Share News

పక్షం రోజుల్లో తలకిందులు

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:26 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పక్షం రోజుల్లో సాగు పరిస్థితులు తారుమారయ్యాయి. 15 రోజుల కింది వరకు అనావృష్టి ఉండగా ఇప్పుడు అతివృష్టి నెలకొంది.

పక్షం రోజుల్లో తలకిందులు
మోత్కూరులో జాలువారిన కంది చేను

15 రోజుల క్రితం వరకు అనావృష్టి, ఇప్పుడు అతివృష్టి

వరుస వర్షాలతో జాలు వారుతున్న పత్తి, కంది, మెట్టపంటలు

మోత్కూరు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పక్షం రోజుల్లో సాగు పరిస్థితులు తారుమారయ్యాయి. 15 రోజుల కింది వరకు అనావృష్టి ఉండగా ఇప్పుడు అతివృష్టి నెలకొంది. వానాకాలం సీజన ప్రారంభంలో వర్షాలు లేక రైతులు నానా ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల వరుణ దేవుడి కరుణ కోసం కప్పకాముడు ఆడారు. వరద పాశం తిన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అయినా వర్షాలు కురియక ఆశించిన స్థాయిలో వరి నాట్లు వేయలేదు. రెండున్నర మాసాల్లో మూడు అడుగుల ఎత్తు పెరగాల్సిన పత్తి, కంది తదితర మెట్ట పంటల చేను ఒక్క అడుగు ఎత్తు మాత్రమే పెరిగాయి. పంగ (కొమ్మలు) తోలలేదు. మొక్కలు ఎదగకుండానే పత్తి చేను పూతకొచ్చింది. ఈ సారి దిగుబడులు అంతంత మాత్రంగా ఉంటాయని రైతులు దిగాలు పడుతున్న పడ్డారు. అయితే ఈ నెల 7 నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరుతోంది. బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ వానాకాలం సాగుకు నీటి కొరత తీరిందని రైతులు కొంత ఊరట చెందగా, వారం రోజుల నుంచి వరుసగా రోజూ కురుస్తున్న వర్షాలతో మెట్ట పంటలు దెబ్బతింటున్నాయి. దీంతో రైతుల్లో మళ్లీ ఆందోళన పెరిగింది.

యాదాద్రి భువనగిరి జిల్లాలో...

యాదాద్రి భువనగిరి జిల్లాలో వానాకాలం ఇప్పటివరకు 2,06,523 ఎకరాల్లో వరి, 1,07,710 ఎకరాల్లో పత్తి, 3,037 ఎకరాల్లో కంది, 3,274 ఎకరాల్లో ఇతర మెట్ట పంటలు సాగు చేశారు.

జాలు వారుతున్న పత్తి, కంది చేలు

వారం రోజులుగా ప్రతిరోజూ వర్షం కురుస్తుండటంతో పత్తి, కంది చేన్లలో నేల తడారక జాలువారుతున్నాయి. అప్పుడు వర్షాలు లేక చేలు ఎదగలేదని, ఇప్పుడు రోజూ కురుస్తున్న వర్షాలతో పత్తి చేలల్లో పూత, గూడ(పిందె) రాలుతుందని రైతులు తెలిపా రు. చేను కూడా ఎత్తు పెరగపోవడంతో భారీ వర్షాలకు పత్తి మొక్కలు నేలవాలుతున్నాయని తెలిపా రు. వర్షాలకు తెగుళ్ల బెడత పెరుగుతోంది. నేల ఆర క జాలు వారడంతో జాజు రోగం సోకే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతం లో పత్తి రెండు, మూడు సార్లు ఏరుకున్నాక జాజు రోగం వచ్చేదని, ఇప్పుడు పత్తి ఏరడం ప్రారంభించక ముందే జాజు రోగం వచ్చేలా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు కంది మొక్కలు కూడా జాలుపట్టి కుళ్లి పోతున్నాయంటున్నారు.

పూత, పిందె, ఆకు రాలింది

నాలుగు ఎకరాల్లో పత్తి పంట వేశా. వర్షాలు లేక విత్తిన విత్తనాలు మొలకెత్తక రెండు సార్లు విత్తాను. మొలకెత్తాక కూడా సరైన వర్షాలు లేక చేను ఎత్తు పెరగలేదు. పూత, పిందె వచ్చింది. సుమారు రూ.లక్ష కు పైగా పెట్టుబడి పెట్టా. ఇప్పుడు రోజూ వర్షం కురుస్తుండటంతో పత్తి చేను జాలువారి పూత, పిందె,ఆకు రాల్చింది. ఏంచేయాల్లో తోచడం లేదు.

- బండి నాగరాజు, పత్తి రైతు, లక్ష్మీదేవికాల్వ

నీరు తీసివేసి, పోషకాలు అందించాలి

వర్షాలు అధికంగా కురుస్తున్నందున పత్తి చేన్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పత్తి మొక్కలకు తగిన పోషకాలు అందించేందుకు 19-19-19 లేదా 13-0-45 లీటర్‌కు 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత ఎకరాకు 25 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పోటాష్‌ కలిపి భూమిలో మొక్కకు నాలుగు అంగుళాల దూరంలో వేయాలి. పత్తి చేనులో గుంపులు, గుంపులుగా మొక్కలు ఎండిపోవడం గమనిస్తే అది వేరుకుళ్లుగా భావించి మొక్కల మొదట్లో చుట్టూ వేరు బాగా తడిసేట్టుగా లీటర్‌ నీటికి 2.5గ్రాముల కార్బండిజం ప్లస్‌ మ్యాన్కోజెబ్‌ కల్పిన మిశ్రమం లేదా మూడు గ్రాముల కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ పిచికారీ చేయాలి.

- వీ.కీర్తి, ఎంఏవో, మోత్కూరు

Updated Date - Aug 19 , 2025 | 12:26 AM