Share News

భూములు లేనప్పుడు ఇక ఊరెందుకు?

ABN , Publish Date - Jul 24 , 2025 | 01:01 AM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.575.75 కోట్ల అంచనాతో 1.41టీఎంసీల సామర్థ్యం తో చేపడుతున్న గంధమల్ల రిజర్వాయర్‌లో త మ వ్యవసాయ భూములన్నీ ముంపునకు గురవుతున్నాయి. చేసుకోవడానికి గుంట భూమి కూడా గ్రామంలో ఎవరికీ మిగలడంలేదు.

భూములు లేనప్పుడు ఇక ఊరెందుకు?

రిజర్వాయర్‌లో భూములు పోయే..

త్రిపుల్‌ఆర్‌ ప్యాకేజీ కింద పునరావాసం కల్పించాలి

భూములు లేనప్పుడు గ్రామంలో ఉండి ఏం చేస్తామంటున్న బీమరిగూడెం గ్రామస్థుల ఆవేదన

(ఆంధ్రజ్యోతి,తుర్కపల్లి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.575.75 కోట్ల అంచనాతో 1.41టీఎంసీల సామర్థ్యం తో చేపడుతున్న గంధమల్ల రిజర్వాయర్‌లో త మ వ్యవసాయ భూములన్నీ ముంపునకు గురవుతున్నాయి. చేసుకోవడానికి గుంట భూమి కూడా గ్రామంలో ఎవరికీ మిగలడంలేదు. ఇక భూములే లేనప్పుడు గ్రామంలో ఉండి ఏం చేస్తామంటున్నారు. ఒకవేళ కొద్దో.. గొప్పో భూమి ఉన్నా ఆభూమితో తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు ఆ ఊరి భూ నిర్వాసితులు. తమ గ్రామాన్ని కూడా రిజర్వాయర్‌లో కలుపుకొని ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద పునరావాసం కల్పించాలని డిమాండ్‌చేస్తున్నారు.

తుర్కపల్లి మండలం గంధమల్ల పంచాయతీ పరిధిలో ఉన్న చిన్న గ్రామం బీమరిగూడెం. గ్రామం, రైతులు, వ్యవసాయ భూములు గంధమల్ల గ్రామాని కి దూరంగా ఉండడంతో తాతముత్తాతల కాలంలోనే వ్యవసాయ బావుల వద్ద ఇళ్లు కట్టుకున్నారు. ఈ గ్రా మంలో 50-60కుటుంబాలు వరకు నివసిస్తున్నాయి. వీరికి సుమారు వంద ఎకరాలకుపైగా వ్యవసాయ భూములున్నాయి. అంతేకాకుండా గ్రామానికి రవాణా సదుపాయం కూడా సరిగాలేదు. గ్రామంలో ఉన్న పాఠశాల కూడా రెండేళ్ల క్రితమే మూతపడింది. వీరికి ప్రధాన జీవనాధారం వ్యవసాయమే. తాత ముత్తాతలకాలం నుంచి ఈ భూములనే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఈ గ్రామ ప్రజల వ్యవసాయ భూ ములన్నీ గంధమల్ల రెవెన్యూ పరిధిలో చెరువుకు ఆనుకొనే ఉంటాయి. ఇటీవలే జిల్లా అధికార యం త్రాంగం ప్రభుత్వం సూచన మేరకు ఎకరాకు రూ.24.50లక్షలు పరిహారం ఇస్తామని అధికారులు పేర్కొనడంతో, ఆ పరిహారం తీసుకునేందుకు గంధమల్ల గ్రామ భూనిర్వాసితులు అంగీకరించి భూములు ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. దీంతో రెవెన్యూ, ఇరిగేషన్‌, సర్వే అధికారులు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి వీలైనంత త్వరగా అవార్డ్‌ను పాస్‌ చేసేందుకు సర్వే పనులను ప్రారంభించారు. ఈసర్వేలో భాగంగా అధికారులు నిర్వహించిన సర్వేలో బీమరిగూడెం గ్రామానికి చెందిన రైతుల భూములు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి. కేవలం గ్రామం మాత్రమే మిగులుతుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి అవకాశాలు లేనప్పుడు గ్రామంలో ఉండి ఏం చేయాలని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ గ్రామం ఉన్నా భవిష్యత్‌లో రిజర్వాయర్‌కు పక్కనే ఉండడంవల్ల ఇళ్లలోకి క్రిమికీటకాలు వచ్చే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తాము ఇళ్లలో ని వాసం ఉండలేమంటున్నారు. రిజర్వాయర్‌ భూసేకరణలో గ్రామాన్ని కూడా తీసుకొని ఆ ర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

తెట్టెకుంటలోనూ అదే పరిస్థితి

గంధమల్ల పంచాయతీ పరిధిలో ఉన్న తెట్టెకుంటలో ఎనిమిది కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ చిన్న గ్రామం ఇటీవల నూతనంగా ఏర్పడి ఇందిరానగర్‌ పంచాయతీ, అటు జగదేవ్‌పూర్‌ మండలానికి సమీపంలో ఉంటుంది. రిజర్వాయర్‌ భూసేకరణలో భాగంగా చేపట్టిన సర్వేలో సాగు భూమి పూర్తిగా పోయిందని, కొంత భూమి మిగిలినా, అది సాగుకు యోగ్యంగా లేదని గ్రామస్థులు అంటున్నారు. తెట్టెగూడెం గ్రామానికి చెందిన ఐదారు కుటుంబాలు గ్రామం నుంచి వెళ్లి జగదేవ్‌పూర్‌ మండలకేంద్రంలో ఇళ్లు కట్టుకొని అక్కడే నివాసం ఉంటూ తమ బావుల దగ్గరకు వచ్చి పోతున్నారు.

గ్రామంలో బతుకుదెరువు లేదు : పిట్టల లక్ష్మణ్‌, భూ నిర్వాసితుడు, బీమరిగూడెం

గంధమల్ల రిజర్వాయర్‌కోసం చేపట్టిన సర్వే ప్రకారం నాకున్న 1.20 ఎకరాల భూమి పోతుంది. దీంతో గ్రామంలో బతుకుదెరువు లేకుండా పోయింది. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామంలో ఉండి ఏం చేసేది లేదు. కాబట్టి గ్రామాన్ని కూడా భూ సేకరణలో కలుపుకొని ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద పునరావాసం కల్పించాలి.

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద పునరావాసం కల్పించాలి : బీమరి వెంకటేశ్‌, బీమరిగూడెం

మేము ఇన్నాళ్లుగా వ్యవసాయ భూములనే నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మా భూములన్నీ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్నాయి. భూములే పోయాక ఊరెందుకు, ఊరిని కూడా రిజర్వాయర్‌లో కలుపుకొని ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ప్రభుత్వం తగిన పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.

Updated Date - Jul 24 , 2025 | 01:01 AM