందుకు సంబంధించి నిధులు విడుదల కాకపోవటంతో మాస్టర్ ప్లాన అమలు కాగితాలకే పరిమితమైంది. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆలయాన్ని విస్తరించడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
మంత్రి వెంకట్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం
మాస్టర్ ప్లాన అమలు, గుడి అభివృద్ధి విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం. గత ఏడాది నుంచి ఆలయం వద్ద భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నాం. ట్రాఫిక్, పారిశుధ్యం, తాగునీటి సరఫరాను మెరుగుపరిచాం. అమ్మవారి భక్తులకు తగు వసతుల కల్పనకు కృషి చేస్తున్నాం.
- చీదేటి వెంకట్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన
భక్తులకు వసతులు కల్పించాలి
అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయం వద్ద సరైన వసతులను కల్పించాలి. తాగునీటి సరఫరా, పారిశుధ్య ఏర్పాట్లను సక్రమంగా నిర్వహించాలి. మహిళా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ఆలయ పునర్‌విస్తరణ చేపట్టాలి.
- విజయలక్ష్మి, భక్తురాలు