Share News

వేదాంత భజన మందిర వినాయకుడు.. 74 ఏళ్లు

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:39 AM

వినాయక విగ్రహం అనగానే ఎత్తుతో పాటు దశాబ్దాలుగా ప్రతిష్టిస్తున్న ఖైరతాబాద్‌ వినాయకుడే గుర్తుకు వస్తారు.

వేదాంత భజన మందిర వినాయకుడు.. 74 ఏళ్లు

మొదటి నుంచి మట్టి విగ్రహాల ఏర్పాటు ప్రత్యేకం

ఇక్కడి లడ్డూకు ఎంతో పోటీ

వినాయక విగ్రహం అనగానే ఎత్తుతో పాటు దశాబ్దాలుగా ప్రతిష్టిస్తున్న ఖైరతాబాద్‌ వినాయకుడే గుర్తుకు వస్తారు. కానీ అంతకు ముందు నుంచే సూర్యాపేట జిల్లా కేంద్రంలో బొడ్రాయి బజార్‌లోని శ్రీసీతారామచంద్రుల వేదాంత భజన మందిరంలో వినాయక ప్రతిమను నెలకొల్పుతూ గణేష్‌ నవరాత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు ఈ ఏడాదికి 74 ఏళ్లు. ఈ ప్రాంతంలో ఇదే మొట్టమెదటి విగ్రహం.

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట టౌన)

సూర్యాపేటలోని బొడ్రాయిబజార్‌ వ్యాపార సముదాయంగా ఉంటుంది. 1950లో శ్రీసీతారామచంద్రుల స్వామి దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం వేదాంత భజన మందిరంగా ప్రజలకు సుపరిచితం. అయితే 1951లో వెం పటి లక్ష్మీనర్సయ్య, వెంపటి సదానందం అడుగు ఎత్తులోని మట్టి వినాయకుడిని నవరాత్రోత్సవాల సందర్భంగా మొదటిసారి ఏర్పాటుచేశారు. నాటి నుంచి నేటి వరకు ప్రతీ ఏడాది ఎలాంటి ఆటంకాలు లేకుండా వేడుకలు నిర్వహిస్తున్నారు. మొదట్లో చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు, స్థానికులు కలిసి చెందాలు లేకుండా వినాయకుడి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే 1984, 1985లో మాత్రం పీవోపీ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. తిరిగి యఽథావిధిగా మట్టి విగ్రహాలనే ఏర్పాటుచేస్తున్నారు. కరోనా సమయంలో సైతం ఉత్సవాలు ఆగలేదు. సుమారు 6నుంచి 7అడుగుల వరకు మాత్రమే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటారు.

లడ్డూ కోసం పోటీ

వేదాంత భజనమందిరం వినాయక శోభాయాత్ర దేవాలయం నుంచి సద్దుల చెరువు కట్ట వరకు సుమారు 4 నుంచి ఐదు కిలోమీటర్ల శోభాయాత్రలో పార్టీలకతీతంగా అందరూ పాల్గొంటారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్‌, పూలసెంటర్‌లలో శోభాయాత్రలో భాగంగా బానుపురి గణేష్‌ ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో లడ్డూ వేలంపాట నిర్వహిస్తారు. పట్టణ ప్రజలందరూ అక్కడికి రావడంతో పాటు జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన అన్నివిగ్రహాల లడ్డూ వేలంపాట అక్కడే నిర్వహిస్తుంటారు. దీంతో వేదాంత భజన మందిరం లడ్డూ వేలం పాట సైతం అక్కడే నిర్వహిస్తారు. ఈ లడ్డూ కోసం భక్తులు పోటీపడుతుంటారు. వేలంపాటలో గత ఏడాది రూ.1.25 లక్షలు పలికింది. అంతకుముందు ఏడాది రూ.1.55 లక్షలు పలికింది. లడ్డూను దక్కించుకోవడం అదృష్టంగా భావిస్తారు. ఇక్కడి వినాయకుడి శోభాయాత్రలో ప్రజాప్రతినిధులు పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. కొన్నేళ్లుగా ఎమ్మెల్యేలు స్వయంగా వినాయకుడి శోభాయాత్ర వాహనాలను నడుపుతూ నిమజ్ఞనంలో పాల్గొంటున్నారు.

వినాయకుడికి పూజలు నా అదృష్టం

74 ఏళ్ల చరిత్ర కలిగిన వేదాంత భజన మందిరం వినాయకుడికి గత 45 ఏళ్లుగా పూజలు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. దాదాపు మట్టి విగ్రహాన్నే ఏర్పాటు చేస్తున్నాం. శోభాయాత్ర అంగరంగవైభవంగా చేపడతాం. కరోనా సమయంలో సైతం వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు చేశాం.

దరూరి సింగరాచార్యులు, పూజారి

Updated Date - Sep 02 , 2025 | 12:39 AM