శరవేగంగా విజయవిహార్ ఆధునికీకరణ
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:17 AM
ప్రపంచ పర్యాటక కేంద్రం, అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రమైన నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్‌కాలనీలోని విజయవిహార్ అతిథి గృహంలో రూ.5 కోట్లతో చేపట్టిన ఆధునికీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
రూ.5కోట్లతో పూర్తికి కసరత్తు
సాగర్‌కు రానున్న 140 దేశాల మిస్‌వరల్డ్ పోటీ యువతులు, దేశ, విదేశీ మీడియా ప్రతినిధులు
నాగార్జునసాగర్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ పర్యాటక కేంద్రం, అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రమైన నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్‌కాలనీలోని విజయవిహార్ అతిథి గృహంలో రూ.5 కోట్లతో చేపట్టిన ఆధునికీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మే 7వ తేదీ నుంచి 31వ తేదీ వరరకు నిర్వహించే మిస్‌వరల్డ్ పోటీలకు 140 దేశాలకు చెందిన యువతులు, 3 వేల మంది దేశ, విదేశీ మీడియా ప్రతినిధులు హాజరవుతున్నారు. వీరంతా రాష్ట్రంలో వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు. దీనిలో భాగంగా మే 12న నాగార్జునసాగర్‌కు వస్తున్నారు. సాగర్‌లో బుద్ధవనం, జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండను సందర్శిస్తారు. వీరు ఇక్కడ విడిది చేయడానికి వీఐపీ అతిథి గృహం అయిన విజయవిహార్‌ను ఎంపికచేశారు. మిస్‌వరల్డ్ పోటీలకు కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఆధునికీకరణ పనులు శరవేగంగా చేస్తున్నారు. పనులను గత నెల 22న పర్యాటక శాఖ ఎండీ ప్రకా్‌షరెడ్డి, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిలు పరిశీలించారు. విజయవిహార్‌లో సమీక్షా సమావేశం నిర్వహించి ప్రతిష్ఠను, తెలంగాణ సంస్కృతీ,సంప్రదాయాలను దేశ, విదేశాలకు తెలియపరిచేలా పర్యాటక ప్రాంతాలను తీర్చి దిద్దాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో విజయవిహార్‌లో ప్రస్తుతం స్విమ్మింగ్ పూల్, సరోవర్ విభాగంలో రంగులు అద్దె పనులు చకచక సాగుతున్నాయి. ప్రధాన విభాగంలో రిసెప్షనపైన ఉన్న గదులకు చిప్పింగ్ చేయడం వంటి పనులు చేస్తున్నారు. అంతే కాకుండా డ్రైనేజీ నూతన లైన్లను ఏర్పాటు చేస్తున్నారు.
20 రోజుల్లో పనులు పూర్తి చేస్తాం
విజయవిహార్ అతిథి గృహం ఆధునికీకరణ పనులను 20 రోజుల్లో పూర్తి చేస్తాం. మిస్‌వరల్డ్ పోటీదారులు సాగర్ సందర్శనకు వచ్చే నాటికి అన్ని పనులు పూర్తి చేస్తాం. ఇప్పటికే సగం పనులు పూర్తయ్యాయి.
శ్రీనివా్‌సరెడ్డి, డీఈ, పర్యాటక శాఖ