అప్పులపాలయ్యాం ఆదుకోరూ!
ABN , Publish Date - May 13 , 2025 | 12:20 AM
పదవిలో ఉన్నప్పుడు చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో మాజీ సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. బిల్లులు పెండింగ్ ఉండడంతో చేసిన అప్పులకు వడ్డీ చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. పదవీకాలం ముగిసి ఏడాదిన్నరైనా పెండింగ్ బిల్లులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో వారు ఉద్యమబాట పట్టారు.
ఉమ్మడి జిల్లాకు రావాల్సింది రూ.150 కోట్ల పైనే
అప్పుల చేసి నాడు అభివృద్ధి పనులు
వడ్డీలు కట్టలేక నేడు తిప్పలు
దశల వారీగా ఆందోళనకు సిద్ధమవుతున్న మాజీ సర్పంచులు
(ఆంధ్రజ్యోతి-నల్లగొండ / నల్లగొండ టౌన్) : పదవిలో ఉన్నప్పుడు చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో మాజీ సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. బిల్లులు పెండింగ్ ఉండడంతో చేసిన అప్పులకు వడ్డీ చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. పదవీకాలం ముగిసి ఏడాదిన్నరైనా పెండింగ్ బిల్లులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో వారు ఉద్యమబాట పట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.150 కోట్లకు పైనే బకాయిలు ఉన్నట్లు వారు చెబుతున్నారు. నల్లగొండ జిల్లాలోని తాజా మాజీ సర్పంచులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, వినతిపత్రం అందజేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1,740 గ్రామపంచాయతీలకు నల్లగొండలో 844, యాదాద్రిభువనగిరి జిల్లాలో 421, సూర్యాపేటలో 475 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటికి జనాభా ప్రాతిపదికన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తాయి. గ్రామాల్లో ఈ నిధులతో ఆభివృద్ధి పనులు చేపడతారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో మురికికాల్వలు, వీధిలైట్లు, పైపులైన్ల లీకేజీలు, రోడ్ల శుభ్రత, పల్లె ప్రగతి, డంపింగ్ యార్డు, వైకుంఠధామాలు, క్రీడా మైదానాలు, పంచాయతీ భవనాలు తదితర పనులను సర్పంచులు సొంత డబ్బులతో చేపట్టారు. కానీ ఇప్పటివరకు ఆ బిల్లులకు మోక్షం లభించడం లేదు.
అత్యధికంగా నల్లగొండ జిల్లాలో...
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,740 గ్రామపంచాయతీ లు ఉండగా సుమారు రూ. 150 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో రూ.60 కోట్లు, సూర్యాపేట జిల్లాలో రూ.50 కోట్లు, యాదాద్రిభువనగరి జిల్లాలో రూ.40 కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయి. వీటిని తక్షణమే చెల్లించి ఆదుకోవాలని మా జీ సర్పంచ్‌లో డిమాండ్ చేస్తున్నారు. బిల్లులు పెం డింగ్ ఉండడంతో చేసిన అప్పులకు వడ్డీ చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. పెండింగ్ బిల్లులన్నీ మం జూరు చేస్త్తామని చెబుతున్న ప్రభుత్వం పూర్తిస్థాయి లో చెల్లించకపోవడంతో అవస్థలుపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్పులకు పెరుగుతున్న వడ్డీలు...
గ్రామపంచాయతీల ద్వారా చేపట్టిన వివిధరకాల పనుల బిల్లులు రాక మాజీ సర్పంచ్‌లు సతమతమవుతున్నారు. పదవీకాలం ముగిసినా బిల్లు లు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర అవుతున్నా బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంద ని సర్పంచులు వాపోతున్నారు. బిల్లుల చెల్లింపు లో జాప్యం జరుగుతుండడంతో సర్పంచులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటివల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆర్థికంగా కుంగిపోయిన ఇద్దరు మాజీ సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటనలు ఉన్నాయి. మరోవైపు సర్పంచులు తెచ్చిన అప్పులకు వడ్డీలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో చేసేదేం లేక వారు పోరుబాట పట్టారు.
దశల వారీ ఆందోళనకు కార్యాచరణ...
లక్షల రూపాయల అప్పులు చేసి పలు అభివృద్ధి పనులు చేపట్టిన మాజీ సర్పంచులకు బిల్లులు రాకపోవడంతో దశల వారీ ఆందోళనకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. అప్పు లు పెరిగి పోవడంతో వడ్డీలు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను మాజీ ప్రజా ప్రతినిధులు కలిసారు. అదేవిధంగా రాబోయే రోజుల ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు నిర్ణయించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ సైతం పెండింగ్ బిల్లులను కేటాయించడంలో జాప్యం చేయడంతో అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బిక్షాటన వంటి కార్యక్రమాలను చేపట్టి అప్పట్లో పెద్ద ఆందోళన చేశారు. అయితే ఇటీవల ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా స్థానికసంస్థల ప్రజాప్రతినిధులకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర దాటినా కూడా గత ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర నిరాశనిస్పృహలకు లోనవుతున్నారు. అనేకమంది మాజీ సర్పంచులు పేదరికంలో ఉండి అభివృద్ధి పనుల కోసం పెద్దఎత్తున లక్షలాది వడ్డీలకు తెచ్చి సకాలంలో బిల్లులు రాకపోవడంతో అప్పులపాలయ్యారు. ప్రధానంగా గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలు, సీసీ రోడ్లకు, డ్రైనేజీ నిర్మాణాలకు పెద్దఎత్తున బిల్లులు పెట్టి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రూ.6లక్షలు బిల్లులు రావాలి : దేశబోయిన మల్లమ్మ, మాజీ సర్పంచ్ వెలిమినేడు, చిట్యాల
పారిశుధ్యం పనులతో పాటు పాటు పల్లె ప్రకృతి వనం, మోటార్ల మర మ్మతులు, పైప్ లైన్ లీకేజీలు వంటి పనులకు సంబంధించి రూ.6 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. సర్పంచ్ పదవి ము గిసే ఏడాది ముందు నుంచి బిల్లులు రాకుండా పోయాయి. దీం తో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వడ్డీకి అప్పులు తె చ్చి పనులు చేపట్టాం. ప్రభుత్వం ు స్పందించి బిల్లులు చెల్లించి మాజీ సర్పంచులను ఆదుకోవాలి. లేనట్లయితే మాజీ సర్పంచుల అప్పుల ఊబిలో నుంచి తేరుకోవడం కష్టంగా ఉంటుంది.
అప్పుల భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం : రొట్టెల రమేష్, తిప్పర్తి మాజీ సర్పంచ్
బిల్లులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాం. పల్లె ప్రగతి పనులతో పాటు డ్రైనేజీ పనులు, ఉపాధి పనులు, మిషన్ భగీరథ పనులు, ఇతర అభివృద్ధి పనులను చేపట్టాం. రూ. 15 లక్షల వరకు బిల్లులు రావల్సి ఉంది. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బిల్లులను మంజూరు చేసి మాజీ ప్రజా ప్రతినిధులను ఆదుకోవాలి. వడ్డీలకు తెచ్చి అభివృద్ధి పనులను చేపట్టాం. ఆ వడ్డీలు చెల్లించి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. తాజా మాజీ సర్పంచులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.