బీబీనగర్ మెట్రో మార్గానికి మోక్షమెన్నడో?
ABN , Publish Date - Jun 24 , 2025 | 12:23 AM
ఉప్పల్, ఓఆర్‌ఆర్, ఘట్కేసర్ మీదుగా బీబీనగర్ వరకు మెట్రో మార్గానికి మోక్షం కలగడం లేదు. ఫేజ్-3 కింద మెట్రో కారిడార్‌ను విస్తరించేందుకు గత ప్రభుత్వం ప్రతిపాదించి ఆమోదించిన బీబీనగర్-ఉప్పల్ మెట్రో కారిడార్‌లో పురోగతి కనిపించడం లేదు.
ఔటర్ చుట్టూ మెట్రో విస్తరణ కు గత ప్రభుత్వం ఆమోదం
ఫేజ్-3 కింద కొత్త మార్గాల్లో ఉప్పల్-బీబీనగర్ కారిడార్
రెండేళ్లుగా అడుగు ముందుకుపడని వైనం
(ఆంధ్రజ్యోతి,బీబీనగర్): ఉప్పల్, ఓఆర్‌ఆర్, ఘట్కేసర్ మీదుగా బీబీనగర్ వరకు మెట్రో మార్గానికి మోక్షం కలగడం లేదు. ఫేజ్-3 కింద మెట్రో కారిడార్‌ను విస్తరించేందుకు గత ప్రభుత్వం ప్రతిపాదించి ఆమోదించిన బీబీనగర్-ఉప్పల్ మెట్రో కారిడార్‌లో పురోగతి కనిపించడం లేదు.
రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌ను ఊపిరాడకుం డా చేస్తున్న ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం కల్పించేందుకు గతప్రభుత్వం ఔటర్‌చుట్టూ మెట్రో రైలు సేవలను విస్తరించాలని సంకల్పించింది. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగురోడ్డుకు అనుసంధానం చేస్తూ మెట్రో రైలు సేవలు అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళిక కు రూపకల్పన చేసింది. ఫేజ్-3 కింద రూ.60వేల కోట్ల తో 278 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని ప్రతిపాదించింది. ఈ మేరకు తొలుత రూ.39,190కోట్లతో 142 కిలోమీటర్ల మేర ఎనిమిది కొత్త మెట్రో మార్గాలు నిర్మించేందుకు 2023 జూలై 31న గత ప్రభుత్వంలోని రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నాలుగేళ్లలో పనులు పూర్తి చేస్తామని నాడు ప్రకటించింది. ఈ ఎనిమిది కొత్త మెట్రో మార్గాల్లో ఉప్పల్, ఓఆర్‌ఆర్, ఘట్కేసర్, బీబీనగర్ మెట్రో కారిడార్ మార్గం ఉంది. దీంతో ప్రజలకు మెరుగైన, వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుందని ఈ ప్రాంత ప్రజలు భావించారు.
రెండేళ్లయినా..
ఉప్పల్-బీబీనగర్ మెట్రో కారిడార్‌ను గత ప్రభుత్వం ఆమోదించి రెండేళ్లు కావొస్తోంది. ప్రభుత్వం మారి ఏడా ది దాటగా, గత ప్రభుత్వం రూపొందించి ఆమోదించిన ఫేజ్-3 మెట్రో కారిడార్ విస్తరణపై కదలిక లేదు. ఈ ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టి కొత్త ప్రతిపాదనలను రూపొందించి ముందుకు వెళ్తోంది. దాంట్లో బీబీనగర్, ఉప్పల్ మెట్రో కారిడార్ ప్రతిపాదన లేకపోవడంతో ఈ ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో ఉప్పల్-బీబీనగర్ మెట్రో మార్గం మరుగున పడినట్లేనా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.
సన్నగిల్లుతున్న ఆశలు
ఉప్పల్-బీబీనగర్ మెట్రో కారిడారిపై జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇది పూర్తయి అందుబాటులోకి వస్తే వేగవంతమైన, సులభతరమైన ప్రయాణ సదుపాయం చేరువవుతుంది. హైదరాబాద్‌లోని ఏ ప్రాంతానికైనా 20 నుంచి 30నిమిషాల్లో చేరుకునే వెసులుబాటు కలుగుతుంది. బీబీనగర్‌లో ఇప్పటికే విశాలమైన రోడ్డు, రైల్వే మార్గాలు అందుబాటులో ఉండగా
దీనికి తోడుగా మెట్రో రైలు చేరువైతే ఈ ప్రాంతం వాణిజ్య, వ్యాపార, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. అంతేగాక పలు రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉప్పల్-బీబీనగర్ మెట్రో కారిడార్ ప్రాధాన్యాన్ని గుర్తించి ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంతోపాటు పనులు ప్రారంభించాలని స్థానికులతోపాటు జిల్లా వాసులు కోరుతున్నారు.
ఉప్పల్-బీబీనగర్ మెట్రో మార్గం చేపట్టాలి : పిట్టల అశోక్, బీబీనగర్
గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన ఉప్పల్, ఓఆర్‌ఆర్, ఘట్కేసర్, బీబీనగర్ మెట్రో కారిడార్‌ను చేపట్టాలి. అందుకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. మెట్రో రైలు మార్గం నిర్మించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. బీబీనగర్ వరకు మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే జిల్లా ప్రజలకు ఎన్నో విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి.