Share News

సంక్షేమం ప్రతిష్ఠాత్మకం

ABN , Publish Date - May 06 , 2025 | 12:16 AM

అధికారులంతా పల్లె బాట పట్టాలి.. క్షేత్రస్థాయికి వెళ్లి సంక్షేమ పథకాలను నిరంతరం పర్యవేక్షించాలి.. పథకాల అమలులో ఏ మాత్రం నిర్లక్ష్యం, అశ్రద్ధ వహించరాదు.. చేపట్టిన పనుల్లో ప్రతీ వారం పురోగతి ఉండాలి.. అందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి..

సంక్షేమం ప్రతిష్ఠాత్మకం

గడువులోగా పూర్తి కావాల్సిందే

అర్హులకే సంక్షేమ పథకాలు అమలు

ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌ యువ వికాసంపై నిరంతర పర్యవేక్షణ

అధికారులంతా క్షేత్రస్థాయికి

ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యవేక్షణ

మండలాల ప్రత్యేకాధికారులు అశ్రద్ధ వహిస్తే మెమోలు జారీ

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): అధికారులంతా పల్లె బాట పట్టాలి.. క్షేత్రస్థాయికి వెళ్లి సంక్షేమ పథకాలను నిరంతరం పర్యవేక్షించాలి.. పథకాల అమలులో ఏ మాత్రం నిర్లక్ష్యం, అశ్రద్ధ వహించరాదు.. చేపట్టిన పనుల్లో ప్రతీ వారం పురోగతి ఉండాలి.. అందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.. అని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పథకాల గ్రౌండింగ్‌ పూర్తయ్యేలా కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు.

జిల్లాలో మొత్తం 17 మండలాలు, 428 గ్రామపంచాయతీలు, ఆరు మునిసిపాలిటీలు ఉన్నాయి. ప్రతీ గ్రామం నుంచి సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉండే లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. లబ్ధిదారు ల ఎంపిక ప్రజాప్రతినిధుల సహకారంతో చేపట్టినా, పేదలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు నిరంతరం పథకాల అమలు తీరుపై వీడియో, టెలీకాన్ఫరెన్స్‌లు, సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో వారం రోజుల ప్రగతిపై ఉన్నతాధికారులకు అధికారులు నివేదిక అందించాల్సి ఉం టుంది. ఈ నేపథ్యంలో అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యటించి పథకాల అమలును పర్యవేక్షించాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌ యువ వికాసం, సన్న బి య్యం పంపిణీ, తదితర పథకాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సంక్షేమ పథకాల అమలుపై మండలాల ప్రత్యేకాధికారులు (జిల్లా అధికారులు) దృష్టి సారించాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం వహిస్తే మెమోలు జారీచేస్తామని సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ ఎం.హనుమంతరావు హెచ్చరించారు. మండలాల ప్రత్యేకాధికారుల పనితీరును సమీక్షించి సంక్షేమ పథకాల అమలు తీ రుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిత్యం ఉదయం నుంచి సాయంత్రం 4గంటల వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి, పథకాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. స్థానిక మండలాల అధికారులు, సిబ్బందితో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి, పనుల్లో పురోగతిని పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిత్యం 17మండలాల ప్రత్యేకాధికారులతో పాటు సంబంధిత జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ల ద్వారా సమీక్షించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌యు వ వికాసం పథకాల అర్హుల జాబితా రూపకల్పనలో అధికారులు కీలక పాత్ర వహించాలని ఆదేశాలు జారీచేశారు.

లబ్ధిదారుల ఎంపికలో అధికారులదే కీలక పాత్ర

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాల్సిన కీలక బాధ్యత లు మండలాల ప్రత్యేకాధికారులకు జిల్లా యంత్రాంగం అప్పగించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రతీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. మండల స్థాయిలో ఎంపీడీవో, తహసీల్దార్‌, ఎంపీవో, ఏఈ, తదితర అధికారులతో బృందాలు ఏర్పాటుచేశారు. లబ్ధిదారుల ఎంపికపై జిల్లా అధికారులతో సూపర్‌ చెక్‌ పూర్తయింది. ఈ నెల 7న ఇళ్ల మంజూ రు పత్రాలు అందించేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లా లో ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. మొదటి విడతలో మంజూరైన 2,100 ఇళ్ల పనులు వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో మొదటి విడతలో మంజూరైన వారిలో 61మంది లబ్ధిదారులకు తొలి విడతగా రూ.లక్ష వెంటనే వారి బ్యాంక్‌ ఖాతాలో జమచేయనున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమైతేనే వారికి నమ్మకం కలుగుతుంది. ఇళ్లు కట్టుకునేందుకు కూడా కొంతమందికి ఆర్థికంగా సహాయం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్లు పునాదులన్నీ వారం రోజుల్లోగా పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రత్యేకాధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ, వెనువెంటనే పనులు పూర్తి చేయించి, బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అయ్యేలా నిరంతరం పర్యవేక్షించనున్నారు. లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేందుకు ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తారు. ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ ద్వారా రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు మంజూరు చేయనున్నారు. ఇందిరమ్మ మోడల్‌ ఇంటి నిర్మాణం ప్రకారం 400నుంచి 600ఎస్‌ఎ్‌ఫటీ నిబంధన పక్కాగా పాటించాలని, లేనిపక్షంలో బిల్లులు మంజూరు కావని అవగాహన కల్పించనున్నారు. ఇటీవల మండలాలకు కొత్తగా అసిస్టెంట్‌ ఇంజినీర్లను నియమించారు. వీరంతా క్షేత్రస్థాయికి వెళ్లి మంజూరైన ఇళ్లను వెంటనే ప్రారంభించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్‌ ద్వారా జియో ట్యాగింగ్‌తో ఇంటి నిర్మాణ పనులు నమో దు చేస్తారు. మంజూరైన ఇళ్లను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

రాజీవ్‌ యువ వికాసంపై పకడ్బందీగా సర్వే

ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రాజీవ్‌ యువ వికా సం కింద రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు స్వయం ఉపాధికి రుణాలు మంజూరు చేయనుంది. ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూసీ శాఖల ద్వారా వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి అర్హులను ఎంపిక చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో అన్ని శాఖల పరిధిలో మొత్తం 38,900 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి. అయితే వీటిలో అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు పకడ్బందీగా సర్వే నిర్వహించాలని జిల్లా యంత్రా ంగం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో రాజీవ్‌ యువ వికా సం కింద ఎస్సీ కార్పొరేషన్‌కు 10,209 దరఖాస్తులు రాగా, ఎస్టీ శాఖకు 2,536, బీసీ శాఖకు 23,578, ఈబీసీ శాఖకు 863, మైనార్టీ శాఖకు 1,654, క్రిస్టియన్‌ మైనార్టీశాఖకు 30 వరకు దరఖాస్తులు వచ్చాయి. ఎస్సీ కార్పొరేషన్‌లో మొ త్తం 3,644యూనిట్లు, ఎస్టీలో 1,250, బీసీ 4,294, మైనార్టీ, ఈబీసీలో 1,044 యూనిట్ల వరకు రుణాలు ఇవ్వనున్నారు. వీటిలో రూ.50వేల నుంచి రూ.4లక్షల రుణం ఇవ్వనున్నారు. దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయి విచారణ నిర్వహించి యూనిట్లు మంజూరు చేయనున్నారు.

Updated Date - May 06 , 2025 | 12:16 AM