Share News

‘పేట’లో తూకాల దందా..!

ABN , Publish Date - Nov 07 , 2025 | 12:04 AM

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో కమీషనదారులు, గుమస్తాలు, దడవాయిలు తూకాల దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రైతులు, మిల్లర్లను మోసం చేసి తప్పుడు తూకాలు చూపించిన కొంతమంది కమీషనదారులు, గుమస్తాలు, దడవాయిలు పర్సంటేజీల పరంగా పంచుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘పేట’లో తూకాల దందా..!
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం రాసులు(పాతచిత్రం)

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో కమీషనదారులు, గుమస్తాలు, దడవాయిలు తూకాల దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రైతులు, మిల్లర్లను మోసం చేసి తప్పుడు తూకాలు చూపించిన కొంతమంది కమీషనదారులు, గుమస్తాలు, దడవాయిలు పర్సంటేజీల పరంగా పంచుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండు మిల్లుల యజమాన్యాలు ఏళ్ల నుంచి గుమస్తాలుగా పనిచేస్తున్న ఇద్దరిని తొలగించినట్లు తెలుస్తోంది.

(ఆంధ్రజ్యోతి-భానుపురి)

తప్పుడు తూకాలకు పాల్పడిన కొందరు కమీషనదారులపై గుర్రుమంటున్న మిల్లర్లు, ఆడ్తి వ్యాపారుల సంఘం కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని చర్చ సాగుతోంది. సూర్యాపేట మార్కెట్‌లోని ఆడ్తి వ్యాపారుల కమిటీకి, మిల్లర్లకు వారం రోజుల నుంచి తర్జనభర్జనలు జరుగుతున్నాయి. రెండు సంవత్సరాల తక్‌పటిక్టలు సేకరించి సంఘానికి తీసుకురావాలని చెప్పినట్లు సమాచారం. రైతుల నుంచి మార్కెట్‌లో 66 కేజీలు కాంటాలు వేసి మిల్లులకు సైతం 61 కేజీల తూకం చూపించి డబ్బులు నొక్కినట్లు గుసగుసలు విన్పస్తున్నాయి. కాంటాలు వేసిన ధాన్యం 61కేజీలతో మిల్లులకు పంపిస్తూ 66 కేజీలకు బిల్లులు తీసుకున్నట్లు బయటికి తెలియడంతో ఇద్దరు సీనియర్‌ గుమాస్తాలను తొలగించారు. రెండు సంవత్సరాల నుంచి రైతులు, మిల్లర్లకు తప్పుడు తూకాలకు పాల్పడిన 23 మంది కమీషనదారులు చూపించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్‌లోని 1వ నెంబర్‌ షెడ్‌లో ఆరుగురు, రెండో నెంబర్‌లో ముగ్గురు, 3వ నెంబర్‌లో 2, 4వ నెంబర్‌లో 2, 8వ నెంబర్‌లో 2, 9వ నెంబర్‌లో 2, 10 నెంబర్‌లో 1, 11 నెంబర్‌లో 1, 12వ నెంబర్‌లో 1, 14వ నెంబర్‌లో 3, పత్తిషెడ్‌లో ఇద్దరు కమీషనదారులు తప్పుడు తూకాల దందాలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మార్కెట్‌కు ఖమ్మం, మర్రిపెడ, కొడిచర్ల, తానంచర్ల, కోదాడ, నడిగూడెం, కుసుమంచి, పాలేరు, నాయకనగూడెం నుంచి ధాన్యం తీసుకురావడానికి ట్రాక్టరు డ్రైవర్లకు మాముళ్లు ముట్టజెప్పి ఈ దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు రైతులను సైతం మభ్యపెట్టి దోచుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

50 పైసలు ఎక్కువ

సూర్యాపేట మార్కెట్‌లో కమీషనదారులు నిబంధనల ప్రకారం 100కు రూ.2 తీసుకోవాల్సి ఉంది. ఖరీదుదారులు సకాలంలో డబ్బులు ఇవ్వకుండా వాయిదా పెడుతుండడంతో రూ.2.50 కమీషన తీసుకోవడం నాలుగు సంవత్సరాల నుంచి కమీషనదారుల అనవాయితీగా వస్తోంది. ఓ కమీషనదారుడు మాత్రం రూ.2 కమీషన తీసుకుంటుండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రాక్టర్‌ డ్రైవర్లకు సైతం మామూళ్లు ఎలా ఇస్తున్నారని ప్రశ్నలు రేకేత్తిస్తున్న నేపథ్యంలో ఆకాశరామన్న ఉత్తరం బయటికి రావడం విశేషం.

విచారణ చేస్తున్నాం

కాంటాలు, రికార్డులను పరిశీలిస్తున్నాం. కొంత మంది కమీషనదారులు 66 కిలోలకు 61 కిలోల ధాన్యం మిల్లర్లకు పంపించినట్లు, 5 కిలోలు తేడాలు వచ్చినట్లు ఇటీవల మా దృష్టికి వచ్చింది. ఈ విషయమై విచారణ చేస్తున్నాం. విచారణలో నిజమని తెలితే చర్యలు తీసుకుంటాం.

ఫసియోద్దిన, మార్కెట్‌ కార్యదర్శి

Updated Date - Nov 07 , 2025 | 12:04 AM