కూలీలు లేకుండానే నీరైనా, ఎరువైనా
ABN , Publish Date - Jun 19 , 2025 | 12:24 AM
తెలంగాణలో మొదటిసారి ఆయిల్‌పామ్ తోటలో వైర్‌లెస్ ఇరిగేషన్ ఆటోమేషన్ సిస్టమ్ ఏర్పాటైంది. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన యువరైతు ఎం.వెంకట్‌రెడ్డి తన 12 ఎకరాల ఆయిల్‌పామ్ తోటలో వైర్‌లెస్ ఇరిగేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయించారు.
రాష్ట్రంలో తొలిసారి డ్రిప్ పద్ధతిలో ఆయిల్‌పామ్ సాగు
మాడ్గులపల్లి మండలంలో ఐవోటీ సిస్టం ఏర్పాటు
సులభతరం కానున్న యాజమాన్య పద్ధతులు
ఉమ్మడి జిల్లాలో రైతులకు అవగాహన కల్పనకు సన్నాహాలు
(ఆంధ్రజ్యోతి-నల్లగొండ) : తెలంగాణలో మొదటిసారి ఆయిల్‌పామ్ తోటలో వైర్‌లెస్ ఇరిగేషన్ ఆటోమేషన్ సిస్టమ్ ఏర్పాటైంది. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన యువరైతు ఎం.వెంకట్‌రెడ్డి తన 12 ఎకరాల ఆయిల్‌పామ్ తోటలో వైర్‌లెస్ ఇరిగేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయించారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ తోటలో ఇలాంటి సాంకేతిక వ్యవస్థను ఏర్పాటుచేయడం ఇదే తొలిసారి. తోటలోని ఫాం పాండ్‌లోకి బోర్ల నుంచి నీటిని నిల్వ చేసి దానిని బిందు సేద్యం ద్వారా వినియోగిస్తున్నారు. ఈ డ్రిప్ ద్వారానే ఎరువులు, పోషకాలు కూడా అందిస్తారు.ఈ విఽధానంతో సంబంధిత రైతు ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నా సరే తోటలో యజమాన్య పద్ధతులు సులభంగా అమలు చేయవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణంపై దృష్టి సారించిన నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆయిల్‌పామ్ తోటల విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 2,217మంది రైతులు 10,700 ఎకరాల్లో సాగు చేస్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 914మంది రైతులు 4,107 ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో 1,015మంది రైతులు 4,457ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 18,264 ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటలను సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయిల్‌పామ్ తోటల సాగు యాజమాన్య పద్ధతులు సులభతరం చేయడం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. నల్లగొండ జిల్లాలోని మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో రాష్ట్రంలోనే మొదటిసారిగా ఐవోటీ(ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్) ద్వారా వైర్‌లెస్ ఇరిగేషన్ ఆటోమేషన్ సిస్టమ్‌ను అమలుచేశారు. దీని వల్ల ఆయిల్‌పామ్ సాగుచేసే రైతులకు ఎంతగానో ఉపయో గం ఉంటుంది. సంబంధిత రైతు తోటలో లేకున్నప్పటికీ స్థానికంగా లేకున్నా వేరే ప్రాంతంలో ఉన్నా సరే ఈ ఆటోమేషన్ సిస్టమ్‌తో తోటకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించవచ్చు. ఒక మొక్కకు నీరు ఎంత అవసరం, ఫర్టిలైజర్ ఎంత ఇవ్వాలి, పోషకాలు ఎలా అందించాలనే దానిని కూడా ఉపయోగించవచ్చు. ప్రతీ ఎకరానికి ఈ టెక్నాలజీతో వాటర్ వాల్ ఏర్పాటుచేసి మొక్కలకు నీరు అందేలా చూడవచ్చు. సాగునీటితో పాటు ఎరువులు, పోషకాలను తగు మోతాదులో కలిపి ప్రతీ మొక్కకు తగినంతకు ఆటోమేటెడ్ డ్రిప్ ద్వారా అందించవచ్చు. అందుకు అనుగుణంగా ఆయా మోతాదు లో మొక్కలకు వాల్స్, మొబైల్ యాప్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. కూలీల అవసరం లేకుండానే తోటలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా నీటి యాజమాన్యాన్ని చేసుకునే వీలు ఉంటుంది. మొక్కలకు సిఫారసు చేసిన ఎరువులను ఆటోమేషన్ పద్ధతి ద్వారా అందించవచ్చు. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఆయిల్‌పామ్ సాగు రైతులు ఈ విధానం ద్వారా ప్రయోజనం పొందే వీలు ఉంటుంది.
ఐవోటీ సాంకేతిక ప్రక్రియతో
ఆయిల్‌పామ్ తోటల్లో ఆటోమేషన్ సిస్టమ్‌కు సంబంధించి ఐవోటీ సాంకేతిక ప్రక్రియ ద్వారా ఈ విధానం పనిచేయనుంది. అంటే సెన్సార్ ద్వారా ఇంటర్‌నెట్ వినియోగించుకొని సాధనాలను పనిచేయించవచ్చు. ఈ సాంకేతిక సాధనాల ద్వారా నేలలో తేమశాతాన్ని, ఉష్ణోగ్రతను, గాలిలో తేమశాతం పోషకాల లభ్యత వంటి అంశా లు ఎప్పటికప్పుడూ సాంకేతిక పరిజ్ఞానంతో తెలియజేస్తుంది. భూమిలో నాటిన ఆయిల్‌పామ్ మొక్కకు కావాల్సిన మోతాదు మేరకు పోషకాలను డ్రిప్ ద్వారా అందించడానికి ఉపకరిస్తుంది. తద్వారా పోషకాల వినియోగాన్ని సమర్థంగా నియంత్రిస్తూ అమలుచేస్తుంది. విద్యుత్ ఓల్టేజీ సమస్యతో మోటార్లు చెడిపోకుండా ఓల్టేజీ మానిటరింగ్ ప్రక్రియ ద్వారా ఈ విధానం కాపాడుతుంది. అదేవిధంగా 50శాతం నీటి ఆదా, ఎరువుల ఆదా చేస్తూ అధిక దిగుబడులకు నాణ్యత గల పంటలు రావడానికి ఐవోటీ సాంకేతిక ప్రక్రియ తోడ్పడుతుంది. అతేకాకుండవా నీటి మోతాదును యూఎ్‌సడీఏ సూచనల ప్రకారం ప్రోగ్రామింగ్ చేసిన యంత్రాల ద్వారా సమయానుకూలంగా అందించవచ్చు. ఈ వ్యవస్థకు ఒకసారి టైమింగ్ సెట్ చేస్తే ఏడాది పొడవునా ప్రతిరోజూ అదే సమయానికి వాల్‌లు, మోటార్లు ఆటోమెటిక్‌గా ఆన్ ఆఫ్ అవుతాయి.
అనుముల మండలంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే 18,264ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణంలో ఉంది. అదనంగా మరో 15వేల ఎకరాల్లో సాగుకు రైతులు ముందుకు వస్తే త్వరలో జిల్లాలో ఆయిల్‌పామ్ కంపెనినీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో పాటు సంబంధిత కంపెనీ హామీ ఇచ్చినట్లుగానే సన్నాహాలు చేయనున్నారు. ఇందులో భాగంగా అనుముల మండలం యాచారం గ్రామంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఇప్పటికే 25 ఎకరాల వరకు సేకరించింది. మరో కొంత భూమిని కూడా కొనుగోలు చేయడానికి నిర్ణయించారు. యాచారంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంతో పాటు అందులో కొన్ని ఎకరాలల్లో ఆయిల్‌పామ్ తోటను ఏర్పాటుచేసి రైతులకు అవగాహన కల్పించడానికి, శిక్షణ తరగతులు నిర్వహించడానికి నిర్ణయించినట్లు తెలిసింది. ఒక్కో ఎకరానికి 10 నుంచి 12టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి. గతంలో ఆయిల్‌పామ్ కంపెనీనీ హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై నల్లగొండ-సూర్యాపేట జిల్లాల మధ్యలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినా భూమి కొనుగోలుకు అందుబాటులో లేకపోవడంతో అనుముల మండలంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం దిగుబడులను ఖమ్మం జిల్లాతో పాటు విజయవాడ ప్రాంతానికి ఆయా కంపెనీలు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం తోటలు వేస్తున్న రైతులు మార్కెటింగ్ సమస్యపై అయోమయానికి గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం భరోసా ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడంతో పాటు పంటలు వేసిన రైతులు ఎట్టి పరిస్థితులల్లోను నష్టపోయేది లేదని స్పష్టత ఇస్తుంది. ఈ తోటల సాగు సులభం కావడంతో పాటు ఆయిల్‌పామ్ తోటలు పండించిన రైతులతో కంపెనీలు ఒప్పందం చేసుకుంటున్నాయి. ధరలు సైతం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడూ ధర నిర్ణయిస్తుండటంతో రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఆయిల్‌పామ్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో జిల్లాలో ఆయిల్‌పామ్ సాగును విస్తరించాలని నిర్ణయించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నీటి వనరులు అధికంగా ఉండటంతో తోటలు విస్తరించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం టన్ను ధర రూ. 18,700పైగా ఉండగా ఏడాదికి ఎకరానికి రూ.1.50 లక్షల ఆదా యం పొందే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు ఎకరానికి సుమారు రూ.60వేలు ఉండగా వరి పంటతో పోలిస్తే 7 నుండి 8 రెట్ల అధిక ఆదాయం పొందవచ్చని ఉద్యాన శాఖాధికారులు తెలిపారు.
నీటి యాజమాన్యంలో ఇది సరికొత్త అధ్యయనం : పిన్నపురెడ్డి అనంతరెడ్డి, జిల్లాఉద్యాన శాఖ అధికారి నల్లగొండ
నీటి యాజమాన్య పద్థతుల్లో ఇది సరికొత్త అధ్యయనమని చెప్పవచ్చు. రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ విధానాన్ని ఇతర రైతులు కూడా అనుసరిస్తే సాగు ఖర్చులు తగ్గించుకొని దిగుబడిని పెంచుకోవచ్చు. అత్యాధునిక సాగు విధానాలను రైతులు అందిపుచ్చుకోవాలి. ఆయిల్‌పామ్ తోటల్లో వైర్‌లెస్ ఇరిగేషన్ ఆటోమేషన్ సిస్టమ్ రైతులకు భవిష్యత్తులో ప్రయోజనకరంగా మారనుంది. సాగునీరు, ఎరువులను ఈ విధానంతో సమర్ధవంతంగా వినియోగించవచ్చు. ఈ సాంకేతిక వ్యవస్థను ప్రారంభించడం వల్ల ఆయిల్‌పామ్ రైతులకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఈ విధానంపై రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ప్రస్తుతం 4వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఆయిల్‌పామ్ తోటకు సంబంధించి ఎకరానికి 3 టన్నుల దిగుబడి వస్తుంది.