Share News

చచ్చి ఏం సాధిస్తాం

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:16 AM

జీవితంలో ఆటుపోట్లు సముద్ర కెరటాల్లాంటివి. వచ్చిపోతుంటాయి. ప్రయత్నంతో వాటిని దాటేస్తుండాలి తప్ప వాటికి తలవంచవద్దు. ఇటీవల కాలంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. చిన్న సమస్యలకే ప్రాణాలను బలితీసుకుంటున్నారు.

చచ్చి ఏం సాధిస్తాం

ఆత్మహత్య వద్దు, ఆత్మస్థైర్యమే ముద్దు!

అనాలోచిత క్షణికావేశం, మానసిక వ్యథతో బలవన్మరణాలు

ఒక్క క్షణం గడిస్తే నిలుస్తుంది ప్రాణం

తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్న యువత

జీవితంలో ఆటుపోట్లు సముద్ర కెరటాల్లాంటివి. వచ్చిపోతుంటాయి. ప్రయత్నంతో వాటిని దాటేస్తుండాలి తప్ప వాటికి తలవంచవద్దు. ఇటీవల కాలంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. చిన్న సమస్యలకే ప్రాణాలను బలితీసుకుంటున్నారు. బలవన్మరణాలతో బాధిత కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఇంటి పెద్దపోతే కుటుంబ సభ్యులు, పెంచిన కుమారుడు పోతే తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం. సమస్యలను ఎదుర్కొనే జీవించాలే తప్ప జీవితాన్ని ఫణంగా పెట్టవద్దని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. చావు ఆలోచనను ఒక్క క్షణం పక్కన పెట్టి ఆలోచిస్తే జీవితం మరోలా ఉంటుందంటున్నారు.

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట క్రైం / నార్కట్‌పల్లి)

ఆత్మహత్యలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఇంటి యజమాని ఆత్మహత్య చేసుకుంటే ఆ లోటు ఆ కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇల్లాలిపై బాధ్యతల భారం పడుతోంది. అదేవిధంగా వారి పిల్లల పెంపకంతో పాటు భవిష్యత్తు అంధకారమవుతోంది. క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడిన యువతతో వారి తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతోంది. వృద్ధాప్యంతో కుమారుడి నీడలో హాయిగా గడుపుదామనుకునే వారి ఆశలు అడియాశలవుతున్నాయి. కుమారులు, కుమార్తె ప్రయోజకులుగా మారి గర్వంగా ఉండాలన్న తల్లిదండ్రులకు తీవ్ర శోకం మిగులుతోంది. ఇలాంటి సంఘటనలు ఇటీవల చోటుచేసుకుంటున్నాయి.

ఆ క్షణం గడిస్తే నిలుస్తుందీ ప్రాణం

ఆత్మహత్మ ఆలోచనను దాటేందుకు శ్రమించాల్సి ఉంటుందని, ఆ క్షణం గడిస్తే ప్రాణం నిలుస్తుందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. తమ సమస్యలను సన్నిహితులతో పంచుకుంటే కొంతమేర ఉపశమనం లభిస్తుంది. ఒక్కోసారి సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది. ఆత్మహత్య చేసుకునే ఆలోచనను విరమించుకుంటారు. దీంతో వారి ప్రాణాలు నిలుస్తాయని, సమస్యలతో బాధపడే వారు చెప్పే వారి మాటలను సన్నిహితులు కాస్త ఓపిగ్గా వినాలని సూచిస్తున్నారు. వారికి సలహాలు ఇవ్వడంతో పాటు భవిష్యతపై ఆశలు పెంచేలే ప్రయత్నంచేయాలి. సమస్యను ఎలా ఎదుర్కొవాలో ధైర్యం చెబితే ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉండే అవకాశం లేకపోలేదు.

మానసిక బలహీనతలతోనే ....

మారిన పరిస్థితుల్లో మానసిక బలహీనతల వల్ల బలవన్మరణాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఇవి రెండు రకాలు కాగా అందులో ప్రణాళిక మేర స్థిర నిర్ణయాలతో చేసుకునేవి. తాత్కాలిక ఆవేశంతో చేసుకునే ఆత్మహత్యలు ఉంటున్నాయి. దీర్ఘకాల నిసృహ, ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారు మొదటి కోవలోకి వస్తుండగా, క్షణికావేశంతో చేసుకునే వారి దారి వేరు. అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం, అహం దెబ్బతిన్నా, పరువు నష్టం కలిగినా, తప్పు చేసినప్పుడు, ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు జరుగుతుంటాయి.

చట్టం ఏం చెబుతోంది

గతంలో ఆత్మహత్య చేసుకోవడాన్ని నేరంగా పరిగణించేది. ఉరివేసుకున్నా, క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినా గతంలో ఐపీసీ సెక్షన 309 కింద పోలీసులు కేసు నమోదు చేసేవారు. కానీ ఆత్మహత్యకు పాల్పడటాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం నేరంగా పరిగణించకూడదని సూచించింది. ఒక మనిషి తన బలహీనతల కారణంగానే బలవన్మరణానికి పాల్పడుతున్నారని వారిపట్ల సానుభూతి చూపించాలని చెప్పింది. దీంతో ఆత్మహత్య ఘటనలపై పోలీసులు కేవలం మరణానికి కారణాలు మాత్రమే పేర్కొంటూ బీఎనఎ్‌స సెక్షన 194 కింద మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారు.

పరివర్తన కోసం సదస్సులు

ఆర్థికపరమైన సమస్యలతో ఇంటిపెద్ద, యువకులైతే బెట్టింగ్‌ యాప్‌ల ప్రభావం, ప్రేమ వైఫల్యం, జాబ్‌ రాలేదన్న నైరాశ్యంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మస్థైర్యంతో నిలిచి గెలవాలే తప్ప ఆత్మహత్యలకు పాల్పడవద్దు. నార్కట్‌పల్లి పరిధిలో ఈ ఏడాది ఏడుగురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కొందరిని డయల్‌-100 కాల్‌తో కాపాడాం. ఇలాంటి వారిలో పరివర్తన కోసం ఎస్‌పీ శరతచంద్రపవార్‌ ఆధ్వర్యంలో జిల్లాలో పలు అవగాహన సదస్సులు కొనసాగుతున్నాయి.

దగ్గుల క్రాంతికుమార్‌, ఎస్‌ఐ నార్కట్‌పల్లి

హిప్నోసి్‌సతో అరికట్టవచ్చు

జీవితం భరించలేనిదిగా అనిపించనపుడు మనసు ప్రమాదకరమైన అబద్ధాలను చెబుతుంది. దారి లేదు, ఎప్పటికీ ఈ బాధ తీరదు, అనే ఆలోచనలు మనిషిని ఆత్మహత్యవైపునకు నెడతాయి. కానీ హిప్నోసిస్‌ ద్వారా ఆత్మహత్యల నుంచి అరికట్టవచ్చు. మనసును రీప్రోగ్రామింగ్‌ చేసే క్లినికల్‌ ప్రక్రియే హిప్నోసిస్‌. మనిషిని ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడేస్తుంది. కొత్త శక్తివంతమైన విశ్వాసాలను, ఆత్మవిశ్వాసాన్ని భావోద్వేగ ప్రశాంతతను కాపాడుతుంది.

చెరుకు శశికిరణ్‌, హిప్నోసిస్‌ కోచ

Updated Date - Sep 10 , 2025 | 12:16 AM