గ్రామస్థాయి అధికారులు వస్తున్నారు
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:31 AM
గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా గ్రామ పరిపాలన అధికారుల (జీపీవో) నియామక ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. జీపీవోలకు నియామక పత్రాలు అందించేందుకు ఈ నెల 5న ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది.
రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వ చర్యలు
నేడు గ్రామ పరిపాలనా అధికారుల(జీపీవో)కు నియామక పత్రాలు
హైదరాబాద్‌లో అందించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
రెవెన్యూ సమస్యల పరిష్కారంలో వీరే కీలకం
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా గ్రామ పరిపాలన అధికారుల (జీపీవో) నియామక ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. జీపీవోలకు నియామక పత్రాలు అందించేందుకు ఈ నెల 5న ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. జిల్లాలో జీపీవోలుగా ఎంపికైన వారంతా హై దరాబాద్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నుంచి నియామక పత్రాలు అందుకోనున్నారు.
రెవెన్యూశాఖలో గ్రామస్థాయిలో కీలకంగా ఉన్న వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థలను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సహాయకులను(వీఆర్‌ఏ) వారి అర్హతలబట్టి వివిధ శాఖ ల్లో సర్దుబాటు చేసింది. జిల్లాలో గతంలో మొ త్తం 161మంది వీఆర్వోలు, 600మందికి వరకు వీఆర్‌ఏలు పనిచేసేవారు. ప్రభుత్వ మార్గదర్శకా ల ప్రకారం వీఆర్వో, వీఆర్‌లను ఇతర శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లుగా సర్దుబాటు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలులేని వారు ప్రస్తు తం చాలా మంది వీఆర్‌ఏలు ఇప్పటికీ తహసీల్దార్ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి జీతభత్యాలను కూడా ప్రభుత్వం నిలిపివేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్రామ పాలనాధికారుల(జీపీవో) పోస్టులను కొత్తగా ఏర్పాటు చేసి రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంది.
రెండు విడతల్లో పరీక్ష
పూర్వ వీఆర్వోలు, వీఆర్‌ఏలకు జీపీవోలుగా అవకాశం కల్పించేందుకు నిర్ణయించి అర్హత పరీక్ష ద్వారా ఎంపిక చేసింది. గతంలో వీఆర్‌ఏ, వీఆర్వోలుగా పనిచేసిన వారికి ప్రాధాన్యమిస్తూ నే, డిగ్రీ, ఐదేళ్ల సర్వీసుతో ఇంటర్ ఉత్తీర్ణతను అర్హతగా నిర్ణయించింది. జీపీవోల ఎంపికకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించింది. 2024 మే నెల 27న జరిగిన పరీక్షకు 151మంది దరఖాస్తు చేసుకోగా, 139మంది హాజరయ్యా రు. 2024జూలైలో జరిగిన పరీక్షకు 34 మంది హాజరయ్యారు. జిల్లాలోని మొత్తం 301 రెవెన్యూ గ్రామాలను 310 క్లస్టర్లుగా అధికారులను విభజించారు. ప్రస్తుతం జిల్లా నుంచి 153 మంది జీపీవోలుగా ఎంపికయ్యారు. మిగతా ప్రాంతాల్లో రెవెన్యూశాఖలోని ఉద్యోగుల తో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జీపీవోలుగా ఎంపికైన వారికి ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 2న, ఆగస్టు 15న రెండు విడతల్లో నియామక పత్రాలు అందజేయాలని నిర్ణయించినా ముహూర్తం ఖరారుకాలేదు. అయితే రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా గతంలో వీఆర్వో, వీఆర్‌ఏలుగా పనిచేసిన వారిని జీపీవోలుగా నేరుగా ఎంపిక చేస్తారని భావించారు. అయితే విద్యార్హతల్లో నిబంధన, పాత సీనియారిటీ ఉండదని ప్రకటించడంతో చాలా మంది గతంలో పనిచేసిన వీఆర్వోలు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం ఎంపికైన వారికి ఈ నెల 5న నియామక పత్రాలు అందించేందుకు ముహూర్తం ఖరారు చేసింది.
కత్తిమీద సాములా రికార్డుల నిర్వహణ
గత ప్రభుత్వం ఉన్నఫళంగా వీఆర్వో, వీఆర్ ఏ వ్యవస్థను రద్దు చేసింది. ఈ క్రమంలో గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది కొరతతో రెవెన్యూ రికార్డుల నిర్వహణ జిల్లా యంత్రాంగానికి కత్తిమీద సాములా మారింది. ధరణిలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు సరైన మాడ్యుల్స్ లేకపోవడంతో పాటు గ్రామీణ స్థాయిలో భూముల రక్షణ కూడా కరువైంది. ఆర్‌ఐలు ధరణితో పాటు భూభారతిలో వచ్చిన దరఖాస్తుల విచారణకు సమయం కేటాయిస్తున్నారు. మిగతా పనిని నిర్వహించడంలో జాప్యం జరుగుతోంది. రెవె న్యూ సదస్సుల్లో జిల్లా పరిధిలో దరఖాస్తులు తీసుకోగా, ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో అర్జీల పరిష్కారం కావడంలేదు. ఈ నేపథ్యంలో గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వానికి పలు రెవె న్యూ సంఘాలు విన్నవించాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెవెన్యూ వ్యవస్థలో మార్పులు, చేర్పులు ఉంటాయని ప్రకటించింది. ప్రభుత్వం ముందుడుగు వేసి జీపీవో వ్యవస్థను పునరుద్ధరించింది. జిల్లాలో భువనగిరి, చౌటుప్పల్ డివిజన్ల పరిధిలో 17మండలాలు ఉన్నాయి. రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత కారణంగా రెవెన్యూ అర్జీల పరిష్కా రం నత్తనడక నడుస్తోంది. వివిధ భూ సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో 14,482 దరఖాస్తులు అందాయి. వీటిలో ఇప్పటివరకు 10,493 దరఖాస్తులు పరిశీలించారు. జిల్లాలో ఇప్పటివరకు 1,021 దరఖాస్తులకు పరిష్కారం లభించగా, 2,916 దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉంది. రెవెన్యూ సదస్సు ల్లో వచ్చిన దరఖాస్తులపై విచారణ చేపట్టేందుకు సిబ్బంది కొరతతో పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా నియామకమైన జీపీవోలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి విచారణ నిర్వహించే అవకాశం ఏర్పడింది.
జీపీవోల జాబ్‌చార్ట్
గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా ప్రభుత్వం జీపీవోల విధులపై మార్గదర్శకాలు విడుదల చేసింది. కొత్తగా బాధ్యతలు తీసుకునే జీపీవోలు పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏ విధులతో పాటు భూభారతి రెవెన్యూ సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యహరించనున్నారు. గ్రామీణస్థాయిలో అన్ని ధ్రువీకరణపత్రాల విచారణ నిర్వహించనున్నారు. విద్యార్హత, ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించిన విచారణలు, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, చెట్ల పరిరక్షణ, భూముల సర్వే, కొలతలకు సహాయకులుగా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు అర్హులైన లబ్ధిదారుల గుర్తింపునకు ఎంపికకు, గ్రామస్థాయిలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయకర్తలుగా జీపీవోలు వ్యవహరించనున్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 5న జీవోలకు సీఎం నియామక పత్రాలు అందజేస్తారని కలెక్టర్ ఎం.హనుమంతరావు, అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి తెలిపారు.