Share News

నెమ్మికల్‌లో రహదారిపైనే వాహనపూజలు

ABN , Publish Date - Oct 08 , 2025 | 11:57 PM

జిల్లాలో అత్యంత ప్రాచుర్యంలో ఉన్న ఆత్మకూరు(ఎస్‌) మండలం నెమ్మికల్‌ దండుమైసమ్మ ఆలయం వద్ద ట్రాఫిక్‌ సమస్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. రోడ్డుపైనే వాహన పూజలు చేస్తుండటంతో నిత్యం ఈ సమస్య ప్రయాణికులను వేధిస్తోంది.

నెమ్మికల్‌లో రహదారిపైనే వాహనపూజలు
దండు మైసమ్మ ఆలయం వద్ద పూజల కోసం రోడ్డుపై నిలిపిన వాహనాలు

దండుమైసమ్మ ఆలయం వద్ద ట్రాఫిక్‌ వ్యవస్థ అస్తవ్యవస్తం

(ఆంధ్రజ్యోతి-ఆత్మకూరు(ఎస్‌)

జిల్లాలో అత్యంత ప్రాచుర్యంలో ఉన్న ఆత్మకూరు(ఎస్‌) మండలం నెమ్మికల్‌ దండుమైసమ్మ ఆలయం వద్ద ట్రాఫిక్‌ సమస్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. రోడ్డుపైనే వాహన పూజలు చేస్తుండటంతో నిత్యం ఈ సమస్య ప్రయాణికులను వేధిస్తోంది. ఆది, గురువారాల్లో పెద్దసంఖ్యలో భక్తులు ఆమ్మవారి దర్శనానికి వస్తుంటారు. అదేవిధంగా జిల్లా కేంద్రానికి అతిసమీపంలో ఉండటంతో ప్రజలు కొత్త వాహనాలు, పాతవాహనాలకు ఈ ఆలయం వద్ద పూజలు చేయిస్తుంటారు. అయితే రోడ్డుపైనే వాహనాలను నిలిపి పూజలు చేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అదేవిధంగా ప్రత్యేక పర్వదినాలు, పండుగలు, ఉత్సవాల సమయంలో రోడ్లపై ఇష్టానుసారంగా దుకాణాలు వెలుస్తున్నాయి. దీంతో అటు పూజల కోసం వాహనాల నిలిపివేత, ఇటు దుకాణాల ఏర్పాటుతో గంటల తరబడి ట్రాఫిక్‌ సమస్య నెలకొంటోంది. సూర్యాపేట- దంతాలపల్లి ప్రధాన రహదారి కావడంతో ప్రతిరోజూ పెద్దసంఖ్యలో వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తుంటాయి. నెమ్మికల్‌ దండు మైసమ్మ ఆలయం వద్దకు రాగానే ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. ఇదిలా ఉండగా దేవాదాయశాఖ నిబంధనల మేరకు వాహన పూజకు రూ.50లు మాత్రమే తీసుకోవాల్సి ఉండగా అధికంగా వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.

విస్తరణ చేపడతాం

రోడ్డుపైనే దుకాణాల నిర్వహణ, వాహన పూజలతో ట్రాఫిక్‌ ఇబ్బంది వాస్తవమే. ఈ విషయమై ఆర్‌అండ్‌బీ అధికారులను సంప్రదించి రోడ్డు విస్తరణ చేపడతాం. వాహన పూజలకు అధికంగా వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం.

జయరామయ్య, ఈవో, నెమ్మికల్‌ ఆలయం

Updated Date - Oct 08 , 2025 | 11:57 PM