Share News

అప్పుల పాలయ్యాం.. ఆదుకోరూ!

ABN , Publish Date - Jul 21 , 2025 | 12:41 AM

చేనేత సంఘాలు అప్పుల్లో కూరుకుపోయాయి. ‘ఒక్కరి కోసం అందరు - అందరి కోసం ఒక్కరు’ అనే నినాదంతో ప్రభుత్వం చేనేత సహకార సంఘాలను నెలకొల్పింది. ఉమ్మ డి నల్లగొండ జిల్లాలో మొత్తం 72 చేనేత సహకార సంఘాలుండగా, అందులో 34,011 మంది చేనేత కార్మికులు ఆధారపడి ఉన్నారు.

అప్పుల పాలయ్యాం.. ఆదుకోరూ!

సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న కార్మికులు

జిల్లా వ్యాప్తంగా 25 చేనేత సంఘాలకు రూ.15 కోట్ల అప్పులు

(ఆంధ్రజ్యోతి-భూదాన్‌పోచంపల్లి): చేనేత సంఘాలు అప్పుల్లో కూరుకుపోయాయి. ‘ఒక్కరి కోసం అందరు - అందరి కోసం ఒక్కరు’ అనే నినాదంతో ప్రభుత్వం చేనేత సహకార సంఘాలను నెలకొల్పింది. ఉమ్మ డి నల్లగొండ జిల్లాలో మొత్తం 72 చేనేత సహకార సంఘాలుండగా, అందులో 34,011 మంది చేనేత కార్మికులు ఆధారపడి ఉన్నారు. జిల్లాలో చేనేత వృత్తిపై ఆధారపడి సుమారు 21వేల కుటుంబాలున్నాయి. ప్రస్తుతం ఈ సంఘాల్లోని అధిక సంఖ్యలో కార్మికులు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు.

చేనేత కార్మికులకు చేతి నిండా పని కల్పించేందుకు నాబార్డునుంచి జిల్లా కేంద్ర సహకార సంఘం (డీసీసీబీ) ద్వారా చేనేత సహకార సంఘాలకు క్యాష్‌ క్రెడిట్‌ రుణాలను వారి వ్యాపార టర్నోవర్‌ను బట్టి మంజూరు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న 25 సంఘాలకు సుమారు రూ.15 కోట్ల రుణాలను డీసీసీబీ మంజూరు చేసింది. ఈ డబ్బుతో చేనేత వస్త్రాలు తయారు చేయడానికి అవసరమైన నూలు, రంగులు, రసాయనాలు కొనుగోలుచేసి సంఘ సభ్యులకు సరఫరా చేస్తున్నారు. ఈ ముడి సరుకులతో మగ్గాలపై వస్త్రాలను నేసి సహకార సంఘాలకు అప్పజెప్పాల్సి ఉంటుంది. వస్త్రాల ధర లెక్కగట్టి ముందుగా ఇచ్చిన ముడి సరుకు బాకీ పోగా మిగిలిన డబ్బును కార్మికులకు కూలి కింద చెల్లిస్తారు. చేనేత సహకార సంఘాలు సరఫరా చేసిన ముడి సరుకులతో నేతన్నలు నేసిన వస్త్రాలకు నగదు చెల్లిస్తారు. చేనేత సహకార సంఘాల్లో నేసిన వస్త్రాలను టెస్కో సంస్థ కొనుగోలు చేసి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే టెస్కో కొనుగోళ్లు లేకపోవడంతోపాటు కొనుగోలు చేసిన కొద్దిపాటి ఖరీదులకు డబ్బులు నెలల తరబడి చెల్లించడంలేదు.

పేరుకుపోయిన నిల్వలు

విక్రయాలు లేక సహకార సంఘాల్లో వస్త్రాల నిల్వలు పేరుకుపోయాయి. కేవలం భూదాన్‌పోచంపల్లి చేనేత సహకార సంఘంలోనే రూ.కోటి విలువైన వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని సంఘాల్లో కోట్లాది రూపాయల వస్త్రనిల్వలు ఏళ్లుగా పేరుకుపోయాయి. కాగా, చేనేత సహకార సంఘాలకు పర్సన్‌ ఇన్‌చార్జీలుగా అధికారులు ఉండడంతో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు, మంత్రులు, వారి సతీమణులు చేనేతరంగాన్ని పరిశీలించేందుకు వచ్చిన నేపథ్యంలో నజరానాకోసం అధికారులు సంఘాల్లో పేరుకుపోయిన వస్త్రాలను దానం చేస్తున్నారనే ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి. ఇటీవల భూదాన్‌పోచంపల్లిలోని చేనేతసంఘంలో లక్షలాది రూపాయల వస్త్రాలు గోల్‌మాల్‌ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో అధికారులు వాటిని రికవరీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే డీసీసీబీ ఇచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక కార్మికులకు పని కల్పించలేక చాలావరకు సంఘాలు అప్పుల్లో కూరుకుపోయాయి. కొన్ని సంఘాలు మూతపడ్డాయి. మిగతా సంఘాలు పెట్టుబడి లేకపోవడంతో చేనేత వస్త్రాల తయారీ కోసం ముడి సరుకులు ఇవ్వలేని పరిస్థితి దాపురించింది. దీంతో కార్మికులకు ఉపాధిలేక అల్లాడిపోతున్నారు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి పాలక వర్గాలతో సంఘాలు నడిపించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

చేనేత సంఘాల అప్పులు రూ.15కోట్లు : శ్రీనివా్‌సరావు, ఏడీ, చేనేత,జౌళీశాఖ

జిల్లా వ్యాప్తంగా 25 చేనేత సహకార సంఘాలకు డీసీసీబీ ద్వారా మంజూరు చేసిన క్యాష్‌ క్రెడిట్‌ రుణాలు రూ. 15 కోట్ల వరకు ఉన్నాయి. చాలా సంఘాలు పెట్టుబడి లేక నడవడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చేనేత కార్మికులకు వడ్డీతో కలిపి రూ. లక్ష లోపున్న బ్యాంకు రుణాలు ప్రభుత్వం మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. చేనేత సహకార సంఘాల అప్పులు మాఫీపై మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేదు.

సంఘాలను పరిరక్షించాలి : కూరపాటి రమేష్‌, చేనేత కార్మిక సంఘం రాష్ట్రనేత

జిల్లాలో వేలాది కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి ఉన్నాయి. సహకార సంఘాలు డీసీసీబీ నుంచి తీసుకున్న రుణాల బకాయిలు చెల్లించలేక అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. సంఘాలు పునరుజ్జీవం పొందాలంటే వాటి క్యాష్‌ క్రెడిట్‌ రుణాలన్నీ ప్రభుత్వం మాఫీ చేయాలి. కొత్త రుణాలు మంజూరు చేసి సంఘాలను పరిరక్షించాలి.

Updated Date - Jul 21 , 2025 | 12:41 AM